సోమయ్య మహా దుడుకు కోపిష్టి! ఎవరితోటీ సరిగ్గా మాట్లాడడు.అందరినీ ఈసడిస్తూ చులకనగా పుల్లవిరిచి పొయ్యి లో పెట్టిన ట్లు మాట్లాడుతాడు.అందుకే అతనితో ఎవరూ మాట్లాడరు.ఆపల్లెలోనే ఉన్న రామయ్య మహామంచిమనిషి! తాను నవ్వుతూ నవ్విస్తూ చిలోపొలో అనే పరోపకారి పాపన్న! ఎవరికి ఏసాయంకావాల్సివచ్చినా వెంటనే అక్కడ వాలుతాడు."ఆసోమయ్య సోంబేరి పొగరుబోతు!అతనితో మాట్లాడకురామయ్యా!" అని అన్నా "ఆ!మనింట్లో అన్న తమ్ముడు అలా పెడసరంగా ఉన్నారు అని ఊరుకుంటామా?ఎవరిపాపం వారిదే" అని నవ్వేస్తాడు.ఎవరినీ చాటుగా నిందించటం చాడీలు చెప్పటం ఇష్టం లేదు అతనికి. కానీ కొందరు చుప్పనాతివాళ్లు కావాలని రామయ్య పైచాడీలు అవాకులు చెవాకులు సోమయ్య దగ్గర పేలితంపులు పెట్టారు.అసలే కోతి కల్లుతాగింది ఆపై తేలుకుట్టింది లాగా సోమయ్య తోకతొక్కిన తాచులా బస్సుఅనసాగాడు.తన పశువులను కావాలని రామయ్య పొలంలోకి తోలేవాడు.రామయ్య పల్లెత్తు మాట అనలేదు. ఆసంఘటననుగూర్చి ఎవరికీ చెప్పలేదు కూడా! రామయ్య పొలంలోకి కాల్వనీరు పోకుండా అడ్డుకట్ట వేసినా కిక్కురుమనలేదు.రామయ్య గడ్డివాముకి నిప్పు పెడితే ఊరంతా వచ్చి క్షణాల్లో ఆర్పేశారు.తనతోటలోని మామిడి పళ్ళు అందరికీ పంచుతూ సోమయ్య కీ పంపితే అందరూ చూస్తూండగా చెత్త కుప్పపై విసిరాడు.
ఒక రోజు సోమయ్య తన ఎద్దులబండీపై సరుకులు వేసుకుని తెస్తుండగా జోరుగా వర్షం కురవటంతో బండీ బురదలో కూరుకుపోయింది.బలహీనంగా ఉన్న ఎద్దులు బండీని లాగలేకపోతున్నాయి.పిసినారి సోమయ్య వాటికి తిండి కూడా సరిగా పెట్టడు.అటువైపు వెళ్ళే బాటసారులు సాయం చేయకుండా తప్పించుకుని పోసాగారు.సోమయ్య అహంకారం పొగరు అణగాలి అని వారి ఉద్దేశం. కానీ విషయంతెలిసిన రామయ్య వెంటనే తన బలంగా ఉన్న ఎడ్లని తీసుకుని వెళ్లి ఆబండీకి ఉన్న ఎద్దుల్ని విప్పి బండీని బురదగుంటలోంచి బైటికి లాగి సోమయ్య ఇంటికి సరుకులు చేరవేశాడు.సొమ్మసిల్లిన తన ఎద్దులతో నెమ్మదిగా సోమయ్య తన ఇంటికి బైలుదేరాడు.అతనిమనసు సిగ్గు పశ్చాత్తాపంతో క్రుంగిపోయింది.మనం అందరితో మంచిగా ఉండాలి. అందుకే అంటారు నోరుమంచిదైతే ఊరు మంచిదవుతుందని🌷

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి