సిఎస్ఆర్, కొన్ని ముచ్చట్లు...:-- యామిజాల జగదీశ్

నేను పుట్టి పెరిగింది మద్రాసులో. ఇప్పటి వాళ్ళకు చెన్నై అంటేనే తెలుస్తుందేమో... కానీ నాకు మద్రాసు అని చెప్పడమే ఇష్టం. 1954 డిసెంబర్ 28న టీ.నగర్లోని బజుల్లా రోడ్డులో ప్రయాణాన్ని మొదలు పెట్టి తొలి ఇరవై తొమ్మిదేళ్ళు మద్రాసులోనే గడిపాను. అప్పట్లో ఇంట్లో తప్పించి గడప దాటి బయటకు వస్తే మాట్లాడేదంతా తమిళమే. మిత్రులలో తొంబై శాతం మంది తమిళులే. అలాగే సినిమాలన్నా నాటకాలన్నా తమిళంలో చూడటమే. తెలుగు సినిమాలేవైనా చూసానంటే వాటిని వేళ్ళ మీద లెక్కపెట్టాల్సిందే. అప్పట్లో తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఉన్నది మద్రాసులోనే ఉన్నప్పటికీ నేను తెలుగు నటీనటులను చూస్తుండటమే తప్ప వారి సినిమాలు చూసింది లేదు. 

అంతెందుకు...నా క్లాస్ మేట్ చిలకలపూడి సురేష్ వాళ్ళ పెదనాన్న సి.ఎస్.ఆర్. గారన్న సంగతి కొన్ని సంవత్సరాల క్రితమే తెలిసింది. అదీనూ ఇద్దరం హైదరాబాదుకి మకాం మార్చి కలుసుకున్నప్పుడు. 

మరొక విషయం, మద్రాసులోని చేపాక్ లో ఓ టెస్ట్ క్రికెట్ మ్యాచ్ జరిగినప్పుడు అక్కడికి వచ్చిన హీరో అక్కినేని నాగార్జునను కలిసి మీరెవరో తెలీడం లేదు, వెంకటేషో నాగర్జునో పేరు చెప్తే రాసుకుంటానని నన్ను నేను వార్త పత్రిక ప్రతినిధినని పరిచయం చేసుకున్నానంటే నాకు తెలుగు సినిమా గురించి ఏ మేరకు తెలుసో అర్థం చేసుకోవచ్చు. 

అయినా సీఎస్ఆర్ గారి గురించి ఒకటి రెండు మాటలైనా రాయాలనిపించి విషయంలోకెళ్తున్నాను. ఆ రెండు ముక్కలూ సురేష్ వల్ల తెలుసుకున్నవే. 

నూట డెబ్బయ్ అయిదు సినిమాలలో సీఎస్ఆర్ గారు నటించినప్పటికీ నేను సినిమా థియేరుకి వెళ్ళి చూసిందల్లా ఆయన రామప్పపంతులుగా నటించిన కన్యాశుల్కం ఒక్కటే . అదీనూ నేను 1982 ప్రాంతంలో హైదరాబాదుకి వచ్చినప్పుడు ఆర్టీసి క్రాస్ రోడ్లో ఉన్న సంధ్యా థియేటర్లో చూడటమే.

బి. నాగిరెడ్డి గారు నిర్మాణంలో కె.వి.రెడ్డిగారి దర్శకత్వంలో రూపొందిన మాయాబజార్ చిత్రంలో శకుని పాత్రలో సీఎస్ఆర్ గారు నటించి ప్రశంసలు పొందిన విషయం జగమెరుగు. ఇంతకూ ఈ శకుని పాత్రకు ఆయనైతేనే అచ్చంగా సరిపోతారని పట్టుబట్టి నటింపచేసిన వారు కె.వి. రెడ్డిగారు.

సిఎస్ఆర్ వాయిస్సు ఓ పెక్యూలియర్ వాయిస్సు. అయినా ఆయన గొంతుని అనుకరిస్తూ మిమిక్రీ ఆర్టిస్టులు ఇప్పటికీ చప్పట్లందుకుంటున్నారు.

సీఎస్ఆర్ స్వరం, మాట తీరు తెలుగు భాషను మాట్లాడుతున్నంత కాలం ఆంధ్రుల హృదయాలలో చెక్కుచెదరక ఉంటాయన్నది అతిశయోక్తికాదు. ఆయన తన వాయిస్ లోనే ప్రతిభను చూపి విలక్షణ నటుడిగా రాణించారు.

1907 జూలై 11వ తేదీన జన్మించిన చిలకలపూడి లక్ష్మీనరసింహమూర్తి, తల్లి లక్ష్మమ్మలకు సీతారామాంజనేయులుగారు (సిఎస్ఆర్) నరసరావుపేటలో జన్మించారు. ఆయన తండ్రి తాలూకా ఆఫీసులో గుమాస్తా. 

ఆంజనేయులుగారు నాటకరంగంతోపాటు దాదాపు రెండున్నర దశాబ్దాలు సినీరంగంలోనూ వివిధ పాత్రలను పోషించి అపరిమిత మన్ననలందుకున్నరు. ఆయన ప్రసిద్ధ రంగస్థల గాయకులుకూడా. అలాగే అత్యుత్తమ కారెక్టర్ నటులూనూ.

56 వ ఏట తనువు చాలించిన  సి.ఎస్.ఆర్. ఆంజనేయులుగారి అసలు పేరు చిలకలపూడి సీతారామాంజనేయులు.

వారి పూర్వీకుల నివాసస్థలం కృష్ణాజిల్లా బందరవద్ద సమీపంలోని చిలకలపూడి.  ఆ తరువాత గుంటూరు జిల్లాలోని పొన్నూరులో ఉండేవారు.

స్కూల్ ఫైనల్ వరకూ చదివి కొంత కాలం కో ఆపరేటివ్ సూపర్ వైజరుగా ఉద్యోగం చేసిన ఆయన దృష్టి నాటకరంగంపై మళ్ళింది.

నాటి ఆంధ్ర నాటకరంగలో స్థానం నరసింహారావు, డి. వి. సుబ్బారావు, పారుపల్లి, జొన్నవిత్తుల, అద్దంకి, కపిలవాయి వంటి హేమాహేమీలతో పోటీపడి నటించి తన ప్రతిభతో రాజిల్లి అనతికాలంలోనే తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని దక్కించుకున్నారాయన.

ఆయన శ్రీకృష్ణుడిగా నటించి ఎనలేని ఖ్యాతిని ఆర్జించారు. అలాగే భక్తరామదాసులోని "రామదాసు" పాత్ర, భక్తతుకారాంలోని "తుకారాం" పాత్ర సైతం ఆయనకు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ఆయన ఏ పాత్రలోనైనాసరే పాత్రకు తగినట్లు అందులో ఒదిగిపోయేవారు.

ఎన్నడూ ఏ నటుడినీ, ఏ పాటనూ, ఏ అభినయాన్నీ అనుకరించక తనదైన బాణీలో స్వయంకృషితో, సృజనాత్మక శక్తితో రాణించిన మహానటులు సిఎస్ఆర్ గారు. 

పాటలకైనా, పద్యాలకైనా ఆయన వాటికి తగినట్లు హావభావాలు ప్రదర్శించేవారు.  ఆయన అభినయం, పాత్రోచిత వాచికంలో ఎక్కడా గతి తప్పేదికాదు. అందుకే ఆయన అనతికాలంలోనే అన్ని విధాలుగానూ ఉత్తమ నటుడిగా కొనసాగగలిగారు.

ఆయన వెండితెరపై కనిపించిన తొలి చిత్రం ద్రౌపది వస్త్రాపహరణం. ఈ సినిమాలో ఆయన శ్రీకృష్ణుడిగా నటించారు. అలాగే  భక్తతుకారాంలోనూ ఆయన తుకారాం పాత్రను పోషించి ఔరా అనిపించుకున్నారు.

తల్లి ప్రేమ, సుమతి, చూడామణి, వేంకటేశ్వరమహాత్మ్యం, భీష్మ,  పరమానందయ్య శిష్యులు, మాయాబజారు, పాతాళభైరవి, దేవదాసు తదితర చిత్రాలలో నటించిన సిఎస్ఆర్ ఒకటికి పదిసార్లు సంభాషణ ఎలా చెబితే బాగుంటుందోనని ఆలోచించేవారు. తన పాత్రకు అన్ని విధాలా న్యాయం చేసేవారు. ఆయన పోషించిన హాస్యపాత్రలు కూడా గణనీయమైనవే.

1961లో మళయాలంలో వచ్చిన భక్తకుచేల చిత్రంలోనూ సిఎస్ఆర్ నటించడం విశేషం.

దేశభక్తుడు. జాతీయవాది అయిన సిఎస్ఆర్ అస్పృస్యతానివారణ కోసం "పతిత పావన" అనే నాటకం రాయించి ఆంధ్రదేశంలో ప్రదర్శించి మన్నన లందుకున్నారు.

సుభాస్ చంద్రబోస్ ఇండియన్ నేషనల్ ఆర్మీ ఉద్యమానికి స్పందించి 'తుకారాం' అనే నాటకం ద్వారా పది వేల రూపాయలు విరాళంగా ఇచ్చిన సిఎస్ఆర్ నిరాడంబరులు. ధనిక పేద అనే తారతమ్యాలు చూడని నిష్కల్మష హృదయులైన సిఎస్ఆర్ గారు 1963 అక్టోబర్ ఎనిమిదో తేదీన తుది శ్వాసవిడిచారు. 

సిఎస్ఆర్ ఆంజనేయులుగారికి ఇద్దరు చెల్లెళ్ళు రుక్మిణి. సీతమ్మ. ముగ్గరు తమ్ముళ్ళు. వారిలో ఒక తమ్ముడు సి.  నాగేశ్వరరావుగారు కూడా సినీపరిశ్రమకు చెందినవారే. అసోసియేట్ దర్శకుడిగా గుర్తింపు పొందిన నాగేశ్వరరావుగారు మల్లీశ్వరి, భక్తపోతన, షావుకారు వంటి చిత్రాలలో నటించారు. 

సిఎస్ఆర్ గారు మద్రాసులోని మైలాపూర్లో ఉంటున్నప్పుడు నాగేశ్వరరావుగారు కోడంబాక్కంలో నివసించేవారు. నాగేశ్వరరావుగారి కుమారుడే నా క్లాస్ మేట్ సురేష్.

"మీ పెదనాన్నగారు గుర్తేనా?" అని అడిగితే "బాగా గుర్తేనంటూ ఆయన తెల్ల వెంట్రుకలు  తీస్తే కానుకలిస్తానంటే తీసేవాళ్ళం. ఆయనకు చిన్న పిల్లలంటే ఎంతో ఇష్టం. మాతో సరదాగా ఉండేవారు. ఆయన మరణించేనాటికి నా వయస్సు ఏడేళ్ళు" అని సురేష్ చెప్పాడు.

సిఎస్ఆర్ గారి మరొక తమ్ముడు సి. వెంకటరత్నం (సి.వి. రత్నంగా సుపరిచితులు) భరణి పిక్చర్స్ అండ్ స్టూడియోస్ ప్రతినిధిగా ఉంటూ భానుమతీ రామకృష్ణగారు నిర్మించిన చిత్రాలన్నింటికీ ప్రొడక్షన్ మేనేజర్ గా వ్యవహరించారు.

ఇంకొక తమ్ముడు రైల్వేలో పని చేస్తుండేవారు.

సీఎస్ఆర్ గారికి నలుగురు కుమార్తెలు -  ప్రఫుల్ల, పద్మావతి, లక్ష్మి (అమ్ములు అని పిలిచేవారు), మంజుల. ఒక కుమారుడు - ప్రభు నటరాజ్.

సిఎస్ఆర్ గారి కి సంబంధించి కొన్ని ముఖ్యాంశాలు...

ఆయన నటించిన తొలి సినిమా రామదాసు. కానీ ఈ సినిమా విడుదల కాలేదు.

శ్రీ లలిత కళా దర్శ మండలి ఐనే నాటక సంస్థను స్థాపించి తుకారాం నాటకాన్ని ఆ సంస్థ తరఫున అనేక ప్రదర్శనలు ఇచ్చారు. 

ఆయన పద్యానికి అయిదు వందలు అడిగినప్పుడు హెచ్. ఎం. రెడ్డిగారు నోరు వెళ్ళబెట్టారట.

ద్రౌపది వస్త్రాపహరణంలో నటించడానికి ఆయన అక్షరాలా అయిదు వేల రూపాయలు పొందారు. నిజానికి ఆరోజుల్లో సినిమాకు అయిదు వందల రూపాయలు మించి పారితోషికం ఇచ్చేవారు కాదు. 

1939లో వచ్చిన శ్రీ వేంకటేశ్వర మహాత్మ్యం సినిమాలో సిఎస్ఆర్ గారు వేంకటేశ్వరుడు పాత్రలో నటించగా శాంతకుమారి పద్మావతి పాత్ర పోషించారు.

ఆయన దర్శకత్వంలో ఆరంభమైన శివగంగ, రిక్షావాలా సినిమాలు ఆర్థిక సమస్యలతో మధ్యలోనే ఆగిపోయాయి.

ప్రచారామంటే అస్సలు గిట్టదు. ప్రతిభతో పైకి రావాలిగానీ ప్రచారాలతో పైకొస్తే ప్రయోజనం లేదన్నది ఆయన మాట.

నటనలో ఒక విధంగా ఆయనను గురువని నాగయ్యలాంటి మహానుభావుడు పేర్కొన్నారు.

ఆయన అజాతశత్రువు. కుల మత వివక్షలకు ఆజన్మవిరోధి. ఉన్నత సంస్కారి. మానవతావాది.

కొల్హాపూరులో సినిమా షూటింగ్ కోసం వెళ్ళినప్పుడు ఆయన గోంగూర పచ్చడి, ఆవకాయ తీసుకెళ్ళారు. కందిపచ్చడంటే ఇష్టం.

ఆయన వేదికపై పద్యం పాడితే వన్స్ మోర్లు మామూలుగా చోటుచేసుకునే సంఘటనలు.

గృహప్రవేశం సినిమాకోసం బాలాంత్రపు రజనీకాంతరావు గారి సంగీతంలో ఆయన పాడిన తులశమ్మక్కా ....పాటకు విశేష ఆదరణ లభించింది. 

తల్లి ప్రేమ సినిమాలో కన్నాంబతో కలిసి ఆయన పాడిన పాట - ప్రేమనిదానము....పాట ఎంతో ఆర్ద్రతో కూడినది. 

ఆయన ఏ పాట పాడినా రచయిత రాసిన మాట ఆయన కంఠంలో అమృతధారలా ఆహ్లాదాన్ని కురిపించేది.

కామెంట్‌లు
suryanarayana చెప్పారు…
Thank you Jagadish. You have brought some interesting information regarding CSR affectionately called and thereby about relationship of our classmate Suresh. Really very good your simple language Suryanarayana