ముసలోడి ముచ్చట్లు(ముసలోడి స్వగతం);-గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
ముసలివాడివయ్యావు
మూలనపడియుండు
మంచముగది యెందుకు
ముద్దతిని ముడుచుకోమన్నాడు 
ముద్దుగాపెంచిన కొడుకు

అడ్డంగాయున్నావు
అనాధాశ్రమంలోచేరు
అన్నీయేర్పాటుచేస్తాము
అవస్థలుపెట్టవద్దు
అన్నది కొడుకుపెళ్ళాము

పండుముసలివయ్యావు
పెట్టినపుడు పాచియన్నమైనాతిను
పళ్ళెంలోపెట్టింది కడుపునిండామెక్కు
పనిలేదు రుచులతో నీకనుచు
పలికింది ప్రియమైన పెళ్ళాము

కష్టాలొచ్చాయి
కన్నీరుకారాయి
కొడుకునుకొట్టాలనిపించింది
కోడలును తిట్టాలనిపించింది
కట్టుకున్నదాన్ని తన్నాలనిపించింది

బాధపడకు తాతా
బయటకెళ్ళకు తాతా
కథలుచెప్పు తాతా
సుద్దులునేర్పు తాతా
ముద్దులిస్తాయన్నది మనుమరాలు

పోవొద్దు యెక్కడకు తాతా
పాఠాలు చెప్పు తాతా
పాటలు ఆటలు నేర్పించు తాతా
పరీక్షలలో నెగ్గించు తాతా
బాగాచూచుకుంటానన్నాడు మనుమడు

పలహారాలందిస్తుంటాం
పాలుపండ్లుయిస్తుంటాం
పలకరిస్తుంటాం
బాగోగులు గమనిస్తుంటాం
బయటకెళ్ళొద్దన్నారు ప్రక్కింటివాళ్ళు

స్వాంతన దొరికింది
సంబరమయ్యింది
సర్దుకోవాలనిపించింది
సహనంవహించాలనిపించింది
స్వాభిమానాన్ని వీడాలనిపించింది

పృధ్విని పచ్చదనంతో కప్పుతుంటా
పూలుఫలాలుయిస్తుంటా
పచ్చని కొండాకోనలనుచూపిస్తుంటా
పుడమిని సూర్యచంద్రులతో ప్రకాశింపజేస్తుంటా
ప్రతిరోజు పరవశింపజేస్తుంటాయన్నది ప్రకృతి

అందాలు చూపిస్తుంటాం
ఆనందాలు కలిగిస్తుంటాం
రంగుల్లో వెలిగిపోతుంటాం
పరిమళాలు పైనచల్లుతుంటాం
పరవశింపజేస్తుంటామన్నవి పూలు

అండదండగాయుంటా
ఆలోచనలు పారిస్తుంటా
భావాలు బయటపెట్టిస్తుంటా
కలమును పట్టిస్తుంటా
కాగితాలకెక్కిస్తుంటాయన్నది కవితాకన్యక

కవనం చేయిస్తుంటా
కవితలు వ్రాయిస్తుంటా
కాయాన్ని కాపాడుతుంటా
కాలాన్ని గడుపేస్తుంటా
కలకాలం సాహిత్యలోకంలో 
నిలుపుతాయన్నది మనసు

మనసుమాట వింటా
మంచికైతలు వ్రాస్తా
మదులను తట్టుతుంటా
మోములనవ్విస్తుంటా
మతులను దోచేస్తుంటా


కామెంట్‌లు