చింపుకోకు జీవనం కాదది చిత్తుకాగితం
ఇదొక పోటీ ప్రపంచం
పైగా కాసులకాలం
తల్లిదండ్రులకు భవితయే ముఖ్యం
వర్తమానం పీడనచట్రంలో బంధనం
గమ్యపు దారిలో చీకటివెలుగులు
సహజాతి సహజం
అతిచిన్న ప్రయత్నలోపం అంత మాత్రాన
న్యూనతభావపు ఆలింగనం తుచ్ఛం
ఒక్క అడుగు తడబడితే
సంకల్ప శిఖరాన్ని కూల్చుకోవాలా
ఓటమికి చిరునామై పోవాలా
మట్టిపొరల కింద బీజపు యుద్ధమే కదా
శ్వాసగా మొలిచేది
నిశీధి తెరలు చీల్చుకునే కదా తూరుపు వికసించేది
పొదల మాటున పన్నగములా
ఉద్వేగభరిత ఉల్లమును ఉసూరుమనిపించాలని
పొంచి ఉంటుంది విషపుకాలం
ఆ ఒక్క క్షణము నిగ్రహపునీడన నిలిచి చూడు
ఆవల తీరమే ఆహ్వానిస్తూ ఆశయగుమ్మం
పెక్కు అవకాశాలతో స్వర్ణద్వీపం
ఎవరికీ వారు అంతరాత్మ బోనులో
ముద్దాయిలా మారితే
అర్థం లేని తీర్పులో బలైపోతే
నవ్యచరితకు శ్రీ కారం చుట్టేది ఎవరూ
పుడమిపై ఇక మిగిలేది ఎవరూ
సాహసమే నీ ఊపిరి కావాలి
ఆత్మవిశ్వాసమే ఆయుధంగా మారాలి
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి