మా ఊరు బస్టాండ్
చుట్టుముట్టు నాలుగూళ్ళ కూడలి ఏ ఊరోళ్ళు ఎటు పోవాలన్నా అక్కడికొచ్చే బస్సెక్కాల, దానికి దగ్గర్లోనే బ్రిటిష్ వారి కాలంలో పది పన్నెండు ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడి ఓవెలుగు వెలిగిన ఆస్పత్రి క్రమంగా తన ప్రాభవం కోల్పోయి మూగబోయినిల్చి వుంది అదుగో ఆ ఆస్పత్రి ప్రాంగణాన్నే తన ఆవాసంగా మల్చుకున్న పొరుగూరి అంధ యువకుడొకడు తెల్లారిలేస్తూనే బస్టాండ్ కొచ్చి ఏ ఊరి బస్సు ఎప్పుడొస్తుందో? ఎప్పుడు పోతుందో ఠక్కున చెబుతూ స్వయం ప్రకటిత కంట్రోలర్ కొలువు చేస్తుండేవాడు అతను ఏ వ్యక్తితోనైనా ఒక్కసారి మాట్లాడ్తేచాలు ఇక ఎప్పుడు కలిసినా గొంతు గుర్తుపట్టి తనే ముందుగా పలుకరించే వాడు ప్రయాణీకులు తమ సంతోషం కొద్ది ఇచ్చిన పావులో.. బేడో దాసుకునేటోడు తిండి మాత్రం అక్కడున్న హోటల్ ముసలమ్మ పెడుతుండేది అక్కడ కుదరని నాడు మా ఊరు మొగదల్లో వుండే గుంటూరు రెడ్లవాడకు పొయ్యి ఏ ఇంటి ముందు నిలబడ్డా ఆ ఇంటోళ్ళు అర్ధం చేసుకుని ఆకులో ఇంత అన్నం కూరలు తీసుకొచ్చి చేతికిస్తే అక్కడే కూర్చుని తినిపొయ్యే వాడు కాలంసాగిపోతూనేవుంది
దాని ప్రవాహంలో ప్రతిదీ మార్పుకులోనైనట్టే ఆ అంధుని జీవితంలోనూ ఓ అనూహ్య పరిణామం చోటుచేసుకుంది
ఉత్తర భారతదేశపు ఏ లారీ వాడో ఓరోజు రాత్రి ఓ పిచ్చి యువతిని తీసుకొచ్చి సరీగ్గా అంధుడు పడుకునే ఆస్పత్రి ముందట వదిలిపెట్టిపోయాడు
ఆయువతి వేష భాషలు మనవి కానప్పటికీ అంధుడికి హిందీ రావడంతో ఎలా కలిసిందో!?
ఆఇద్దరిమధ్య దోస్తానా కల్సింది పిచ్చియువతి అంధుని నీడగా మారిపోయింది వారిని చూసిన ప్రయాణీకులంతా దేవుడు గొప్పోడు మన గుడ్డోనికో పిచ్చి దాన్ని జతజేసిండు అన్కుంటూ ఆ జంటను మనస్పూర్తిగా ఆమోదించి అక్కున చేర్చు కున్నారు వాళ్ళెప్పుడు మావూర్లో ఏఇంటి ముందుకెళ్ళి నిల్చున్నా అడక్క ముందే ఆకుల్లో అన్నం పెట్టి తెచ్చిస్తే ఇంటిముందు ఓమూలకు కూర్చుని ఒకే ఆకులో ఇద్దరూ కలిసి తింటూ కబుర్లు చెప్పుకునే వాళ్ళు
కాలం గడుస్తున్నా కొద్ది ఊళ్ళో వాళ్ళకు వాళ్ళో తీసేయరాని బంధువులై పోయారు
ఏ ఇంట్లో ఏకార్యం జరిగినా
వాళ్ళకోసం ఓ విస్తరినిండా అన్నం కూరలు తీసి పెట్టుంచే వాళ్ళు వాళ్ళొచ్చి తినిపోతే చాలు ఎంతోసంతోషించేవాళ్ళు
రోగమన్నది ఎలాంటి వారికైనా తప్పదన్నట్టు కొన్నాళ్ళకు అంధుడికి ఏదో రోగం దాపు రించింది తిరుగుతూ తిరుగుతూనే ఓరోజు రాత్రి రాలిపోయాడు విషయం తెలిసిన ఊరంతా
స్వచ్ఛందంగా ముందుకొచ్చి అతణ్ణి మట్టి చేసింది
వస్తువులేనప్పుడు దాని ఛాయ కూడావుండదన్నట్టు మరునాటి నుండి పిచ్చావిడ ఏమై పోయిందో ఎరిగినవారు లేరు
***

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి