"తానా అంతర్జాతీయ కవి సమ్మేళనానికి ఎంపికైన కవయిత్రి శ్రీమతి మంజీత కుమార్"  
 ఉత్తర  అమెరికా తెలుగు సంఘం, తానా ప్రపంచ సాహిత్య వేదిక "ఆజాదీకా అమృత మహోత్సవ్" ఉత్సవాలు పురస్కరించుకుని పలు సామాజిక అంశాలపై  ప్రతిష్ఠాత్మకంగా "అంతర్జాతీయ కవితల పోటీలు" నిర్వహించింది. 
   ఈ పోటీలో హైదరాబాద్ కు చెందిన, ప్రస్తుతం బెంగళూరులో నివసిస్తున్న కవయిత్రి శ్రీమతి మంజీత కుమార్ ఎంపికయ్యారు. ఏప్రిల్ 22, 23, 24 తేదీలలో జూమ్ లో  తానా నిర్వహించబోతున్న ప్రపంచస్థాయి కవితా వేదిక మీద శ్రీమతి మంజీత కుమార్ తమ కవితను వినిపించబోతున్నారు.
   దేశానికి వెన్నుముక అయినటువంటి రైతులను అందరూ గుర్తించి గౌరవించాలని, వారే 'భవిష్యత్ సారథులని' శ్రీమతి మంజీత కుమార్ అక్షరార్చన చేసినటువంటి కవిత ఈ పోటీకి ఎంపికయింది.
  ఇంతటి విశేషమైన కార్యక్రమంలో తనను ఎంపిక చేసి, అంతర్జాతీయ వేదికపై గుర్తింపు తెస్తున్నందుకు
తానా అధ్యక్షులు శ్రీ అంజయ్య చౌదరి లావు గారికి, 
తానా ప్రపంచ సాహిత్య వేదిక సమన్వయకర్త శ్రీ చిగురుమళ్ళ శ్రీనివాస్ గారికి,
ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డాక్టర్ ప్రసాద్ తోటకూర గారికి
శ్రీమతి మంజీత కుమార్ ధన్యవాదాలు తెలియజేశారు. 
  సులువైన చిరు పదాలతో, మనసుకు హత్తుకునేలా కవితలు రాసే శ్రీమతి మంజీత కుమార్ గారు గతంలో రెండుసార్లు తెలుగు బుక్ ఆఫ్ రికార్డులను, వంశీ గ్లోబల్ అవార్డును సొంతం చేసుకున్నారు. హాస్య కవితలు, కథలు రాయడంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఇప్పటికి 200పైగా కవితలు, వంద వరకూ కథలు రాసారు. సాహిత్య కళానిధి బిరుదు, గాథా సృజన సంయమి పురస్కారం, విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ సేవా పురస్కారం, అక్షర క్రాంతి పురస్కారంతోపాటు పలు సాహితీ సంస్థల నుంచి పురస్కారాలు, ప్రశంసా పత్రాలు, సన్మానాలు అందుకున్నారు. ఎన్నో వార్త పత్రికలు, వార మాస పత్రికలలో వీరి రచనలు ప్రచురితం అయ్యాయి. పలు రేడియోలు, యూట్యూబ్ ఛానెల్స్ లో వీరి కథలు, కవితలను చదివి వినిపించారు. 
     శ్రీమతి మంజీత కుమార్ వృత్తి రీత్యా పలు తెలుగు టీవి ఛానెల్స్ లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేసారు. దశాబ్ద కాలంపాటు ఆల్ ఇండియా రేడియోలో అనౌన్సర్, రేడియో జాకీగా చేసారు. ప్రస్తుతం షార్ట్ ఫిల్మ్స్ కి కథలు, మాటలు అందిస్తున్నారు. ఈక్షణం. కామ్ వెబ్సైటులో ఫ్రీలాన్సర్ గా పనిచేస్తున్నారు.

   అనేకమంది దేశ, విదేశ తెలుగు కవులు, ప్రముఖులు హాజరయ్యే ఈ "తానా కవితాలహరి" కార్యక్రమం తానా అధికారిక యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ ఛానల్లో ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది. "యప్ టీవీ" ద్వారా అమెరికాతో  పాటు, యూరప్ దేశాలలో ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది. 

కామెంట్‌లు