ఒక గుణ పాఠం!;-కంచనపల్లి వేంకట కృష్ణారావు9348611445

   "ఉమామహేశ్వర్  నేను చెప్పిన చోటులో నీవు సూపర్ మార్కెట్ కడితే దానికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది...ఆలోచించు చెప్పాడు చెన్నూరి సుదర్శన్.
           "కానీ సిటీకి కాలాదూరం అదిగాక అది స్లమ్ ఏరియా కదా" అనుమానం వ్యక్తం చేసాడు నారంశెట్టి ఉమామహేశ్వరరావు.
          "సిటీ ఫాస్ట్ గా డెవలప్ అయిపోతోంది.రేపొద్దున ఆ స్థలం కొనాలన్నా దొరకదు,అందుకే చెబుతున్నాను"
         "సరే రేపు వెళ్ళి ఆ స్థలం ఓనరు  గారితో మాట్లాడుదాం" చెప్పాడు ఉమామహేశ్వర్.
       రెండో రోజు ఇద్దరూ ఆ స్థలం వద్దకు వెళ్ళి ఆ స్థలం యజమాని మీగడ వీరభధ్రస్వామిని కలిసారు.
       అనేక తర్జన భర్జనలు, బేరసారాలు జరిగాక  వీరభద్రస్వామి స్థలం అమ్మడానికి ఒప్పుకున్నాడు.
అంతా అయ్యాక కారు వద్దకు వచ్చారు ఉమామహేశ్వర్,సుదర్శన్.కొద్ది దూరంలోనే స్లమ్ ఏరియా కనబడుతోంది,కొన్ని గుడిసెలు... అంతా చాలా బీద ప్రదేశంగా కనబడుతోంది.
       సరే కారు ఎక్కి ఇద్దరూ సిటీకి వెళ్ళి పోయారు.
     కారు దిగి ఉమామహేశ్వర్ చూసుకుంటే తన జేబులో పర్స్ లేదు.అందులో కొన్ని మఖ్యమైన కాగితాలు,ఆరువేల రూపాయలు, తన విజిటింగ్ కార్డ్ ఉన్నాయి!
       "అయ్యో,పర్సు ఎక్కడో పడిపోయింది" అన్నాడు ఉమామహేశ్వర్.
        "ఇంకేందొరుకుతుంది, అసలే అది స్లమ్ ఏరియా, అంతడబ్బు దొరికితే ఇక వాళ్ళు ఇస్తారా?"
అనుమానంగా చెప్పాడు సుదర్శన్.
        అక్కడే ఉన్న ఉమామహేశ్వర్ స్నేహితుడు 
సంగనభట్ల చినరామకృష్ణయ్య " మహేశ్వర్, స్లమ్ ఏరియా అయినంత మాత్రాన అందరూ చెడ్డవారు ఉంటారనుకోవడం పొరపాటు,ఎటుతిరిగి నీ విజిటింగ్ కార్డ్ కూడా ఉందిగా,మంచి వాడికి దొరుకుతే తప్పక నీకు ఫోన్ చెయ్యవచ్చు" చెప్పాడు రామకృష్ణయ్య.
        నిజానికి ఉమామహేశ్వర్ ఆస్తి ముందు ఆడబ్బు లెఖ లోకి రాదు!
      రెండు రోజులయినా పర్స్ ను గురించి ఏ విషయం తెలియలేదు.
        మూడోరోజు ఉమామహేశ్వర్ ఫోను మ్రోగింది. అది అపరిచిత లాండ్ లైన్.సరే ఫోను ఎత్తాడు ఉమామహేశ్వర్.
        " సార్, మీరేనా నారంశెట్టి ఉమామహేశ్వరరావు?"  అది ఓ బాలుడి గొంతు లాగుంది.
       "అవును నీవెవరు బాబు?"
      "సార్ నాపేరు చదువులబాబు, మీ పర్స్ దొరికింది మూడురోజుల క్రితం...దయచేసి మీరు వచ్చినా లేక ఎవరినైనా గుర్తులు చెప్పి పంపినా పర్స్ ఇస్తాను"
అని చెప్పి ఎక్కడికి రావాలో గుర్తులు చెప్పాడు చదువులబాబు.
       వెంటనే కారులో చదువులబాబు చెప్పిన దగ్గరికి వెళ్ళాడు ఉమామహేశ్వర్.
        కారుదిగి చూస్తుండగానే ఓ పదేళ్ళ అబ్బాయి పర్స్ పట్టుకుని వచ్చాడు.
       "సార్ మీరేనా ఉమామహేశ్వరరావు?" అడిగాడు.
        "నీకేనా పర్స్ దొరికింది?"
    "అవును సార్, ఇదిగోండి" పర్స్ ఇచ్చాడు చదువుల బాబు.
       "పర్స్ తీసిచూస్తే ఆరువేల రూపాయలు,ముఖ్యమైన కాగితాలు అలానే ఉన్నాయి.ఉమామహేశ్వర్ ఆశ్చర్యపోయాడు. 
      "మరి మూడురోజుల క్రితమే దొరికితే ఎందుకు ఫోన్ చేయలేదు"
       "సార్ నాదగ్గర డబ్బులు లేవు మీకు ఫోన్ చేయడానికి,అందుకోసం నా దగ్గర ఉన్న పాతకాగితాల కట్ట అమ్మి ఐదు రూపాయలు వస్తే అందులో రెండు రూపాయలతో ఫోన్ చేసాను"
ఆ మాటలు ఉమామహేశ్వర్ గుండెలో చివుక్కుమనిపించాయి.
     "నీవేం చదువుకున్నావు?"
      "ఐదోతరగతి సార్?"
      "మరి ఆరు ఎందుకు చదవలేదు?"
      "సార్ మేము బీదోళ్ళం హైస్కూల్ కి వెళ్ళాలంటే సిటికి వెళ్ళాలి అంతడబ్బు మాదగ్గర లేదు"
       "మరి నా పర్స్ లో డబ్బు తీసి ఫోన్ చేయక పోయావా?"
        "అందులో డబ్బు తాకాలంటే భయం సార్" అమాయకమైన కళ్ళతో చెప్పాడు చదువులబాబు.
"ఇదిగో ఈ వెయ్యి రూపాయలు మీ నాన్నకు ఇవ్వు" 
అని ఇచ్చాడు ఉమామహేశ్వర్.
        "వద్దు సార్,నాకు పని ఏమైనా ఇప్పించండి" అడిగాడు చదువులబాబు.
      ఇప్పుడు ఇక్కడ కట్టించాల్సింది సూపర్ మార్కెట్టు కాదు ఓ మంచి స్కూల్,కాలేజీ, స్లమ్ ఏరియాలో వాళ్ళకి ఏదో పని చూపించి లేక వృత్తి విద్యలు నేర్పిస్తే అంతా బాగుంటుందని ఆలోచించాడు ఉమామహేశ్వర్.
       చదువులబాబు నాన్నను కలసి చదువులబాబు మంచితనాన్ని గురించి చెప్పి వెయ్యి రూపాయలు ఇచ్చాడు.
       సిటీకీ వెళ్ళి జరిగిన విషయం, తన ఆలోచన చెబితే  సుదర్శన్,రామకృష్ణయ్య అందరూ చప్పట్లుకొట్టి ఉమామహేశ్వర్ ఆలోచనను మెచ్చుకున్నారు.

కామెంట్‌లు