నాలుగు రెక్కల మనిషి ||;-మచ్చరాజమౌళిదుబ్బాక9059637442
రెప్పవాల్చని 
రెక్కలుజార్చిన స్వేద బిందువులు
లెక్కబెట్టని క్షణాలపై
తివాచీ పరుస్తూ మురుస్తున్నప్పుడల్లా 
కఠిన పాషాణం సైతం కన్నీరై పారుతోంది
మౌనం మాట మరిచి నిర్ఘాంతపోతోంది

పరిచయమే లేని మనసుతో 
ప్రాణం కంటే మిన్నగా ప్రేమిస్తుంది
తృణప్రాయంలా జీవితాన్ని 
అర క్షణంలో అర్పిస్తుంది 
సాయపడడమొక్కటే నిజమని శ్వాసిస్తూ

నిత్య సంతోషి తను
అనురాగపు మమకారాన్ని 
ఆద్యంతం పూయిస్తుంది
నాలుగు రెక్కలు మొలిపించుకుని
నలుగురినీ మెప్పిస్తుంది
నిష్కల్మషమైన ప్రేమను నిండారా ఒలకబోస్తూ

అలసి అలసి నిద్రకుపక్రమించిన పగలు
రాత్రిని నిద్రలేపుతుంది
తెల్లవార్లూ జాగారంచేసిన రాత్రి 
వెలుతురు చినుకులను చూసి వెళ్ళిపోతుంది

తనకు రాత్రి - పగలూ తేడా తెలియదు 
శబ్ధం నిశ్శబ్ధంలో కలిసిపోతున్నా
అనుబంధాలను పెనవేసుకొనే ఉంటుంది
ఆత్మీయతను కురిపిస్తూనే ఉంటుంది
సహనానికి భూమాతగా సౌశీల్యతకు వారధిగా
భువిపై జన్మించిన అమ్మ
ఆమె మన అమ్మ..... 



కామెంట్‌లు