*కొండముచ్చు పెండ్లాం* (నవ్వుల్లో ముంచెత్తే జానపద కథ) - డా.ఎం.హరికిషన్-కర్నూలు-9441032212

  ఒకూర్లో ఒక రాజున్నాడు. ఆయనకు లేకలేక ఒక కొడుకు పుట్టినాడు. వానికి నెమ్మదిగా కొన్ని సమ్మచ్చరాలకు పెండ్లి వయసొచ్చింది. పెండ్లి వయసొచ్చినాక పెండ్లి చేయాల గదా... దాంతో ఆ రాజు దేశదేశాల అందగత్తెల బొమ్మలన్నీ తెచ్చి వాని ముందు పెట్టి “నీకు ఎవరు నచ్చినారో చెప్పు. తెచ్చి చేస్తా" అన్నాడు. వాడందరినీ పట్టిపట్టి చూసినాడు గానీ వానికెవరూ నచ్చలేదు. దాంతో వాళ్ళ నాయన దగ్గరకు పోయి "నాయనా... నాయనా... నాకు నచ్చే పిల్లను తీస్కోని రావడం నీ వల్ల కాదు గానీ నేనే పోయి నాకిష్టమయిన పిల్లను వెదుక్కోనొస్తా" అన్నాడు. ఆయన "సరే" అన్నాడు. అప్పుడా యువరాజు గుర్రమేసుకోని తనకు నచ్చిన పిల్ల కోసం వెదుకుతా... దేశదేశాలు తిరగడం మొదలు పెట్టినాడు.
ఆ ఊరికి ఏడువందల మైళ్ళ దూరంలో ఒక రాజ్యముంది. ఆ రాజు కూతురిది అట్లాంటిట్లాంటి అందం గాదు. ఏడేడు పధ్నాలుగు లోకాల్లోనూ అంత అందగత్తె యాడా వుండదు. మెరుపుతీగ లెక్కుంటాది. ఒక్కసారి చూస్తే మల్లా మల్లా చూడాలనిపిస్తాది. కానీ ఆమెకు తాను పెద్ద అందగత్తెనని చానా చానా పొగరు. దాంతో ఎవరినీ లెక్కజేసేది కాదు.
ఒకరోజు ఆమె చెలికత్తెలతో అడవిలో పోతావుంటే ఒకచోట ఒక పెద్దతోట కనబడింది. అందులో ఒక ముని తపస్సు చేసుకుంటా వున్నాడు. ఆ రాకుమారి మునినే మాత్రం పట్టిచ్చుకోకుండా మిగతా చెలికత్తెలతో అక్కడ బంతాట ఆడుకుందామనింది. ముని తపస్సు చేసుకుంటా వున్నాడు గదా... అల్లరి చేయడం మంచిపని కాదుగదా... కానీ ఆ పిల్లకు పొగరుతో కండ్లు తలకెక్కినాయి. అందుకే స్నేహితురాళ్ళు “ఈడ వద్దులే" అని అంటావున్నా వినకుండా కిలకిలకిల నవ్వుతా ఆన్నే ఆడడం మొదలుపెట్టింది. అట్లా ఆడతా వుంటే ఒకసారి ఆ బంతి పోయి తపస్సు చేసుకుంటావున్న ముని మొగానికి దభీమని తగిలింది. దాంతో ఆయనకు చానా కోపమొచ్చింది.
"నీ అంత అందగత్తె ఈ లోకంలో యాడా లేదనే పొగరుతోనే గదా నువ్వింత ఎగిరెగిరి పడతా వున్నావ్... ఈరోజు నుండీ నువ్వు పొద్దునంతా ఇట్లాగే మానవరూపంలో వుంటావు గానీ రాత్రి కావడమాలస్యం నీ ఒళ్ళంతా బొచ్చు బొచ్చు వచ్చి అచ్చం కొండముచ్చులెక్క అయిపోతావ్" అని శాపం పెట్టినాడు. ఆ దెబ్బతో ఆమెకు పొగరు దిగిపోయి ముని కాళ్ళ మీద పడి “సామీ... సామీ... పొరపాటయిపోయింది. ఈ ఒక్కసారికి నన్ను మన్నించు. మల్లా జన్మలో ఇట్లాంటి పొరపాట్లు ఎప్పుడూ చేయను" అని కిందామీదాపడి ఏడ్చింది.
అప్పుడాముని జాలిపడి "నిన్నెవరయినా పెండ్లి చేసుకున్నాక... నీ మొగుడు ఒక సమ్మచ్చరం పాటు వేరేవాళ్ళనెవరినీ పెండ్లి చేసుకోకుండా వుంటే అప్పుడు నీ మొదటి రూపం నీకు వస్తాది. నీ మొగుడు వేరేవాళ్ళని పెండ్లి చేసుకున్నా... నీ శాపం సంగతి నీ మొగునికి చెప్పినా... ఇక నీవు ఎప్పటికీ ఇట్లాగే వుంటావు" అని చెప్పినాడు.
పక్క ఊరిలో ఒక రాకుమారుడు వున్నాడు. ముచ్చటైన పెళ్లాంకోసం లోకమంతా వెదుకుతా వున్నాడు.  అట్లా వెదుకుతా... వెదుకుతా... ఒకరోజు వీళ్ళ రాజ్యానికొచ్చినాడు. యువరాణిని చూసి “అబ్బ... ఎంత ముచ్చటగుంది... అచ్చం బంగారు బొమ్మలెక్క" అనుకోని రాజు దగ్గరికి పోయి తానెవరో చెప్పి పిల్లను ఇయ్యమన్నాడు.
కూతురు రాత్రిపూట కొండముచ్చవుతున్న సంగతి ఎవరికీ తెలియగూడదు గదా.... అందుకని ఆ రాజు "ఇస్తాగానీ... నా కూతురు ఒక వ్రతం చేస్తా వుంది. ప్రతిరోజూ రాత్రిపూట చీకటి పడగానే నరమానవుడెవడూ చూడని రహస్య ప్రదేశంలో ఆమె క్రమం తప్పకుండా సమ్మచ్చరం పాటు పూజ చేయాల. నీవు గూడా పట్టపగలే తప్ప రాత్రిపూట నీ పెండ్లాం పక్కనుండగూడదు. సరేనా" అన్నాడు. దానికి వాడు సరే అన్నాడు. దాంతో రాజు ఊరందరినీ పిలిపించి ఆకాశమంత పందిరి, భూదేవంత అరుగు వేసి బ్రమ్మాండంగా పెండ్లి చేసినాడు.
ఆ యువరాజు పెండ్లయినాక ఇచ్చిన మాట ప్రకారం ఆమె కోసం ప్రత్యేకంగా ఒక గది కట్టిచ్చి ఆ తరువాత ఆమెను ఇంటికి తీస్కోని పోయినాడు. ఆరోజు నుండి రాకుమారి చీకటి పడడం ఆలస్యం వురుక్కుంటా ఆ గదిలోనికి పోయి లోపల గడేసుకునేది.
కొన్నాళ్ళు దాటినాక ఆ యువరాజుకు తన పెండ్లాం ఏమి వ్రతం చేస్తావుందో చూడాలనిపించింది. దాంతో ఒకరోజు రాత్రి చప్పుడు గాకుండా మట్టసంగా పోయి కిటికీలోంచి తొంగి చూసినాడు. చూస్తే ఇంగేముంది లోపల పెండ్లాం లేదు. కొండముచ్చుంది. ఓరినీ... ఏమో అనుకుంటి గానీ ఇదా సంగతి అనుకోని... అందరినీ పిల్చి కుప్పేసి జరిగిందంతా చెప్పినాడు. ఆమె ముని ఇచ్చిన శాపం గురించి చెప్పగూడదు గదా... దాంతో ఏమీ మాట్లాడకుండా గమ్మున నోరుమూసుకోనింది. దేశదేశాల్లో యాడా లేనంత అందగత్తెను పెండ్లాన్ని చేసుకోవాలనుకుంటే.... ఆఖరికి ఈ కొండముచ్చు పెండ్లామయిందే అని బాధపడి తరువాత రోజు పొద్దున్నే ఆమెను ఆమె పుట్టింటికి పంపించేసినాడు.
రాజు పెండ్లాం కొండముచ్చని తెలుసుకోని ఊరు ఊరంతా కిందామీదా పడి నవ్వుకుంటా వుంటే చూసి తట్టుకోలేక వాళ్ళ నాయన ఇంకో సంబంధం చూసినాడు. ఈ విషయం తెలిసిన యువరాణి పెండ్లి గనుక జరిగితే ఆమె ఇంగ ఎప్పటికీ కొండముచ్చులాగానే వుండిపోవాల్సి వస్తాది గదా... అందుకని ఎట్లాగయినా సరే పెండ్లి చెడగొట్టాలనుకోనింది..
పెండ్లికి ముందురోజు పగటిపూట ఆమె నెత్తిన పెరుగుకుండలు ఒకదాని మీదొకటి పెట్టుకోని "పెరుగమ్మా... పెరుగు" అని అరుచుకుంటా పెండ్లికూతురి విడిది ముందు పోసాగింది. పెండ్లి కూతురు మిద్దెపై నుండి ఆమెని చూసి "అమా... అమా... ఆమె వెండ్రుకలు చూడుమా... ఎంత పొడుగ్గా నల్లగా నిగనిగలాడుతా వున్నాయో... ఆమెని పిల్చుమా... ఆమె వెండ్రుకలు ఇంత అందంగా ఎట్లా వున్నాయో కనుక్కుందాం" అనింది.
సరేనని వాళ్ళమ్మ ఆమెని పిల్చి “పాపా... పాపా... నీ వెండ్రుకలు అంత అందంగా మెరుస్తా వున్నాయి గదా... ఏంది సంగతి" అనడిగింది. దానికామె చిరునవ్వు నవ్వి “ఏమీ లేదమ్మా... నున్నగా గుండు చేసుకోని... సున్నం పసుపు కుంకుమ గంధంలో ఏసి బాగా కలిపి గుండంతా పట్టిచ్చి... వెండ్రుకలు వెంకటేశ్వరస్వామి ముందు పెట్టి... పూజ చేసి ఆన్నే కటిక నేల మీద పండుకుంటే చాలు. పొద్దున లేసి చూసేసరికి ఎక్కడలేని వెండ్రుకలు నాలాగే నిగనిగలాడుతా... ఇంతలావు.... ఇంత పొడుగు... వచ్చేస్తాయి" అని చెప్పింది.
వాళ్ళమ్మ అది నిజమనుకోని మంగలాయనను పిలిపించి పెండ్లికూతురికి నున్నగా గుండు చేపిచ్చి, ఆమె ఎట్లా చెప్పిందో అచ్చం అట్లాగే చేపిచ్చింది. పొద్దున లేసి చూస్తే ఇంగేముంది. ఒక్క వెండ్రుక గూడా రాలేదు. విషయం బైటకి తెలిస్తే మర్యాద పోతాది గదా. దాంతో వాళ్ళు ఆమె గుండు కనబడకుండా నెత్తి నిండా ముసుగేసి పెండ్లికొడుకు పక్కన పీటల మీద కూచోబెట్టినారు.
పెండ్లికొచ్చినోళ్ళంతా ఆమె మొగం ఒక్కసారన్నా చూద్దామని “ముసుగు తియ్యి... ముసుగు తియ్యి...." అని ఎంతడిగినా ఆమె తియ్యనే తియ్యలేదు. దాంతో ఒకామెకు అనుమానమొచ్చి ఛటుక్కున దాన్ని లాగేసింది. అంతే... ఇంగేముంది తళతళలాడుతా గుండు బయటపడింది. అది చూసి పెండ్లికొచ్చిన జనమంతా నవ్వడం నవ్వడం గాదు. దాంతో యువరాజు నాకీ గుండు పెండ్లాం వద్దంటే వద్దంటూ అక్కన్నించి లేచిపోయినాడు.
ఊరుఊరంతా "ఎంత డబ్బుండి ఏం లాభం... మొదట చేసుకున్నది కొండముచ్చయితే... మళ్ళా చేసుకోవాలనుకున్నది గుండని" ఒకటే నవ్వుకోసాగినారు. ఇది చూసి వాళ్ళమ్మా నాయనా ఈ సారన్నా మంచి పిల్లను తీసుకోనొచ్చి చేయాలని ఒక మూన్నెల్లు కిందామీదా పడి వెతికితే ఆఖరికి ఒక అందమైన పిల్ల దొరికింది. దాంతో పెండ్లికి ముహూర్తాలు పెట్టించినారు.
పెండ్లి గనుక జరిగితే ఆ యువరాణి ఇంక ఎప్పటికీ కొండముచ్చులాగా అట్లానే వుండిపోవాల్సొస్తాది గదా... అందుకని ఆమె ఎట్లాగయినా సరే పెండ్లి చెడగొట్టాలనుకోని... పెండ్లికి ముందురోజు పగటిపూట బంతిపూల బుట్ట నెత్తిన పెట్టుకోని “పూలమ్మా... పూలు..." అని అరుచుకుంటా వాళ్ళింటి ముందు పోసాగింది. పెండ్లికూతురు మిద్దెపైనుండి ఆమెని చూసి “అమా... అమా... ఆమె పండ్లు చూడుమా... ఎంతందంగా వున్నాయో... అచ్చం దానిమ్మ గింజల్లెక్క.. ఆమెని పిల్చుమా... ఆమె పండ్లు అట్లా ఎట్లా మెరుస్తా వున్నాయో కనుక్కుందాం" అనింది.
సరే అని వాళ్ళమ్మ ఆమెను పిలిచి “పాపా... పాపా... నీ పండ్లు దానిమ్మ గింజల్లెక్క తళతళలాడుతతా వున్నాయి గదా... ఏంది సంగతి" అనడిగింది. దానికామె చిరునవ్వు నవ్వి "ఏమీ లేదమ్మా... ముందు నోట్లో ఒక్క పండు గూడా మిగలకుండా ఇన్నీ పీకి... నోటి నిండా దానిమ్మగింజలు పోసుకోని.. పొద్దున్నుంచీ రాత్రి వరకూ అన్నం తినకుండా... వెంకటేశ్వరస్వామికి పూజ చేసి... ఆన్నే కటికనేల మీద పండుకుంటే చాలు.... పొద్దున లేసి చూసేసరికి అచ్చం నాలాగే పండ్లు మిలమిలలాడుతా వచ్చేస్తాయి" అని చెప్పింది.
వాళ్ళమ్మ అది నిజమనుకోని పెండ్లికూతురికి ఒక్క పన్నుకూడా మిగలకుండా అన్నీ పీకి... అచ్చం ఆమె ఎట్లా చెప్పిందో అట్లానే చేసింది. పొద్దున్నే లేసి చూస్తే ఇంగేముంది.... ఒక్క పన్ను గూడా తిరిగి రాలేదు. విషయం బైటికి తెలిస్తే మర్యాద పోతాది గదా... దాంతో వాళ్ళు ఆమె బోసినోరు ఎవరికీ కనబడకుండా గమ్మున నోరు మూసుకొని వుండమని చెప్పి పెండ్లికొడుకు పక్కన పీటల మీద కూచోబెట్టినారు.
పెండ్లికొచ్చినోళ్ళంతా ఆమెని చూసి “నీ పేరేందమ్మా... అంటే నీ పేరేందమ్మా" అని అడుగుతా వుంటే మూగెద్దులెక్క మట్టసంగా వుందే గానీ నోరు తెరచి ఒక్కమాటా మాట్లాల్లేదు. ఇదేందబ్బా... ఇట్లా నోరుమూసుకోని కూచోనిందని అనుమానపడి ఒకామె వెనుక నుండి నడుమ్మీద చక్కిలిగింతలు పెట్టింది. దాంతో ఆమె ఆ గిలిగింతల్ని తట్టుకోలేక పడీపడీ నవ్వింది. అంతే... ఆమె బోసినోరు చూసి పెండ్లికొచ్చినోళ్ళంతా నవ్వడం నవ్వడం గాదు. దాంతో యువరాజు నాకీ బోసి నోటి పెండ్లాం వద్దంటే వద్దంటూ అక్కన్నించి లేచిపోయినాడు.
ఊరుఊరంతా "ఎంత డబ్బుండీ ఏం లాభం... మొదటిసారి చేసుక్నుది కొండముచ్చయితే... రెండోసారి చేసుకోవాలనుకున్నది గుండు, మూడవసారి చేసుకోవాలనుకున్నది బోసి నోటిది" అని ఒక్కటే నవ్వుకోసాగినారు. అది చూసి వాళ్ళమ్మా నాయనా ఈ సారన్నా మంచి పిల్లని తీసుకోనొచ్చి చేయాలనుకోని ఒక మూన్నెళ్ళు కిందామీదా పడి వెతికితే ఆఖరికి ఒక పిల్ల దొరికింది. దాంతో వాళ్ళ నాయన పెండ్లి చేయడానికి ముహూర్తాలు పెట్టించినాడు.
రాజకుమారికి ఇంగో నెల దాటితే సమ్మచ్చరం పూర్తయి ముని ఇచ్చిన శాపం పూర్తయిపోతాది. అందుకని ఎట్లాగయినా సరే ఈ పెండ్లి గూడా చెడగొట్టాలనుకోని ఎక్కడా లేనంత కమ్మని వాసన వుండే అత్తరు ఒంటికి పూసుకోని... నెత్తిన పండ్లబుట్ట పెట్టుకోని "పండ్లమ్మా... పండ్లు" అని అరుచుకుంటా పోసాగింది. ఆమె అట్లా నడుస్తా వుంటే ఆ వీధి వీధంతా ఘుమ్మని వాసన కొడతా వుంటే చూసి పెండ్లికూతురు "అమా... అమా... ఆమె ఒంటి మీద నుండి వస్తున్న కమ్మని అత్తరు వాసన పీల్చినావా.... వేయి రోజాపూలు ఒకే చోట కుప్పపోసినట్టు ఎంత బాగుంది గదా... ఆమెని పిల్చుమా... ఆ అత్తరు యాడ దొరుకుతాదో మనమూ కనుక్కుందాం" అనింది.
సరేనని వాళ్ళమ్మ ఆమెను పిలిచి “పాపా... పాపా... నీ ఒంటి మీదున్న ఆ కమ్మని వాసనకు వీధి వీధంతా ఘుమ్మని అదిరిపోతా వుంది. యాడ కొన్నావ్ దాన్ని" అనడిగింది. దానికామె చిరునవ్వు నవ్వి “ఏమీ లేదమ్మా... ఒంటి మీదున్న బట్టలన్నీ తీసేసి... ఆవు పెండలో కాస్త పంది పెండ కలిపి... ఒక చచ్చిన ఎలుకను దాంట్లో ఏసి బాగా నూరి... తల నుండి కాలి బొటన వేలి వరకూ అంగుళం గూడా వదలకుండా బాగా పట్టిచ్చుకోని... ఆ గబ్బు వాసన భరిస్తా... వెంకటేశ్వరస్వామికి పూజ చేసి అన్నే అట్లాగే కటికనేల మీద పండుకోని... పొద్దున్నే గాడిదపాలతో స్నానం చేస్తే సరి... నా మాదిరే నీకు కూడా ఆ కమ్మని వాసన కొన్ని నెలలపాటు ఘుమ్మని అదరగొడతా వుంటాది" అని చెప్పింది.
వాళ్ళు ఆది నిజమనుకోని పెండ్లికూతురి ఒంటి మీదున్న బట్టలన్నీ తీసేసి ఆమె ఎట్లా చెప్పిందో అచ్చం అట్లానే చేసినారు. పొద్దున్నే లేచి గాడిదపాలతో స్నానం చేసి చూస్తే ఇంగేముంది. కంపు కంపు కాదు. ఎలక సచ్చిన కంపు... చుట్టుపక్కనున్నోళ్ళంతా ముక్కులు మూసుకోని బిందెల మీద బిందెలు పోసి సబ్బుల మీద సబ్బులు పెట్టి ఎంత రుద్దినా ఆ కంపు ఒక్క ఇంచు గూడా తగ్గలేదు. వాళ్ళు ఏమీ చేయలేక అట్లానే ఆమెను పెండ్లికూతురిని చేసి తీసుకోని వస్తా వుంటే పెండ్లికొచ్చినోళ్ళంతా ఆ గబ్బువాసనకు ముక్కుమూసుకోని ఒకటే నవ్వడం నవ్వడంగాదు. దాంతో యువరాజు నాకీ కంపు పెండ్లాం వద్దంటే వద్దంటూ పీటల మీద నుండి లేచిపోయినాడు.
"ఇదేందబ్బా... ఎవరిని చేసుకుందామనుకున్నా... ఏదో ఒకటి జరుగుతానే వుంది. ఇంగ నాకు పెండ్లయితాదా... కాదా..." అని ఆ యువరాజు బాధపడతా వుంటే... మొదటి పెండ్లాం సమ్మచ్చరం పూర్తి కాగానే వురుక్కుంటా అక్కడికొచ్చి జరిగిందంతా పూసగుచ్చినట్టు వివరించింది. అది విని ఊరంతా సంబరపడినారు. విషయం తెలీక అంత మంచి పెండ్లాన్ని అనవసరంగా ఇంట్లో నుంచి వెళ్ల గొట్టేసినానే అని యువరాజు బాధపడి ఆమెని దగ్గరకు తీసుకున్నాడు. అప్పటినుంచీ వాళ్ళిద్దరూ హాయిగా చిలకా గోరింకల్లెక్క కలసిమెలసి వున్నారు.

కామెంట్‌లు
Sridhar Akkineni - ( He )Artiste' చెప్పారు…
డాక్టర్ హరి కిషన్ గారూ..మా అమ్మ ఊర్మిళగారు పెద్దావిడ (75సం.), హైదరాబాదులో మీ పేషంట్.రె గ్యులర్ గా 'మొలక 'పాఠకురాలు.మీరు రాసిన కథ చదివి బాగానవ్వుకున్నారు.
మీకు ఆశీస్సులు తెలియజేయమన్నారు.
- శ్రీధర్ అక్కినేని.