గీతాంజలి గురించి... రచయిత, చిత్రకారుడు : జింకా రామారావు

 తనచుట్టూ ఉన్న ప్రకృతితత్వాన్ని తన మనసులోని ప్రేమతత్వంతో కలిపి మాపులేని ఉదయ సంధ్యారాగాలను తన గీతాంజలి రచనతో ఆలపించారు రవీంద్రనాథ్ ఠాగూర్. కంటికి కనిపించక పోయినా సృష్టి భారాన్ని మోస్తూ నిరంతరం ప్రేమను వర్షించే అంతర్యామి అయిన ఈశ్వరుని మానసికంగా దర్శిస్తూ, ఆయనను ప్రశ్నిస్తూ, ఆయనకోసం ఆడి, పాడి, అంజలి ఘటించడమే 'గీతాంజలి'.

భౌతికవాద ప్రాతిపదికపై వ్యక్తీకరించబడిన ఈ ఆధ్యాత్మికతత్వంలో భగవంతుని కోసం భక్తుడెంత విరహపడతాడో, భగవంతుడు కూడా భక్తునికై అంతే విరహపడుతూ ఉండటం చూడగలుగుతాం. రవీంద్రుని గీతాంజలిలోని విశ్వప్రేమభావసారాన్ని గీతాంజలి గ్రంథపఠనం ద్వారా ఎందరో విజ్ఞులు అద్భుత మనోలోకాలను సృష్టించుకొనివుంటారు. చదివినప్పుడల్లా కొత్త అర్థాలను స్ఫురింపజేసే ఈ గ్రంథంలోని భావతత్వానికి ఎవరికి వారు తమ భావనాపరిధిని బట్టి అద్భుత ఊహా ప్రపంచాలను దర్శిస్తుంటారు. అందువల్ల ఇదే దీని టీకా, తాత్పర్యం అని నిర్దేశించడం కాకుండా నేను పొందిన స్వేచ్చాభావానుభూతిని సవినయంగా వ్యక్తపరుస్తున్నాను.

 


1."జీవనపాత్ర" 

భగవత్ శక్తి మాత్రమే సర్వజీవ కోటి సంక్షేమాన్ని బాధ్యతగా వహిస్తూ ఆకలి, దప్పికలనే వెలితితో ప్రాణికోటి భౌతిక దేహాలను సృష్టించడమే కాకుండా వాటిని తీర్చేందుకు అవసరమైన ప్రాకృతిక ఆహారం, గాలి, నీరు వంటి వాటిని సృష్టించిందని, ఈ ప్రాణులను రెల్లు పిల్లనగ్రోవుల్లా మీటుతూ ఆయన సృష్టి అందాల మధ్య తిప్పుతూ ఎప్పటికప్పుడు సరికొత్త రాగాల సృష్టి చేస్తున్నదని భక్తుడు కీర్తిస్తున్నాడు. ఆయన చేతి స్పర్శామృతమే తన గుండెను ఆనందంతో నింపి, ఆ జీవితానందపు అనుభవాలే మాటలుగా వ్యక్తమవుతున్నాయని, “నిరంతరం నువ్వు వర్షించే అపార కరుణాప్రవాహాన్ని స్వీకరించగలగడానికి నా చేతులు చాలా చిన్నవి గదా! ప్రభూ....” అందుకే యుగాలు గడుస్తున్నా ఈ జీవనపాత్ర వెలితిగానే ఉంటోంది- అంటూ భక్తుడు భగవంతుడ్ని కీర్తిస్తున్నాడు.


కామెంట్‌లు