చెప్పులోనిరాయి;-ఎం బిందుమాధవి
 చెప్పులోని
రాయి
,
చెవిలోని
జోరీగ
కంటిలోని
నలుసు
కాలి
ముల్లు
ఇంటిలోని
పోరు
ఇంతింత
కాదయా
విశ్వదాభిరామ
వినురవేమ
[చెప్పులో ఇరుక్కున్న రాయి, కనబడకుండా ఉండి అడుగు ముందుకి పడనివ్వక ఇబ్బంది పెడుతుంది. మీరెప్పుడైనా గమనించారో లేదో...దోమలు మన చెవి చుట్టూ తిరుగుతూ సంగీతం పాడుతూ తెగ చికాకు పెట్టేస్తాయి. కుట్టే దోమలకంటే ఇలా చెవిలో సంగీతం పాడే దోమలే ఎక్కువ చికాకుని కలిగిస్తాయి.
కన్ను అంటేనే అతి సున్నితమైన అవయవం. అందులో నలక పడిందంటే చాలు, ఆపకుండా కన్ను నలుపుతూనే ఉంటాం. నీళ్ళు కారుతూ చూపుని ఇబ్బంది పెడుతుంది.
కాల్లో గుచ్చుకున్న ముల్లు కలిగించే సలుపు చెప్పటానికి మనకొచ్చిన భాష చాలదు.ఇక ఇంట్లో వారు ఏదైనా పని చెప్పి అది అయ్యేవరకూ పోరుతూనే ఉంటారు.
ఈ అన్ని విషయాలు మనిషిని నిలవనివ్వక ఎలా పోరుపెట్టి వేధిస్తాయో కొంత మంది ఒక విషయాన్ని పట్టుకుంటే వదిలిపెట్టరు. పని తోచనివ్వరు.]
ఇది ఈ పద్య తాత్పర్యం...ఇక కధలోకెళదాం!
"చెయ్యి ఖాళీ లేక కాస్త కాఫీ పెట్టమని చెప్పా. స్టవ్ మీద పాలు పెట్టి సెల్ ఫోన్ చూసుకుంటే కూర్చుంటే ఆ కాసిని పొంగిపోతాయ్. ఎన్ని సార్లు చెప్పినా చేసే పని మీద ధ్యాస ఉండనే ఉండదు కదా" ఇలా సాగి పోతున్నది అమ్మ వాక్ప్రవాహం.
"అబ్బా నేను స్టవ్ పక్కనే ఉన్నానే! చూసుకోకుండా ఊరికే అరవకు. ఎవరన్నా వింటే చేతిలో పని అందుకోకుండా మేం నిన్ను విసిగించి చంపుతున్నాం అనుకుంటారు. " అన్నది మధుమతి.
"ఒరేయ్ వాసూ... డ్రై క్లీనింగ్ షాపుకెళ్ళి చీర తీసుకు రమ్మన్నా కదా! రేపు తెల్లారేసరికి పెళ్ళికెళ్ళాలి. ఇప్పుడు షాప్ మూసే లోపు వెళ్ళకపోతే రేపు ఇబ్బంది అవుతుంది. ఎంత అరిచి చచ్చినా కూర్చున్న చోటి నించి కదలరు కదా" అని మాగాయ్ కోసం మామిడి కాయలు తరిగే పనిలో పడింది.
"మధ్యాహ్నం నీ ముందే వెళ్ళి తెచ్చా కదమ్మా! నీకు కంగారెక్కువ. గుర్తు తక్కువ..ఓపికెక్కువ! అందుకే అరుస్తూ ఉంటావు" అన్నాడు వాసు.
"ఇదిగో మిమ్మల్నే...భరత్ కూతురు రేపు ఫ్లైట్ లో వస్తున్నదిట. వెళ్ళి తీసుకు రావాలి. గుర్తుందా" అన్నది.
"రేపు సాయంత్రం వెళ్ళేదానికి ఇప్పటి నించీ ఏం చెయ్యమంటావ్! ఇంకా 24 గం ల టైం ఉంది. ఈ లోపు ఇలా ఎన్ని సార్లు గుర్తు చేస్తూ ఉంటావో! నువ్వేం కంగారు పడకు...నాకు గుర్తుంది" అన్నాడు కిషోర్.
"నీ లాంటి వ్యక్తే మహా భారతంలో ఉన్నాడు తెలుసా" అన్నాడు.
"ఏకంగా నన్ను భారతంలో క్యారెక్టర్ చేసేశారు. ఇంతకీ ఎవరా మహానుభావుడు" అన్నది కల్పన తరిగిన మామిడికాయ ముక్కలు పక్కనున్న పెద్ద టబ్ లో పడేస్తూ!
"ఎవరంటే...శల్యుడు. ఆయన పాండు రాజు భార్య మాద్రికి అన్నగారు. గొప్ప పండితుడు, మేధావి. మంచి రధికుడు. ఇంద్రుడి సారధి మాతలి కంటే కూడా గొప్ప సారధి. కురుక్షేత్ర సంగ్రామం లో కర్ణుడి రధానికి సారధిగా ఉన్నాడు."
"శ్రీ కృష్ణుడు అర్జునిడికి సారధిగా ఉంటే, ఈయన కర్ణుడి రధం తోలాడు. రధి కంటే కూడా సారధి సమర్ధుడై, అనుభవజ్ఞుడై ఉండాలి. భీష్ముడు నేలకొరిగాక, అర్జునుడితో సమఉజ్జీగా యుద్ధం చెయ్యాలంటే తనకి సమర్ధుడైన సారధి కావాలని కర్ణుడు దుర్యోధనుడిని అడిగాడు. పాండవులకి అత్యంత ఆత్మీయుడు, బంధువు అయిన వ్యక్తి అని తెలిసి కూడా తనే కావాలని శల్యుడిని ఎంచుకున్నాడు."
"కర్ణుడికి సారధిగా ఉండటానికి ఒప్పుకున్న శల్యుడు, దుర్యోధనునితో....తను కర్ణుడికి నచ్చినా నచ్చకున్నా హితోక్తులు చెబుతూనే ఉంటానని, అతను కోపగించుకోకూడదని తన షరతులు చెప్పాడు. అందుకు అంగీకరించిన కర్ణుడిని యుద్ధం తిరిగి ప్రారంభమైనప్పటి నించీ అర్జునుడు ఎంత గొప్పవాడో, అతన్ని గెలవటం ఎంత కష్టమో, శ్రీకృష్ణుడిని తక్కువగా అంచనా వెయ్యటం కర్ణుడు చేసిన పెద్ద తప్పని పదే పదే హెచ్చరిస్తూ కించపరిచినట్టు మాట్లాడుతూనే ఉంటాడు."
"నీవు సూర్యపుత్రుడవని, నీకు కవచకుండలాలున్నాయని విర్రవీగుతున్నవేమో...ఖాండవ దహనం చేసేటప్పుడు దేవేంద్రుని గర్వం అణచి..ద్వంద్వ యుద్ధంలో సాక్షాత్తు పశుపతినే మెప్పించి అస్త్ర శస్త్రాలు పొందిన అర్జునుడి కాలిగోటికి కూడా నీవు సరిపోవు అంటూ అడుగడుగునా కర్ణుడిని తన మాటలతో బలహీన పరిచి, ధైర్యం కోల్పోయే లాగా చేస్తాడు. ఇది చాలదన్నట్టు అతనికున్న అనేక శాపాల వల్ల కర్ణుడికి ఏ అస్త్రాలు సమయానికి గుర్తు రాక యుద్ధంలో చివరికి నేలకొరిగాడు. అందుకే అస్తమానం వెనక పోరు పెడుతుంటే చెయ్యాలనుకున్న పని కూడా చెయ్యలేక విఫలం అవుతారు. అర్ధమౌతోందా" అన్నాడు కిషోర్.
"నీ ఆరాటం, అక్కర మాకు తెలుస్తున్నాయి. అంతగా పోరితే పిల్లలు కూడా నిన్ను తప్పించుకుని తిరుగుతారు. నీకు వాళ్ళకి మధ్య గ్యాప్ పెరుగుతుంది. పిల్లలతో స్నేహంగా మాట్లాడుతూ పనులు నేర్పించి చేయించుకోవాలే కానీ కాల్లో ముల్లల్లే గుచ్చకూడదు. ఎందుకు చెబుతున్నానో అర్ధం చేసుకో" అంటూ కల్పన భుజం నిమిరాడు.
"అలాగేలెండి. చిన్నప్పటి నించి అలవాటై పోయింది. ఇప్పటి నించి ప్రాక్టిస్ చేస్తాను. ఏకంగా భారతం లో నించి ఉదహరిస్తే ఆ మాత్రం జాగ్రత్త పడకపోతే ఎలా" అని కబుర్లు చెబుతూనే మాగాయ ముక్కల్లో పసుపు, ఉప్పు కలిపి పెద్ద టబ్ లో పడేసింది.

కామెంట్‌లు