పరమహంసతో వివేకానందులవారి ముచ్చట;-అనుసృజన : యామిజాల జగదీశ్
 ఇటీవల ఓ తమిళ పుస్తకం చదువుతుంటే శ్రీరామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద మధ్య జరిగిన సంభాషణ నన్నా కట్టుకుంది. వివేకానందులవారు అసాధారుణులైనప్పటికీ ఆయనకూ అప్పుడప్పుడూ కొన్ని ప్రశ్నలకు జవాబు కోసం పరమహంసను అడుగుతుండేవారు. అలా ఓమారు వారి మధ్య జరిగిన సంభాషణే ఇది....
 వివేకానంద : నాకు విశ్రాంతి సమయమంటూ లభించడంలేదు. జీవితం వడివడిగా సాగిపోతోంది?
పరమహంస : చేతలు నిన్ను ఆక్రమిస్తాయి. సాధన ఫలితం నీకు విముక్తి ఇస్తుంది.
వివే :  జీవితమిప్పుడు ఎందుకని చిక్కు పడింది?
రా.ప. : జీవితాన్ని పరిశోధించడం ఆపేసే. పరిశోధన చిక్కులు కల్పిస్తాయి. కనుక దానిని వదిలేసే.
వివే : మరి మనమెందుకు సంతోషమనేదే లేకుండా బతుకుతున్నాం? 
రా.ప. : బాధపడటమే నీకు పనైపోయింది. కనుక సంతోషాన్ని కోల్పోతున్నావు.
వివే : మంచి మనుషులు ఎందుకు బాధపడుతున్నారు?
రా.ప : రాపిడి లేకుండా వజ్రం ప్రకాశాన్నివ్వలేదు. కాల్చకుండా బంగారాన్ని శుద్ధి పరచలేం. మనుషులను పరీక్షించడం జరుగుతుంది తప్ప బాధపెట్టడం కాదది. ఆ పరీక్షల ద్వారా జీవితాన్ని మెరుగు పరచుకోవాలి.
వివే : అంటే పరీక్షలనెదుర్కోవడం ప్రయోజనకరమేనంటారా?
రా. ప : అవును. అన్నింట్లోకెల్లా అనుభవమే విశిష్ట గురువు. ముందుగా పరీక్ష పెట్టి తర్వాత పాఠం బోధిస్తుంది.
వివే : అనేక పరీక్షలు ఒకేసారి వస్తే మనం దారితెన్నూ తెలీక అయోమయంగా నిల్చుండిపోతాం కదా?
రా.ప : నీకు బయటకు చూస్తే ఎక్కడికి వెళ్తున్నావన్నది తెలీదు. నీలోకి నువ్వు తదేకంగా చూసుకో. కళ్ళు వెలుగు చూపుతాయి. హృదయం దారిని చూపుతుంది 
వివే : సరైన మార్గంలో వెళ్ళడం కన్నా ఓటమి ఇచ్చే భయమే ఎక్కువ ఆందోళన కలిగిస్తోంది. ఎందుకు?
రా. ప : గెలుపోటములనేవి ఎదుటివారి చూపులను బట్టీ ఉంటాయి. నువ్వు పొందే తృప్తి నీలో ఉంటుంది 
వివే : క్లిష్ట పరిస్థితులలో ఎలా పని చేయడం? 
రా. ప : ఇంకా ఎంత దూరం వెళ్ళాలో అని చూడకు. ఎంత దూరం దాటొచ్చామనేది చూసుకో. అమ్మయ్య అనుకుంటావు. ఉన్నదానిని ఆస్వాదించు. లేని దాని గురించి ఆలోచించి కృంగిపోకు. 
వివే : మనుషులలో ఏ గుణం మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది?
రా. ప : కష్టాలొచ్చినప్పుడు నాకు మాత్రమే ఎందుకిట్లా? అని గొణుగుతుంటారు. కానీ సంతోషం కలిగినప్పుడు అలా అనుకోరు. అసలు దాని గురించే ఆలోచించరు.
వివే : జీవితంలో పరిపూర్ణతను నేనెలా పొందాలి?
రా. ప : నీ గత కాలాన్ని తలచి తలచి బాధపడక స్వీకరించు. నీ వర్తమానకాలాన్ని నమ్మకంతో ఎదుర్కోవాలి. భవిష్యత్ కాలం కోసం ఆందోళన పడక సిద్ధపడు.
వివే : ఇప్పటికి చివరి ప్రశ్న. కొన్నిసార్లు నా ప్రార్థనలు నెరవేరడం లేదనిపిస్తుంటుంది?
రా.ప : నెరవేరని ప్రార్థనలు అంటూ ఉండవు. భయాన్ని తొలగించు. నమ్మకాన్ని నాటు. జీవితమనేది తెలుసుకోవలసిందే తప్ప పరిశోధించడం కాదు. నమ్మకంపై నమ్మకముంచు. జీవించడం నేర్చుకుంటే జీవితం అద్భుతం.


కామెంట్‌లు