తెలుగు బాల సాహిత్యం - పరిణామ దశలు -బెహరా ఉమామహేశ్వరరావు--సెల్ నెంబరు:9290061336

 నేటి  సమాజంలో పిల్లలను పట్టించుకోకపోవడం మనకు కనిపించే రుగ్మతలలో ఒకటి. ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లలను పట్టించు కోకపోవడం; దీనికి ఏ ఒక్కటి కారణం అని ఇతమిత్థంగా చెప్పలేం.కానీ కొన్ని ఆర్థిక సంబంధమైన కారణాలైతే మరికొన్ని సామాజిక పరిస్థితుల కారణంగా కనిపిస్తుంటాయి.
ఈ తరుణంలో మాతృభాషకు ముప్పు వచ్చే పరిస్థితులు స్పష్టంగా కనబడుతున్నాయి. గతంలో ధనికులకే పరిమితమైన ఆంగ్ల విద్యా బోధన; నేడు సమాజంలోని అన్ని  వర్గాల వారికి అందుబాటులోకి రానున్నది. పల్లెటూర్లలో చదువుకుంటున్న ప్రాథమిక పాఠశాలల విద్యార్థులు మరియు ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ఈనాటి వరకు తెలుగు మాధ్యమంలో విద్యాబోధన సాగింది. అందుచేత తెలుగు రాయను చదవను తెలిసే పిల్లలు ఈనాటి వరకు కనిపిస్తున్నారు.  ఇక ఈ ఆశలు అడుగంటిపోయే సమయం ఆసన్నమైంది.
ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లిన పిల్లలు, నిన్నటి వరకు మాతృ భాషలో చదువు నేర్చుకునే పరిస్థితి ఉండేది. కాని ఇపుడు  మాతృభాషలో చదువులు గానీ లేదా ఆంగ్ల భాషలో చదువులు గాని, ఏదో ఒక మాధ్యమం ద్వారా పిల్లలు చదువు నేర్చుకునే అవకాశం ప్రభుత్వం కల్పించింది. ఈ సమయంలో అందరూ ఆంగ్ల భాష లో నేర్చుకునేందుకు మాత్రమే ఉత్సాహం చూపిస్తున్నారు.ఈ పరిస్థితులలో ప్రాథమిక స్థాయి నుండి ఆంగ్ల భాషలో బోధన  ప్రారంభమైతే క్రమేపీ మాతృభాష ఉనికిని కోల్పోవడం తప్పదు. 
      మనది  ప్రజాస్వామిక దేశం కదా! ప్రజలు, ప్రజా సంఘాలు మాతృభాష పునరుద్ధరణ కోసం ఉద్య మించాలి.
    పిల్లలకు మాతృభాష నేర్పే కేంద్రాలు ఏర్పాటు చేసి
వాటి ద్వారా కొన్ని   ప్రోత్సాహకాలు ఇవ్వడం జరగాలి.పిల్లలలో మాతృభాష పట్ల అభిమానం కల్పించడం కోసం కొన్ని నిత్య కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ సుదీర్ఘంగా సాగాలి.
ప్రస్తుత సమాజంలో ప్రజా సంఘాలు, సాంస్కృతిక సంస్థలు ఈ బాధ్యతను స్వీకరించక తప్పదు.
      ప్రస్తుతం మన మాతృ భాష అభివృద్ధి కోసం సంస్థలు చేపడుతున్న ఇటువంటి కార్యక్రమాలు సరిపోవు,  ఏ మూలకో అన్నట్లు కనిపిస్తుంది.
          మాతృ భాషాభివృద్ధిలో బాల సాహిత్యమే ఈ ఉద్యమానికి మూలం కావచ్చును.
        బాల సాహిత్యం అంటే కేవలం పిల్లల కోసం రాసే కథలే గాక విజ్ఞాన సాంకేతిక పరిజ్ఞాన విషయాలు కూడా నేడు ప్రాముఖ్యత సంతరించు కున్నాయి.
      బాల సాహిత్యం అంటే ‌‌ "బాలలకు హితం కలిగించేదే బాల సాహిత్యం". హితం అంటే మంచి చేకూర్చేది అని అర్థం ఇది మనందరికి తెలిసిందే.
    ఇది ఏనాటిది అనే చర్చ నేటికీ జరుగుతుంది.
తెలుగులో బాల సాహిత్యం ఏనాటిదో నని ఇదమిద్దంగా చెప్పలేం. అలాగే దీనికి కర్తలెవరో చెప్పలేం. తొలి బాల సాహిత్యవేత్త తల్లి అని మాత్రం చెప్పడానికి అవకాశాలు ఎక్కువ.
        మనదేశంలో అనేక భాషలు ఉన్నాయి. అన్ని భాషలకు మూలం సంస్కృతమే. సంస్కృత భాష కు ముందు బాలసాహిత్యం లేదా అంటే ఉంది అని సమాధానం వస్తుంది.
    ఈ భూమి అంతా జలమయమై ఉండే యుగయగాల క్రిందట శిలలతో, భూమి ఏర్పడిన తొలి రోజుల్లో ఈ భువిపై తొలి శిశువు జన్మించింది.
 ఆ శిశువు అవతరించిన శుభ సమయంలో భూమాత పరవశించి పోయింది. ప్రకృతి మాత శిశువును స్వాగతిస్తూ తొలి గీతం పాడింది.
 రోదిస్తున్న ఆ శిశువును చూసి జోల పాట పాడింది
         వేనవేల గత వసంతాల కేళిలో
          తొలి మానవ శిశువు  భువిపై
           జనించిన శుభ తరుణంలో 
           వీచె మలయ మారుతాలు
           పుడమి తల్లి పరవశించే
           ప్రకృతి మాత పాడేగీతం
           స్వాగత సుస్వాగతం గీతం
            నింగిలో తారకలే మాలికలై
           తూర్పున అరుణ కిరణాలు
           భావి జగతిన ప్రగతి వెలుగులు
          లోక కళ్యాణమే మహాభాగ్యమై
          జ్ఞానం విజ్ఞానం విరియాలి.
     
         (తదుపరి)

కామెంట్‌లు