పూర్వ వైభవం (కథ) రచయిత: సరికొండ శ్రీనివాసరాజు

  గణపవరం అనే గ్రామంలోని ఉన్నత పాఠశాలకు నరసింహం అనే ఉపాధ్యాయుడు కొత్తగా వచ్చారు. ఆ గ్రామంలోనే అన్ని సౌకర్యాలు ఉండటంతో అక్కడే నివాసం ఉండేవారు. ఆ ఉపాధ్యాయుడు పిల్లలను కొట్టకుండా, తిట్టకుండా, కొట్టకుండా ప్రేమతో చదువు చెప్పేవాడు. నైతిక విలువలను నేర్పేవారు. తీరిక సమయాల్లో నిరక్షరాస్యులైన పెద్దలకు చదువు నేర్పే ప్రయత్నంలో ఉండేవారు. గ్రామంలోని వారితో సన్నిహితంగా ఉంటూ నిరుపేదలకు సేవా కార్యక్రమాలు చేసేవాడు. ప్రతి పండుగనూ గ్రామస్థులందరితో కలిసి చేసుకునేవాడు.
       వినాయక చవితి దగ్గర పడుతుండటంతో పాఠశాలలోని విద్యార్థులు అందరికీ, గ్రామస్థులు అందరికీ ఒక పోటీ పెట్టారు నరసింహం గారు. ప్రతి ఒక్కరూ అందమైన మట్టి గణపతులను తయారు చేయాలి. ఎవరైతే అందంగా తయారు చేస్తారో వారికి విలువైన బహుమతి అని. అందరూ పోటీపడి సుందరమైన మట్టి గణపతులను తయారు చేసినారు. అత్యంత అందంగా తయారు చేసిన శివానీ అనే అమ్మాయిని విజేతగా ప్రకటించారు. 
       నరసింహం గారు ఇలా అన్నారు. " ఓ ఆత్మీయులారా! మీరు తయారు చేసిన మట్టి గణపతులనే మీరు పూజించండి. ఉచితంగా పేదవారికి పంచి పెట్టండి. మట్టి విగ్రహాలను నిమజ్జనం చేయడం వల్ల చెరువులకు ఔషధ గుణాలు పెరుగుతాయి. ఆ నీటిని తాగడం వల్ల మన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అందానికి, ఆకర్షణకు లోనై ప్లాస్టరాఫ్ పారిస్ తో తయారు చేసిన విగ్రహాలను నిమజ్జనం చేయడం వల్ల ఎన్నో నష్టాలు ఉన్నాయి. జిప్సంను వేడి చేయగా ప్లాస్టరాఫ్ పారిస్ ఏర్పడుతుంది. ఆ విగ్రహాలు నీటిలో కలగడానికి చాలా రోజులు పడుతుంది. ఆ ప్లాస్టర్ ఆఫ్ పారిస్ నీటిలో కరగక చెరువు అడుగు భాగంలో ఒక పొరలాగా ఏర్పడుతుంది. దీంతో వర్షాలు వచ్చినప్పుడు వర్షపు నీరు భూమిలోకి ఇంకకుండా బయటికి వెళ్ళిపోతుంది. ఆ ప్రాంతంలో భూగర్భ జలమట్టం బాగా తగ్గిపోతుంది.  ఈ విగ్రహాలను ఆకర్షణీయంగా కనబడడానికి రసాయనిక రంగులను వాడుతారు. ఈ విగ్రహాలను నిమజ్జనం చేసిన చెరువు నీటిని తాగడం వల్ల కిడ్నీ, నాడీ సంబంధిత వ్యాధులు, శ్వాసకోశ వ్యాధులు, రక్తం, చర్మ సంబంధిత వ్యాధులు వస్తాయి. ఆ చెరువులోని ఆక్సిజన్ లెవెల్స్ బాగా తగ్గిపోతాయి. దీంతో చెరువులోని ప్రాణాలు మరణిస్తాయి. అందుకే మట్టి గణపతులనే పూజించండి." అని. ప్రజలు తాము తయారు చేసిన మట్టి గణపతులనే పూజిస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఇరుగు పొరుగు గ్రామస్థులనూ జాగృతం చేశారు. అలాగే వినాయక చవితి నాడు నరసింహం పంతులు అంతకు ముందే కొంతమంది కళాకారులతో సాధన చేయించిన "వినాయక విజయం" నాటకాన్ని ప్రదర్శింపజేశారు. ఆ గ్రామానికి పూర్వ వైభవం వచ్చింది. 
        

కామెంట్‌లు