"మా పిల్లల ముచ్చట్లు" కవర్ పేజీ చేసింది మా పిల్లలే .. : -- సమ్మెట ఉమాదేవి ఉన్నత పాఠశాల పిల్లలు.. 'నేషనల్ మీన్స్ మెరిట్ స్కాలర్ షిప్' టెస్ట్ రాస్తే..  అందులో ఎంపికయిన పిల్లలకు నెలకు 500 వంతున  స్కాలర్ షిప్ వస్తుంది. నేను ముత్యాలంపాడు ఉన్నత పాఠశాల పనిచేసినప్పుడు కొద్దిమంది విద్యార్థులు ఈ స్కాలర్ షిప్ ని పొందారు. పేదరికంలో మగ్గుతున్న పిల్లలకు, ఈ చిన్న మొత్తం దేనికో దానికి అవసరమై వారి విద్యావకాశాలను తీరుస్తుంది. 
చెప్పుకోవాలి గానీ ఒక్కో విద్యార్థిదీ ఒక్కో కథ.
         ఈ సొమ్ము విద్యార్థుల పేరు మీద జీరో అకౌంట్ పై బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది. ఆ డబ్బును కూడా పిల్లల దగ్గర నుండి తీసుకుని తాగి తందనాలు తండ్రుల కథలు నాకు ఎన్నో తెలుసు. కోరం రవీందర్ ప్రతీనెల ఆ స్కాలర్షిప్ సొమ్ములు తీసుకొచ్చి తల్లి చేతిలో పెట్టేవాడు. ఇంటి అవసారాలకై  తండ్రి ఆ డబ్బు తనకే ఇవ్వాలని ప్రతీ నెలా గొడవ పెట్టుకునేవాడు. ఒక నెల ఆ తండ్రి పంతం పట్టి, కొడుకుతో పాటు రెండు మూడు తండాలు దాటి మండల కేంద్రంలోని బ్యాంకుకి వెళ్ళాడు. ఆ డబ్బులు తనకు అర్జెంటుగా కావాలని కావాలంటే మళ్ళీ ఒక వారం రోజుల్లో తిరిగి ఇచ్చేస్తాను అని కొడుకును అడిగాడు. కొడుకు వినలేదు.  కనీసం 300 ఇమ్మన్నాడు. నా దగ్గర ఐదు వందల నోటు మాత్రమే ఉంది చిల్లర లేవు ఇది నేను మార్చను అన్నాడు కొడుకు. ఆ తండ్రి అందరూ వినేలా తిట్టాడు. అయినా ఈ అబ్బాయి వినలేదు. ఇక లాభంలేదని బస్ ఎక్కి "టిక్కెట్ నువ్వే తీసుకో  నా దగ్గర డబ్బులు లేవు. ఇప్పుడు కూడా మార్చవా..?" అని అడిగాడు. సరే అయితే నడుద్దాం పదా! అని బస్ దిగి నడవడం మొదలుపెట్టాడు ఈ అబ్బాయి. దారంత తండ్రితో తిట్లు తింటూ ఎనిమిది మైళ్ళు నడిచి వాళ్ళ తండాకు చేరుకుని తల్లి చేతిలో ఆ సొమ్ము పెట్టాడు. 
ఇన్ని సమస్యల నడుమ చదువుకోవడం పిల్లలకు ఓ పోరాటమే. అదిగో అలా అంతటి సంఘర్షణల మధ్య చదువుకుని.. ఒక పక్కన ఫోటోగ్రహీతో కొద్దిపాటి ఆదాయాన్ని సమకూర్చుకుంటూ ఇప్పుడు MSC చేస్తున్నాడు. ఈ రవీందరే మా పిల్లల ముచ్చట్లు కి కవర్ పేజ్ డిజైన్ చేసాడు. మా పిల్లల ముచ్చట్లకి మా పిల్లలే కవర్ పేజీని  రూపిందించడం కంటే వేరే  వేరే ఆనందం ఏముంటుంది. GOD BLESS YOU నాన్నా!

కామెంట్‌లు