అంగీరసాన్వయుడు, ఆర్ష విజ్ఞాన ఖని
గౌతమీనది జన్మ కారకుడు,పారగుడు
బ్రహ్మమానస పుత్రి, పణతి,సుందర గాత్రి
అతిలోక సుందరిని, అంచయానహల్యను
పందెమున గెలుపొంది బ్రహ్మగిరి కొండపై
కాపురంబుండెను గౌతముడు,సత్తముడు
మంత్ర ద్రష్టయునితడు మందహాసుండితడు
నిగ్రహుడు,స్నేహితుడు,నిత్యాగ్నిహోత్రుండు
వ్యవసాయ,జల శాస్త్ర పరిపాలనలో మేటి
చిటికెలో పండించు ఘటికుండు, కర్షకుడు
బ్రహ్మకాలమునందు పంటలను పండించి
కరువు దరి రాకుండ కాపాడు హితకరుడు
కరువు కాలములోన కలశ జలములతోడ
పండించి మునిజనము బాలించె కరుణతో
కపటముని గణమంత గౌతముని తరలింప
మాయధేనువునటకు మంత్రించి పంపారు
పంటలను నాయావు పాడుచేయుచునుండ
గౌతముడు బెదిరించె గడ్డిపరకను విసరి
గడ్డపరకను తాకి అడ్డముగ నాయావు
కిందపడి మరణించె బొంది శ్వాసను విడిచి
గోహత్య పాతకము కూడెనని గౌతముడు
మిగుల చింతను పొంది మిత్తిగొంగను వేడె
ముక్కంటి నగవుతో మునివరుని యోదార్చి
కపటర్షులను కసరి శపియించె నశియింప
గౌహత్య పాతకము కడచుటకు పలుమార్లు
గంగలో మునుగుచూ లింగమును పూజింప
నానతిచ్చెను శివుడు అడిగె గౌతముడిట్లు
గంగనట దింపమని కరువులను పాపమని
గౌతముని పేరనది గౌతమీ నదియయ్యె
గోహత్య నెపముతో గోదావరీ యయ్యె
పాపికొండల పారి పాపముల పోగొట్టె
కవనశ్రీ చక్రవర్తి
అడిగొప్పుల సదయ్య
కరీంనగర్
9963991125
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి