స్నేహితుల ఎంపిక (కథ) రచయిత: సరికొండ శ్రీనివాసరాజు
    రంగ 10వ తరగతి చదువుతున్నాడు. చిన్నప్పటి నుంచీ చదువులో చాలా వెనుకబడేవాడు. ఆటపాటల్లో మునిగి తేలుతూ చదువును నిర్లక్ష్యం చేసేవాడు. పైగా దురుసు స్వభావం. చాలా మందితో చీటికీ మాటికీ గొడవ పడేవాడు. ఆ తరగతిలో మొదటి ర్యాంకు వచ్చే రాఘవ అంటే రంగకు ఈర్ష్య ‌‌చిన్న విషయానికే రంగతో గొడవ పడుతూ నానా మాటలు అనేవాడు. ఒక్కోసారి కొట్టేవాడు కూడా. అందుకే రంగకు, రాఘవకూ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే వైరం.
       ఇటీవల హఠాత్తుగా రంగ రాఘవతో మంచిగా ప్రవర్తించడం మొదలు పెట్టాడు. రాఘవతో స్నేహంగా ఉండటం, రాఘవకుకు కావలసినవి ఏమిటో అడిగి సమకూర్చడం, రాఘవకు రకరకాల తిను బండారాలను కొని ఇవ్వడం చేస్తున్నాడు. రాఘవ ప్రాణ స్నేహితుడు అశ్వత్థామ రాఘవను హెచ్చరించాడు. "ఏనాడూ నిన్ను శత్రువులా చూసే రంగ అకస్మాత్తుగా నీతో స్నేహం చేస్తున్నాడు అంటే ఏదో మోసం ఉండి ఉంటుంది. నీ జాగ్రత్తలో నువ్వు ఉండు." అని. చూద్దాం అన్నాడు రాఘవ. రాఘవ రంగను పరీక్షలు దగ్గర పడుతున్నాయి కాబట్టి కష్టపడి చదవమని చెప్పాడు. తనకు ఏ సహాయం కావాలన్నా చేస్తానన్నాడు. కానీ రంగ ఆ మాటలను పెడ చెవిన పెట్టాడు. 
       ప్రీ ఫైనల్ పరీక్షలు సమీపిస్తున్నాయి. రంగ రాఘవను తనకు పరీక్షల్లో జవాబులు చూపించాలని వేడుకున్నాడు. "కష్టపడి చదవాలి కానీ ఇలా అడ్డదారులు తొక్కవద్దు." అన్నాడు రాఘవ. ఇప్పటికి ఇప్పుడు తనకు చదివే సమయం లేదని, తనకు తక్కువ మార్కులు వస్తే తన తల్లిదండ్రులు ఫైనల్ పరీక్షలు రాయించరని తనకు మంచి భవిష్యత్తు ఉండదని మొసలి కన్నీరు పెట్టుకున్నాడు. 
       రాఘవ జాలిపడి అన్ని సబ్జెక్టుల్లో రంగకు జవాబులు చూపించాడు. ఎన్నడూ పాస్ మార్కులు కూడా రాని రంగకు ఇంత మంచి మార్కులు ఎలా వచ్చాయా అని ఆశ్చర్యపోయారు ఉపాధ్యాయులు. ప్రతి ఉపాధ్యాయుడు తమ సబ్జెక్టుల్లో రంగ రాసిన జవాబులను మళ్ళీ నోటికి అప్పజెప్పమన్నాడు. నోరెల్లబెట్టాడు రంగ. ఉపాధ్యాయులు రంగను కఠినంగా దూషించారు. రంగ తనకు చూచి రాయడం ఇష్టం లేదని, నిజాయితీగా రాస్తానని అన్నా వినకుండా తన దాంట్లో చూసి రాస్తూ ఎక్కువ మార్కులు సాధించక పోతే తన స్నేహం మీద ఒట్టు అని రాఘవ అన్నాడని అందుకే రాఘవ జవాబులను చూసి రాశానని రంగ చెప్పాడు. పరీక్షలలో జవాబులు చూపించి, తాము సంవత్సరం అంతా పడ్డ కష్టాన్ని వృథా చేయించావని ఉపాధ్యాయులు రాఘవను దారుణంగా దూషించారు. గణిత ఉపాధ్యాయుడు రాఘవ జవాబు పత్రాన్ని ముక్కలుగా చించి విసిరేశాడు. రాఘవ వెక్కి వెక్కి ఏడ్చాడు. అందుకే స్నేహితుల ఎంపికలో జాగ్రత్త అవసరం. ఎప్పుడూ మనల్ని శత్రువుల్లా చూసేవారు కారణం లేకుండా ఒక్కసారిగా మనకు దగ్గరవ్వాలని చూస్తే అనుమానించాల్సిందే‌.

కామెంట్‌లు