తప్పవు చిన్న చిన్న అబద్ధాలు...!!; -- యామిజాల జగదీశ్
 ఓ తండ్రీ తన కొడుకుతో కలిసి ఓ స్నేహితుడింటికి వెళ్ళారు. 
కాస్సేపు అవీ ఇవీ మాట్లాడుకున్నారు. మిత్రుడు ఇప్పుడే వస్తానని లోపలికి వెళ్ళాడు. 
అనంతరం మిత్రుడి కూతురు  టీ పట్టుకొచ్చి టీపాయ్ మీద పెట్టి వెళ్ళిపోయింది. 
తండ్రి టీ కప్పు తీయబోతుంటే కిందపడి ముక్కలైంది.
ఆ శబ్దం విని లోపలున్న మిత్రుడు పరుగున బయటకు వచ్చాడు.
నేలమీద ముక్కలై చెల్లాచెదురుగా పడివున్న టీకప్పు ముక్కలను చూసి "అరెరె, అందమైన చైనా కప్పు. ఎలా పగిలింది?" అని ఆందోళనగా అడిగాడు మిత్రుడు.
"నా చేజారి కప్పు కిందపడిందిరా" అన్నాడా తండ్రి బాధతో.
సరేలే ఆంటూ మిత్రుడు కిందపడ్డ పింగాణి ముక్కలను ఏరుకుని తీసుకుపోయాడు.
ఇదంతా చూసి తండ్రితో వచ్చిన కొడుకు అడిగాడు "నాన్నా! నీ చేయసలు కప్పుని పట్టుకోలేదు. మరెందుకు చేయని తప్పుని చేసినట్టు చెప్పుకున్నావు?" అని అడిగాడు.
"నిజమే. టీకప్పు తీసుకొచ్చి టీపాయ్ మీద పెట్టిందేమో నా మిత్రుడి కూతురే. ఆ అమ్మాయి టీపాయ్ మీద సరిగ్గా పెట్టలేదు.
దాంతో అది కింద పడి ముక్కలైంది. ఈ నిజం చెప్తే నా మిత్రుడు ఒప్పుకుంటాడా? ఒప్పుకోకపోగా నేనెంత మిత్రుడినైనా నన్ను అనుమానించకపోడు. కనుక అటువంటి అనుమానానికి తావివ్వక తప్పు జరిగినట్టు చెప్పుకున్నాను. అలాకాక, జరిగిన ఈ తప్పుకి నువ్వు సాక్షివై చెప్తే అతను తన కూతుర్ని కోపగించుకుంటాడు. దీంతో ఆ అమ్మాయికి నేనంటే నచ్చకపోవచ్చు. ఇది క్రమంగా మామధ్య స్నేహానికి చీలిక తీసుకువస్తుంది. బంధం చెడిపోకుండా ఉండటం కోసం ఇలా చిన్న చిన్న అబద్ధాలు అప్పుడప్పుడూ కావలసొస్తాయిరా...." అన్నాడా తండ్రి కొడుకుతో.
నాన్న ముప్పై ఏళ్ళ అనుభవమే ఈ నిర్ణయానికి కారణమైంది. జీవితం మనకు నేర్పే పాఠం ఇలాటిదే.
అయితే కొందరు ఇందుకు బదులు స్వార్థంకోసం, ఎటువంటి బంధాన్నయినా ముక్కలు చేసుకోవడానికి, గొడవపడటానికి, ఇతరుల సంతోషాన్ని చెడగొట్టడానికి ఏమాత్రం ఆలోచించరు.
బంధాలను ఏర్పరచుకోవడం సులభం.
కానీ ఆ బంధాలను నిలుపుకోవడం అనుకున్నంత తేలికకాదు.
ఇచ్చిపుచ్చుకోవడాలు, అర్థం చేసుకోవడాలు వంటివి చాలా అవసరం. 
మనమెలాటివారమో మన చేతలే చెప్పక చెప్తాయి.

కామెంట్‌లు