స్వేచ్ఛా విహంగం-విజయ రాఖీ-కలం స్నేహం
ధవళ వర్ణ రెక్కలు విప్పుకొని
స్వచ్ఛమైన మనసుతో
స్వేచ్చా విహంగమై 
సాగేటి కపోతం నేడు
రెక్కలు విప్పలేక బిక్కుబిక్కుమంటూ
మూగబోయి ముడుచుకు కూర్చున్నది

ఎటు చూసినా ఆక్రందనల హోరులే
వసివాడని మొగ్గల మారణహోమాలే
అంతే లేని అఘాయిత్యాలే
వావివరుసలు వయసు భేదాలే
కంటికి కానక కనుమరుగాయేలే

ఎటుపోతుందీ సభ్యసమాజం
ఏమైపోతుందీ నాగరికత్వం
ఎన్నాళ్ళీ భయ కంపనాలు
మారేదెన్నడు ఈ మానవ లోకం
మార్పు కై పోరాడేదెవ్వరు

ఊరూవాడా శాంతి నెలకొనాలంటే
మారాలి మన ఆలోచనా విధానం
నేర్పాలి మానవతా విలువలను
అప్పుడే కదా
మన ధవళ వర్ణ కపోతం
తన రెక్కలను విప్పార్చుకొని
స్వేచ్ఛావిహంగమై శాంతితత్వాన్ని బోధించును


కామెంట్‌లు
Unknown చెప్పారు…
చాలా బాగుంది.పరిపక్వత దిశలో మీ కవన ప్రయాణం 💐💐💐👌👌👌