దురాశ!(హిందీ కథ ఆధారం);-అచ్యుతుని రాజ్యశ్రీ

 రాంపుర్లో హీరా మోతీ తారా చందూ అనే నలుగురు మిత్రులు ఉన్నారు. బాగా బీదరికం!పూట గడవడం కష్టం గా ఉంది. నగరం వెళ్లి పనికోసం వెతుకుదాం అని బైలుదేరారు.దారిలో చీకటి పడింది. ఓకుటీరం కనపడితే అందులోకి వెళ్లారు. వారి గోడువిన్న సాధువు ఇలా అన్నాడు " మీకు ఒక వెలుగుతున్న కొవ్వొత్తి ఇస్తాను.అలా ఆకుపచ్చ రంగులో మెరిసే కొండ కనపడితుంది.దాని వైపు వెళ్లండి. ఎక్కడ ఐతే కొవ్వొత్తులు కింద పడతాయో అక్కడ మీరు భూమి ని తవ్వుతూ పోండి.అక్కడ కనపడే నిధిని తీసుకుని ఇంటికి వెళ్లి పోండి".సాధువుకి ధన్యవాదములు చెప్పి ఆనలుగురు తెల్లా రుతూనే కొవ్వొత్తులు తో బైలుదేరారు. ఆకుపచ్చ కొండ కనపడితే అటుగా అడుగులేయసాగారు.
హఠాత్తుగా కొవ్వొత్తులు ఒక చోట కింద పడినాయి.ఆప్రాంతంని తవ్వసాగారు.ఇత్తడి లోహం కనపడితే హీరా అన్నాడు "ఇంత కష్టపడితే మనకు దొరికింది ఇత్తడి. " మోతీ అన్నాడు "ఇంకా తవ్వుతూ పోదాం " కాసేపటికి  వెండి కనపడితే మోతీ అన్నాడు "ఇత్తడి  వెండి  తీసుకుని సాధువుని కలిసి వెళ్లుదాము."కానీ తారా చందూ మొండి గా "ఇంకా ముందు కి వెళ్లి చూద్దాం "అన్నారు. హీరామోతీ తమకుదొరికిన ఇత్తడి వెండితో వెనుతిరిగారు. చందూ చేతిలో కొవ్వొత్తి ఒక చోట పడితే వారిద్దరూ కలిసి తవ్వారు. బంగారం బైట పడింది. "తారా!బంగారం దొరికింది. ఇంక మనం గూడా సాధువు దగ్గరకు పోయి కృతజ్ఞతలు తెలుపుదాం" అని చందూ అన్నాడు. ఆశపోతు చందూ వినకుండా "నాచేతిలోది  ఎక్కడ పడితే  అక్కడ తవ్వి ఆసంపద తీసుకుని గానీ నేను రాను"అన్నాడు.చందూ వాడిఖర్మానికి వాడిని వదిలేసి  వచ్చిన  దారి పట్టాడు. ఆకొండపైన ఓవ్యక్తి నుదిటిమీద వజ్రం ధగధగా మెరుస్తోంది."ఇక్కడ వజ్రాల గని ఉంది "అని అనుకుంటూ ఆవ్యక్తి వైపు అడుగులేయసాగాడు. అంతే ఆవ్యక్తి  నుదుటి పై ఉన్న వజ్రం  చక్రం లాగా గిరగిరా తిరిగి తారా  నుదుటి మధ్యలో అతుక్కుపోయింది."అయ్యో!ఇదేంటి ?"అని గాభరాగా ఖంగారుగా అరవసాగాడు.ఆవ్యక్తి ఇలా అన్నాడు " మూర్ఖుడా! దురాశ తో నీకళ్లు మూసుకుని పోయాయి. నీమిత్రులమాట వినకుండా మొండి గా వచ్చి  చిక్కుల్లో ఇరుక్కున్నావు.ఈమంత్రాలచక్రం ని నేను వజ్రం అని భ్రమసి  ఇలా ఉండిపోయాను.ఇక నీరాకతో నాకు ముక్తి లభించింది. నీలాంటి దురాశాపరుడు ఇక్కడి కి వస్తేనే నీకు విముక్తి " అనేసి వెళ్లి పోయాడు. తారా మాత్రం  అలాబందీలా అక్కడే ఉండి పోయాడు.అందుకే  చందమామ అలా పైనించి చూస్తూ ధైర్యం చెప్తాడు.
మనకు ఉన్న దాని తో  తృప్తి పడాలి.లేకుంటే  ఎన్నో కష్టనష్టాలపాల బడాల్సి ఉంటుంది. 🌷
కామెంట్‌లు
Unknown చెప్పారు…
1.దురాశ దుఃఖానికి చేటు.2.అతిగా ఆశపడ కూడదు.3.ఉన్నదానితో దొరికిన దానితో తృప్తి పడాలి.
.