*భర్తృహరి సుభాషితములు - పద్యం (౦౪౯ - 049)*
 
*దుర్జన పద్ధతి*
చంపకమాల:
*ఖలు లగువారినెల్లనధి కారసమర్ధలఁ జేసి, తానిర*
*ర్గళగతియై నికృష్టనిజ కర్మము విస్మృతిపా లొనర్చి, ని*
*శ్చలగుణవైరియై, విధివ శంబున సంపద గాంచి త్రుళ్ళుచున్*
*మెలఁగునృపాలు దేశమున మేలు లభించునె యెట్టవారికిన్?*
*తా:*
దుర్మార్గులు అయిన వారిని అందరినీ చేరదీసి, వారికి అధికారము కట్టబెట్టి, రాజు, అధికారి అయిన తాను కూడా చెడు గుణములను, పద్ధతులను అనుసరిస్తూ మంచి బుద్ధి కలిగి వుండి, అందిరకీ వుపయోగ పడే దారిలో వుండేవారిని ఇబ్బంది పెడుతూ, బాధపెడుతూ, వుండే రాజు, అధికారి దగ్గర ఎవరికైనా మంచి జరుగుతుందా. జరగదు........ అని *"ఏనుగు లక్ష్మణకవి"* చెపుతున్నారు.
*భావం:*
*"దుష్టులకు దూరంగా వుండాలి", చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టలి" అన్నారు పెద్దవారు.  ఎప్పడో చెప్పిన సుభాషితము, కానీ ఇప్పటి సమాజ పరిస్థితులకు అద్దం పడుతున్నట్టుగా వుంది. ఏ కాలంలో నైనా, ఎప్పుడైనా దుర్మార్గులకు చేరువలో వుండి సుఖపడిన వారు ఎవరైనా వున్నారా? దుర్భిణి వేసినా కూడా దొరకరు. చరిత్రలో లెక్కకు మిక్కిలి ఉదాహరణలు దొరుకుతున్నాయి. కానీ సమాజంలో మార్పు కనపడలేదు. చరిత్రను సృష్టించిన వాడు, సాక్షాత్తు ధర్మ స్వరూపం, తండ్రి కోసం రాజ్యం, కోసం అన్నీ పరిత్యజించిన వాడు, కౌరవ వంశ మూల స్థంబము అయిన భీష్మపితామహుడు కూడా, కౌరవ పక్షాన వున్న కారణంగా అంత్య దశలో బాణాలములుకులు గుచ్చుకుంటున్న అంపశయ్య మీద పరుండ వలసి వచ్చింది. ఇచ్ఛా మరణం వరంగా పొంది కూడా, అంత బాధనూ అనుభవిస్తూ, ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే వరకు ఎదురు చూసాడు కదా మరణం కొరకు. దుష్టుల దూరకూడదు అనడానికి ఇంతకంటే ఉదాహరణ కావాలా మనకు.  క్షీర నీర న్యాయము చేయగలిగే సద్బుద్ధిని పరాత్పరుడు ఇవ్వాలని ప్రార్థిస్తూ.... .*
..... ఓం నమో వేంకటేశాయ

Nagarajakumar.mvss

కామెంట్‌లు