వేలిముద్రల చరిత్ర;-కంచనపల్లి వేంకట కృష్ణారావు 9348611445

  తల్లిగర్భంలో పిండం రూపుదిద్దుకున్న నాలుగు నెలలకే వేళ్ళ మీద ముద్రలు అంటే శంఖు చక్రాలుఏర్పడుతాయి!ఒకసారి ఏర్పడిన వేలిముద్రలు జీవితాంతం ఉంటాయి.ఒకవేళ ఏదైనా కారణం చేత వేలి మీద చర్మం పోయినా,తిరిగి చర్మం ఏర్పడినప్పుడు అవే వేలిముద్రలు తిరిగి రూపుదిద్దుకుంటాయి! సుమారు 5000 సంవత్సరాలనాటి ఈజిప్షియన్ మమ్మీల వేళ్ళమీద వేలిముద్రలు ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి!
       ఆల్ఫన్స్ బెర్టిలాన్(22 ఏప్రిల్ 1853  మరణం 13 -ఫిబ్రవరి 1914).పారిస్ పోలీస్ శాఖలో క్లర్క్ గా పనిచేసేవాడు.ఆయన నేరస్థుల గుర్తులను సేకరించి ఫైళ్ళలో నింపేవాడు.ఆ పద్ధతివలన ప్రతి నేరస్థుడికి ఓ పెద్ద  ఫైలు తయారు అయ్యేది.అందువలన ఆయన అనేక పరిశోధనలు చేసి ఏ ఇద్దరి మనుషుల కొలతలు(ఎముకలు మొదలైనవి) అందులో ముఖ్యంగా పదకొండు మార్చలేని కొలతలను ఆయన కనిపెట్టాడు.ఆ పద్ధతికి ఆయన ఆంథ్రో పోమెట్రి అని పేరు పెట్టాడు.అప్పటికి ఆయన వయస్సు కేవలం 26 సంవత్సరాలు మాత్రమే. అప్పటి పోలిసు అధికారి ఆ పద్ధతిని హేళన చేసి తిప్పి కొట్టాడు.ఆ తరువాత వచ్చిన పోలీసు అధికారి బెర్టిలాన్ కి చేయూతనిచ్చాడు.ఆ పద్ధతిలో నేరస్థుణ్ణి రకరకాల కోణాల్లో ఫోటోలు తీసి భధ్ర పరచసాగారు. పుట్టు మచ్చలు,శరీరం మీద దెబ్బలు,ఆపరేషన్ గీతల గుర్తింపు పద్ధతి ఈయన కనిపెట్టిందే!ఈ పద్ధతిని అభినందిస్తూ అప్పటి రష్యా చక్రవర్తి జార్ నికొలాస్ బంగారు గడియారాన్ని బహూకరించాడు.విక్టోరియా రాణి ఓ పతకాన్ని బహూకరించింది!14 దేశాల ప్రభుత్వాలు ఈయనను అనేక విధాల గౌరవించాయి.
      ఒక వ్యక్తి అడుగుల మధ్య దూరాన్ని(stride) కొలచి ఆవ్యక్తి ఎత్తును కనుగొన వచ్చునని బెర్టిలాన్ సూచించాడు.నేరం జరిగిన చోట వివిధ కోణాల్లో ఫోటోలు తీయడంవలన నేరస్థులను సులభంగా పట్టుకోవచ్చునని సూచించాడు ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఈ పద్ధతులు పాటిస్తున్నారు.కానీ వేలి ముద్రల ఉపయోగం ఈయన కనిపెట్టలేదు.కానీ వేలిముద్రల మీద ప్రత్యేక పౌడర్ చల్లి ముద్రల్ని సేకరించే పద్ధతి అభివృద్ధి చేసాడు.
    న్యూయార్క్ కు చెందిన ఒక పుస్తక ప్రచురణ కర్త  ఈయనను కలసి ఆయన పరిశోధనలు, అనుభవాలు పస్తకంగా ప్రచురిస్తానని ప్రతి పదానికి ఒక డాలర్ చొప్పున ఇస్తానని చెప్పాడు ఆయన అంగీకరించి ఉంటే  అనేక లక్షల డాలర్లు సంపాదించేవాడు!కానీ ఆయన తన పరిశోధనలు వదలి  ఆడబ్బుకోసం తన సమయాన్ని పుస్తకం కోసం కేటాయించలేనని మర్యాదగా ఆ ప్రచురణ కర్తకు చెప్పి పంపాడు.ఈయన తన 64వ ఏట 1914 లో చనిపొయ్యాడు.
         సర్ ఎడ్వర్డ్ హెన్రీ అనే ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్  అప్పటిలో బెంగాల్ లో ఉద్యోగంచేసేవాడు(1800) ఆయన ఫ్రాన్సిస్ గాల్టన్  అనే పరిశోధకుడితో కలసి వేలి ముద్రలు వాటి ఆవశ్యకత అవి నేరస్థులను ఏవిధంగా పట్టిస్తాయి,వేలి ముద్రల రకాలు వాటిని ఏవిధంగా భద్రపరచాలి మరెన్నో విషయాలు మీద పరిశోధనలు చేశాడు. మొదటిసారి ఓ పుస్తక రూపంలో గాల్టన్ ప్రచురించాడు.ఇప్పడు నేరస్థుల వేలి ముద్రలు కంప్యూటర్లో భద్రపరచి ఎక్కడయినా నేరం జరిగితే వేలిముద్రలు పోల్చి చూసి పాతనేరస్థులను త్వరగా పట్టుకోగలుగుతున్నారు.
                 *****************

కామెంట్‌లు
Harivanam చెప్పారు…
చాలా అద్భుతమైన సమాచారం అందించారు. చాలా ఆసక్తికరమైన విషయాలు తెలిశాయి.ధన్యవాదాలు.