నే ననుకున్న ననుకున్నా నొకనాడు
స్వేచ్ఛ అంటే హద్దులు లేక ఆంక్షలు లేనీ
ఏ బంధనాల భయాలు లేని అనంతమైన సృష్టిలో..
ఆశయాల సౌధంలో.. ఆశల గమ్యం వైపు..
మహోన్నతంగా.. ఎదిగిపోవడమో ఎగిరిపోవడమో ఎలిగిపోవడమో...
నే ననుకున్న ననుకున్నా నొకనాడు
అణిచివేత లేక ఒత్తిళ్లు లేక
మాటని తూటాల పేల్చడమే స్వేచ్ఛని..
నచ్చినది ఒంటికెక్కించి నచ్చినది చుట్టుకోవడమే స్వేచ్ఛని..
నచ్చినట్టు ఒనరిస్తూ నచ్చినట్టు పైకం చెల్లిస్తూ
మనస్సాక్షికి నచ్చిన నమ్మకాన్ని ఎత్తుకోవడమే స్వేచ్ఛని..
కానీ నే గుర్తించ గుర్తించా నేనీనాడు
నేనీ బాహ్య ప్రపంచపు బానిసనని!
నా సంతోషపు తాళంచెవి ఇంకొకరి సొత్తని,
ఒకరి మెచ్చుకోలుతో మురిపూ,ఒకరి నిందలతో కుంగూ..
ఇతరుల చూపుల అద్దంలో నా రూపూ,
ఒకరి ఓదార్పుల కొరకు నా చూపూ,
నా భావాల కీలుబొమ్మ అనామకునికి కూడా దాసోహమేగా...
నేనంటున్నా నంటూన్న నికమీదట
స్వీయ గుర్తింపే నిజమైన స్వేచ్ఛని!
ఏ కర్ణకఠోర తుఫానుకూ బెదరక
ఏ జ్ఞాపకాల అలజడిలో చెదరక
ఏ ఇతరుల తీర్పులకు వదరక...
నేను నాది అనే అహాన్ని విదిలించుకుంటూ,
స్థితప్రజ్ఞతతో ప్రశాంతమైన చిరునవ్వుతో...
ప్రస్తుతంలో జీవిస్తూ నా ఆత్మగౌరవానికిదే పట్టమంటూ..
నా మనఃసామ్రాజ్యపు సార్వభౌముని నేనంటూ
లోకం తీరేదైనా చెదరని నా మనసే నా స్వేచ్ఛంటూ..
"సుఖదుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ"
ఈ లిఖితాక్షరాలే అవుతాయి మీ స్వేచ్ఛకూ బాటలు..
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి