మారేడు మల్లన్న ఇష్టపదులు ;- ఎం. వి. ఉమాదేవి
మారేడు దళముతో మల్లికార్జున స్వామి 
నిన్నుపూజించేను నీలకంఠ నిత్యము 

నందివర్ధనమ్ములు నయగార మొలికినవి 
ధవళకాంతి తోడను ధవుని పాదములందు 

కస్తూరి కన్యకలు విస్తుపోవువిధమ్ము 
కమనీయకంఠాన కలిసేను మాలలో 

తీరుతీరున చెలఁగె తీగల శంఖుపూలు 
తపనలే చెందినవి తండ్రి నిన్ను జేర

నాగలింగము సుమము నాకన్న  ఘనమేది 
యనుచున్న తీరొచ్చి యనుచరగణమైనది 

వీభూతి పండొకటి వినయమ్ము పాటించి 
తెలతెల్లగా మెరిసె తిష్టవేసెను నుదుట 

జేగంటలే మ్రోగె జిహ్వ శివశివ యనగ 
శివమూర్తి చలియించి సింగారి గౌరితో 

మారేడు నీవయ్య మల్లన్న మేలుకో 
చేయి నందించి మము చేదుకో మల్లన్న !!

కామెంట్‌లు