మథురా నగర తీర్ధాలు. పురాణ బేతాళకథ.;-డా. బెల్లంకొండ నాగేశ్వరరావు.- చెన్నై

 పట్టువదలని విక్రమార్కుడు శవాన్ని ఆవహించి ఉన్న బేతాళుని బంధించి ,భుజంపై వేసుకుని నడవసాగాడు.
అప్పుడు శవంలోని బేతాళుడు 'మహరాజా అసమాన వీరుడవు అయిన నీకు పురాణలపై మంచి అవగావహన ఉన్నది అని నాకు తెలుసు. నాకు చాలాకాలంగా మధురానగర పరిసరాల పుణ్యతీర్ధాలు, బలరామదేవుడు సందర్శించిన తీర్ధాలగురించి తెలుసుకోవాలనిఉంది,తెలిసిచెప్పకపోయావో మరణిస్తావు 'అన్నాడు.
' బేతాళా భూలోక తీర్ధాలలో కుబ్జామ్రకం, సౌకరం' మధుర అనే ఈమూడు పరమ విశిష్టమైనవి .వీటిలో మధుర ప్రాంతంలో విశ్రాంతి విందుక,కణకల్ ,సూర్యతీర్ధం,తీర్ధరాజం,కోనేటి తీర్ధం,దక్షణకోటి, పంచసుర,హంసకుండ,గార్హతీర్థం,భద్రేశ్వరతీర్ధం,సోమేశ్వరతీర్థం,ఘంటాభరణ,గరుడకేశ,ధారాలోపసక,వైకుంఠ ఖండవేలిక,మందాకిని, సంయమున, అనకొండ,గోపతీర్థ,ముక్తేశ్వర,వైలక్ష,మహాపాతనాశక,సంజ్ఞక,సూర్యతీర్థం మొదలైన పుణ్యతీర్థాలు ఉన్నాయి. అలాగే బృందావన పరిసరాలలో వత్సక్రీడనకం, కేశి,ద్వాదశాదిత్య తీర్ధం,యమలార్ణకం,బహుళతీర్ధం, భాండాహ్రదం,సప్తసాముద్రికం,వీరస్ధలం, కుశస్ధలం,పుష్పస్ధలం, గోపీస్వరం, గోవిందతీర్ధం,వత్సపుత్రిక తీర్ధం,ఫల్గుణ తీర్ధం,వృషభాంజక తీర్ధం,తాళవనతీర్ధం,సంపీఠకకుండం మధురానగరానికి తూర్పుదిశలో ఇంద్రతీర్థం, పడమరదిశలో వరుణతీర్థం,ఉత్తరదిశలో కుబేరతీర్థం,దక్షణ దిశలో యమతీర్ధం వంటి పలు పుణ్య తీర్థాలు ఉన్నాయి.
గోవర్ధనగిరి ప్రాంతంలో పుండరీక తీర్థం,సంకర్షణ తీర్థం, శక్ర (ఇంద్రతీర్థం) కదంబఖండవం,రాధాకుండం వంటి ఎన్నో పుణ్యతీర్థాలు ఉన్నాయి.
ఇంకా బలరామదేవుడు సందర్శించిన దివ్యతీర్ధాలు....
బలరాముడు అప్సరసలు నాట్యం చేసే భూమిక అనే తీర్థం చేరి దానిని సేవించాడు. ఆతరువాతబలరాముడు విశ్వావసుడు లాంటి గంధర్వులు తపస్సు చేసి తపస్సిద్ధి చెందిన గంధర్వ తీర్థం చెంతకు వెళ్ళాడు. అక్కడి నుండి బలరాముడు గర్గ క్షేత్రముకు వెళ్ళాడు. అక్కడ గర్గుడు చాలా కాలంనివసించాడు. శంఖతీర్థం, నైసర్గికం,నాగదన్వానికివెళ్ళాడు.   
నాగదన్వం వాసుకి నివసించిన ప్రదేశం. అది వాసుకి దేవతల చేత అభిషిక్తుడైన ప్రదేశం. 
అక్కడి నుండి బలరాముడు నైమిశారణ్యం వెళ్ళాడు. నైమిశారణ్యానికి సరస్వతీ నది చాలా దూరంలో ఉంది. అప్పుడు నైమిశారణ్య వాసులు ఒక క్రతువు ఆచరించి సరస్వతీ నదీమ తల్లి అనుగ్రహం పొంది ఆమెను తమ చెంత ప్రవహించమని కోరారు. సరస్వతీ నది వారి కోరిక మన్నించి తన గతి మార్చుకుని నైమిశారణ్య ప్రాంతంలో ప్రవహించ సాగింది.
 
తరువాత బలరాముడు సప్తసారస్వతముకు వెళ్ళాడు. అక్కడ మంకణుడు అను మహా ముని నివసిస్తున్నాడు. పూర్వం అక్కడ గంగ బ్రహ్మదేవుడు చేసిన యాగముకు, నైశారణ్యంలోని మునులు చేసిన యాగముకు, వశిష్ఠుడు చేసిన యాగముకు, గురువు చేసిన యాగముకు, గయుడు చేసిన యాగముకు, ఉద్దాలకుడు చేసిన యాగముకు సరస్వతీనది స్త్రీ రూపమున వచ్చి వారి చేత అత్యంత గౌరవ మర్యాదలు పొందింది. అందువలన అది సప్తసారస్వతం అయింది. 
తరువాత బలరాముడు వశిష్టాశ్రమమునకు వెళ్ళాడు. సరస్వతీ నదీ జలాలో పరిశుద్ధ పుణ్య స్నానాలు చేసాడు. 
తరువాత బలరాముడు సోమతీర్ధముకు వెళ్ళాడు.
సోమతీర్థం నుండి బలరాముడు అగ్ని తీర్థం వద్దకు వెళ్ళాడు. ఇక్కడ " భృగు శాపానికి గురి అయిన అగ్నిదేవుడు అలిగి ఇక్కడ ఉండగా దేవతలు అతడిని బుజ్జగించి సర్వ భక్షకుడివి కమ్మని భృగువు ఇచ్చిన శాపం జరిగినా ఏది భక్షించినా అగ్ని పవిత్రత చెడదని వరమిచ్చారు. అగ్ని సంతసించి తిరిగి తన విధి నిర్వహణకు పూనుకున్న ప్రదేశం ఇదే. అందు వలన ఈ ప్రదేశానికి అగ్నితీర్థం అనే పేరు వచ్చింది. బలరాముడు ఆ తరువాత కుబేర తీర్ధానికి వెళ్ళాడు.
కుబేరతీర్థం నుండి బదరిపాచనం వెళ్ళాడు. పూర్వం భరధ్వాజుని కుమార్తె అయిన ప్రభావతి ఇంద్రుడిని భర్తగా కోరి తపస్సు చేసింది. ఇంద్రుడు వశిష్టుడి వేషంలో ఆమె వద్దకు వచ్చాడు. ప్రభావతి తన కోరికను చెప్పింది. ఇంద్రుడు కొన్ని రేగుపండ్లను ఆమెకు ఇచ్చి పచనం చెయ్యమని చెప్పాడు. ఆమె శుచిగా స్నానం ఆచరించి వాటిని పొయ్యి వెలిగించి వండనారంభించింది. అవి ఎంతకూ ఉడక లేదు. ఆమె ఎంతో ప్రయత్నించి విఫలమై పాకం చెడుతుందని తన కాళ్ళను పొయ్యిలో పెట్టి ఉడకపెట్ట సాగింది. ఆమె నిష్ఠకు మెచ్చి ఇంద్రుడు " శుభాంగి నీ నిష్ఠకు మెచ్చితిని. నీవు ఈ శరీరం విడిచి దివ్యదేహం ధరించి దేవలోకం వచ్చిన ఎడల నీ కోరిక తీర్చగలను. ప్రభావతి అలాగే చేసిన పుణ్య ప్రదేశం ఇది కనుక ఈ ప్రదేశం సర్వపాపహరమైంది. రేగుపండ్లకు బదరీఫలం అనే మరొక పేరు ఉన్నది కనుక బదరిపాచనం అయింది. ఆ తరువాత బలరాముడు ఇంద్రతీర్థం వెళ్ళాడు. అక్కడ ఇంద్రుడు నూరు అశ్వమేధ యాగములు చేసాడు.
ఆ తరువాత బలరాముడు రామతీర్థం వెళ్ళాడు. పరశురాముడు 21 మార్లు భూప్రదక్షిణ చేసి క్షత్రియ సంహారం చేసి అంతటితో తృప్తి చెందక అశ్వమేధ యాగములు, రాజసూయ యాగములు, వాజపేయములు చేసిన ప్రదేశం అది. పరశురాముడు కశ్యపుని ఆధ్వర్యంలో ఆ యాగములు నిర్వహించి తాను జయించిన భూమినంతా కశ్యపునికి దక్షిణ నిమిత్తం ఇచ్చేసిన ప్రదేశం అది. అక్కడ నుండి బలరాముడు యామున క్షేత్రంకు వెళ్ళాడు. అక్కడ వరుణుడు ఎన్నో రాజసూయ యాగములు చేసాడు. అవి పూర్తి కాగానే దేవాసుర యుద్ధం సంభవించింది. 
అక్కడి నుండిబలరాముడు అదిత్యతీర్థం వెళ్ళాడు. ఆతీర్థంలో సూర్యుడు యాగము చేసి జ్యోతిషాధిపత్యం పొందాడు. అక్కడ నుండి బలరాముడు సారస్వతం అనే పేరుగల వశిష్టతీర్థం వెళ్ళాడు. పూర్వం అక్కడ దధీచి అనే ముని ఘోరమైన తపస్సు చేసాడు. ఆ తపస్సుకు ఇంద్రుడు భయపడి తపోభంగం చేయాలని అనుకుంటాడు. దధీచి తపో భంగం చేయడానికి అలంబుస ' అనే అప్సరసను పంపాడు. దధీచికి అలంబసని చూసి రేతః పతనం అయింది. ఆ రేతస్సును సరస్వతీనది తనలో దాచుకుంది. ఆ కారణంగా సరస్వతీనది ఒక కుమారుని కని అతడిని తీసుకుని వెళ్ళి " మహామునీ ! ఇతడు నీ కుమారుడు. నీ నుండి పతనమైన రేతస్సును భద్రపరచి కుమారుడిని కన్నాను " అని చెప్పింది. దధీచి ఆ కుమారుని ఆలింగనం చేసుకుని సరస్వతీవదితో " అమ్మా ! నీవు బ్రహ్మసరస్సున పుట్టావు, పుణ్యనదులలో మేటివి, నీ జలములలో పితృదేవతలకు తర్పణం విడిచి విశ్వదేవతలు, పితృదేవతలు, గంధర్వులు తృప్తి చెందుతారు. ఈ కుమారుడు నీ పేరుతో సారస్వతుడు అని పిలువబడతాడు. ఇప్పటి నుండి రాబోయే 12 సంవత్సరాలకు తీవ్రమైన కరువు ఏర్పడుతుంది. సారస్వతుడు మహా మునులను ఆ కరువు నుండి రక్షించి వేదాధ్యయనం చేయిస్తాడు " అని చెప్పి ఆ కుమారుడిని సరస్వతీనదికి ఇచ్చివేసాడు. ఆ సమయంలో దేవాసురయుద్ధం వచ్చింది. ఇంద్రుడికి అసురసంహారానికి ప్రశస్థమైన ఆయుధం కావలసి వచ్చింది. దేవతలు ధధీచిని ప్రార్ధించి అతడి వెన్నెముకను ఆయుధము నిమిత్తం అడిగాడు. ధధీచి తన దేహత్యాగం చేసి వెన్నెముకను ఇచ్చాడు. ఇంద్రుడు ఆ ఆయుధముతో యుద్ధం చేసి రాక్షసులను జయించాడు . తరువాత 12 సంవత్సరాలకు తీవ్ర క్షామం వచ్చింది. సారస్వతుడు మహా మునులందరినీ చేరదీసి సరస్వతీనదీ తీరమున వేదాధ్యనం చేయించాడు.
సారస్వతం నుండి బలరాముడు వృద్ధకన్యాశ్రమం వెళ్ళాడు. వృద్ధకన్యాశ్రంలో ఖని అనే కన్య స్వర్గం మీద ఉన్న ఆపేక్షతో తీవ్ర తపమాచరించి వృద్ధురాలైంది. అప్పుడు నారదుడు ఆమె వద్దకు వచ్చి ఆమె కోరిక తెలుసుకొని " కన్యకా ! నీవు అవివాహితవు. అవివాహితలకు స్వర్గం నిషిద్ధం " అన్నాడు. అప్పుడు ఆమె " తన తపస్సులో సగం ధారపోసి యవ్వనవతియై గాలవుడు అనే ముని యొక్క కుమారుడిని వివాహము చేసుకొని ఒక్క రోజు మాత్రమే సంసారం సాగించి స్వర్గానికి బయలుదేరింది. అందుకు ఆ మునికుమారుడు బాధపడ్డాడు. ఆ వృద్ధకన్య మునికుమారుడి బాధను నివారించే విధంగా ఆ క్షేత్రంలో ఎవరైనా ఒక్క రోజు ఉపవాసం ఉండి దేవతలను, పితృ దేవతలను తృప్తి పరచిన ఎడల 50 సవత్సరాలు బ్రహ్మచర్య వ్రతం ఆచరించిన ఫలితం దక్కుతుంది " అని చెప్పి స్వర్గానికి వెళ్ళింది. బలరాముడు ఇలా పలు మహిమాన్విత పుణ్యతీర్ధాలలో స్నానాలు చేసాడు ' అన్నాడు విక్రమార్కుడు .
అతనికి మౌనభంగం కావడంతో శవంతోసహా బేతాళుడు మాయమై తిరిగి చెట్టుపైకి చేరాడు.
పట్టువదలని విక్రమార్కుడు బేతాళునికై మరలా వెనుతిరిగాడు.

కామెంట్‌లు