పచ్చని పుడమి;-సుధా మైథిలి-కలం స్నేహం
చినుకుల చుంబనానికి పరవశించాయేమో..
పుడమి పరువాలు..
సిగ్గుల మొగ్గై  పచ్చిక తెరను చాటు చేసుకుని 
పరవశిస్తున్నాయి సోయగాలు..
మోడువారిన తరువులు చివురులు తొడగంగా..
సప్త వర్ణాల సుమబాలన్నీ పుడమిపై విరబూసి
నింగినున్న హరివిల్లుని నేల పైకి దించంగా..
అవని యవనిక చిత్రించే హరిత చిత్రాల లీల..
మంచు దుప్పటి కప్పుకున్న హరిత వనాలన్నీ 
దినకరుని స్పర్శకు పులకరించి కరిగిపోయే వేళ..
నవవధువయ్యే పుడమి అందాలు..
ఈ పచ్చని వేడుక కావాలంటే శాశ్వతం..
హరిత వనాల పెంపకానికి చుట్టాలి శ్రీకారం..
జీవరాశి మనుగడకు రక్ష ఇచ్చు 
ఈ హరిత ప్రాకారం..
ఉసురులు పోయు తరువుల పెంపకమే..
జీవరాశి సౌభాగ్యానికి శాంతి మంత్రం..


కామెంట్‌లు