ఈరోజు అనువాద దినోత్సవమని ఎక్కడో చదివాను. అందుకోసం రెండు అనువాద కవితలు రాశాను. వీటికి మాతృక తమిళం. రాజా చంద్రశేఖర్ అనే రచయిత రాశారు. నాకెంతో ఇష్టమైన కవులలో ఈయనొకరు.
1
చిన్నారి భావాలు
/////////////////////
తొలి పంక్తి నుంచి
ఓ సీతాకోకచిలుక ఎగిరింది
రెండో పంక్తి నుంచి
మెరిసింది హరివిల్లు
మూడు, నాలుగు పంక్తుల నుంచి
ఓ వెదురు చతురతతో
వేణువు నాదం పుట్టించింది
అయిదో పంక్తిపై
జల్లులు నాట్యమాడాయి
సంగీతానికి అనువుగా
ఆరు, ఏడు, ఎనిమిది పంక్తులలో
జింకలు పరుగెత్తాయి
నెమళ్ళు నర్తించాయి
తోట మాటలూ
వినిపించాయి
తొమ్మిదో పంక్తిని
తుడిచిపెట్టి పోయిందో మేఘం
పదో పంక్తిలో
మరణించిన ఓ వృద్ధుడు
తగలబడుతున్నాడు
పదకొండో పంక్తిలో
పుట్టిన శిశువుకు
తాను రాసిన ఈ కవితకు
మొదటి పంక్తి నుంచి
సీతాకోకచిలుక అనే
నామకరణం చేసింది
అది తన పేరు చెప్పుకుంటూ
విహరిస్తోంది వనమంతా
2
ఇద్దరం
----------
కిటికీ పక్కన సీటులో
కూర్చోవచ్చా అని
అడిగిన అమ్మాయికి
చోటిచ్చి
నేనివతల కూర్చున్నాను
ప్రయాణం ముగిసేవరకూ
మాట్లాడుకోలేదు పరస్పరం
అయినా
ఇద్దరకీ అలవాటైపోయింది
ఆమెకు ప్రకృతీ
నాకు ఆమెను చూస్తూ
ఆస్వాదించడం
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి