పితృదేవోభవ: -జె.నిర్మల సిద్దిపేట

 సీసమాలిక:                    
తడబడు నడకల తప్పటడుగు గాంచి
తనవేలు నందించి తండ్రి నడుపు
బ్రతుకు నీడ్చుకొరకు బాధలన్నిటినోర్చి
కడుపు నింపుటకును కష్ట పడను
చదువు లెన్నియొ నేర్పి సంస్కారములుదెల్పి
సాగుచుండు నతడు 
జగతియందు
జీవిత విలువల శ్రేష్టత దెలిపేటి
పితృమాట లెప్పుడు  ప్రియము నిచ్చు
తనకెంత బాధైన తన్మయత్వముజెంది
తనయుల యున్నతే ధర్మమనియు
తనకన్న గొప్పగా ధరణిన వెల్గేటి
బిడ్డల జూసియు ప్రీతి బొందు
కఠిన మాటవెనుక కరుణ హృదయముండు
తండ్రి మనసెరిగి తనయు లున్న
భావిజీవితమంత పసిడిగా మారియు
కోరిక దీరును భూరి గాను
నాన్నబాధ లిపుడు నవనిలో నెరుగరు
తనుతండ్రి యైనను తల్లడిల్లు
తే.గీ
కంటి రెప్పలా రక్షించు కన్నతండ్రి
బిడ్డ వృద్ధిని కాంక్షించె ప్రేమ మూర్తి
వెన్నుదట్టి ధైర్యము నిచ్చె వేద జ్ఞాని
కష్టనష్టాల కోర్చేటి ఘనుడు యతడు

కామెంట్‌లు