మనసు వ్యధ - ఎం. అరుణ కుమారి-కలం స్నేహం
ప్రేమించినంత సేపు పట్టలేదు 
దూరం జరిగిపోవడానికి
ఇష్టపడటమే నేరమా
మనసివ్వడమే పాపమా

నా కళ్ళలోని ప్రేమ కనిపించదా
చేతలోని భావం అర్థం కాదా
అంత జడత్వమేల నీలో
గతం మరువలేకనా, భావి వద్దనా

ఎంత అదృష్టం అనుకొన్నానో
దురదృష్టంగా మారింది, ఎందుకో
తప్పుచేయని నాకు శిక్ష ఏమిటి
నలుగురిలో నగుబాటుకా

నీ మాటల తూటాలు
నా ఎదలో గుచ్చుకొంటున్నాయి
నీ చూపులలో విముఖత
నన్ను దూరం నెట్టేస్తున్నాది

ఎందుకిలా? అర్ధం కాని ప్రశ్న
ఖర్మ అని ఒప్పుకోను మనసు రాదు
నా లోని నిష్కల్మతత్వం గుర్తు రాదా
ఎప్పుడు మారుతావు నీవు

కలలు కొందరికే సొంతం కాబోలు
అందరికీ అర్హత లేదేమో
మిగిలిన జీవితం కన్నీరేనా
విధి చేతిలో ఓటమేనా

చేసిన పూజలు ఎటుపోయాయి
మొక్కులన్నీ ఏమయినాయి
నా దేవుడికి నేనంటే విసుగొచ్చిందేమో
నన్ను పట్టించుకోవటం మానేసాడేమో


కామెంట్‌లు