ఏ గూటి చిలుక ఆ పలుకు పలుకుతుంది. :--సేకరణ తాటి కోల పద్మావతి గుంటూరు.

 ఒక మర్రి చెట్టు పై 2 చిలుకలు ఉండేవి. ఒక బోయవాడు వలపన్ని ఆ రెండిటిని పట్టుకున్నాడు. దారిలో వెళుతూ వెళుతూ ఒక చిలుకను ఒక సాధువుకు మరొక చిలుకను ఒక గజదొంగ కు అమ్మేశాడు. అలా ఒక చిలుక సాధువు ఇంట్లో పెరుగుతున్నది. మరొక చిలుక గజదొంగ స్థావరంలో లో చేరు కొన్నది. ఆ సాధువు తన అభిరుచులకు తగినట్లుగా వాటికి పేర్లు పెట్టుకున్నాడు. సాధువు ఇంట్లో చిలుకకు రాముడని, గజదొంగ స్థావరంలో లో చిలక కు దుర్ముఖుడు పేర్లు పెట్టుకొన్నాడు. వారి వారి ఇండ్లలో తాము స్వీకరించే ఆహార పానీయాలు ఇచ్చేవాళ్ళు. వారు మాట్లాడే మాటలన్నీ వాటికి నేర్పించ సాగారు. అవి చిలుక పలుకులు పలక సాగాయి. విన్నవి విన్నట్టుగా పలికేవి.
రాముడు అనే చిలుక సాధువు ఇంట్లో మధురంగా మాట్లాడటం సాత్వికమైన ఆహారం తింటూ అతిథుల్ని గౌరవించే పద్ధతుల్ని నేర్చుకొన్నది.
దుర్ముఖుడు అనే చిలుక గజదొంగ ఇంట్లో మాట్లాడే దురుసు మాటల్ని విని హింస కార్యాలను చూడడం వలన దురుసు మాటలు నేర్చుకొన్నది.
కొన్నాళ్ళకు ఆ రెండు చిలుకలు తమ తమ ఇళ్ల నుండి తప్పించుకొని బయటకు వెళ్ళిపోయాయి. రాముడనే చిలక మామిడి చెట్టు మీద నివసించ సాగింది. దుర్ముఖుడు అనే చిలుక ఒక ఒక పెద్ద మర్రి చెట్టు పైన ఉంటూ వచ్చింది.
వేసవికాలంలో ఒకరోజు ఎండలో ఆ దారిలో వెళ్తున్నా ఒక బ్రాహ్మణుడు అలసిపోయి సేద తీర్చుకుందామని దుర్ముఖుడు ఉండే మర్రిచెట్టు కిందికి చేరాడు. ఆ వ్యక్తిని చూడగానే దుర్ముఖుడు చిలుక ఆ చెట్టుపై నుండి పక్షులతో ఎవరో మనిషి ఇక్కడికి వచ్చాడు వాడిని దోచుకుందాం రండి . వీడెవడో శత్రువు కావచ్చు పంపుదాం పదండి అని అరవ సాగింది. తోటి పక్షులతో ఎగిరి వచ్చి ఆ బ్రాహ్మణుడు ని తలపైన ముక్కుతో పొడవ సాగింది. ఆ బ్రాహ్మణుడు భయపడి పారిపోయి మామిడి చెట్టు కింద కీ చేరాడు. ఆ చెట్టుపై ఉన్న రాముడు అనే చిలుక స్వామి ఈ చెట్టు కిందికి రండి. ఎండ విపరీతంగా ఉంది. ఇక్కడ సేద తీరవచ్చు. మామిడి కాయలు ఇస్తాను తినండి పక్కనే ఉండే బావిలో నీళ్లు ఉన్నాయి తాగండి అని మృదుమధురంగా ఆహ్వానించింది. ఆ బ్రాహ్మడికి చాలా సంతోషం వేసింది.
చూడటానికి ఏమో ఈ చిలుకలు2 ఒకే తల్లి పిల్లలుగా ఉన్నాయి. కానీ నీ పెరిగిన చోట్లు వేరు కావడం వలన వాటి స్వభావాలు ఎంతగానో మారిపోయాయి. అంతే మరి అనుకొన్నాడు ఆ బ్రాహ్మణుడు.
పిల్లలారా మీరు కూడా మంచి వాతావరణంలో పెరగాలి. మీ తల్లిదండ్రుల వద్ద స్నేహితుల వద్ద మంచిని నేర్చుకోవాలి. బాల్యంలో సద్గుణాలు అలవడితే పెద్దవాళ్ళయ్యాక మంచి వ్యక్తులుగా తయారయి సమాజానికి మేలు చేసిన వాళ్లు అవుతారు.
కామెంట్‌లు