జ్ఞాన సిరుల ఖజానా; -నెల్లుట్ల సునీత-
చరిత్రకు పునాదిగా
నిరంతర సంభాషణగా
భవిష్య స్వప్నాల బీజంలా
కనుపాపల నిండా తన రూపాన్ని చిత్రించు కొని
విశ్వాంతరాలను దర్శంపచేస్తుంది.

చరిత్ర చేసిన గాయల్ని
స్నేహ స్పర్శ హస్తాలను
ఆశల సౌధాల శిధిలాలను
అనంత కోటి భవిష్య స్వప్నాలను
అక్షర హంగులతో
ఆసక్తిని పెంచుతూ
హస్తభూషణమై  తలుకు లీనుతుంది.


అనుభవ సారాలు నింపుకొని
ఆచరణ  జ్ఞానాలు ఒంపుకొని
సంస్కృతులను శాశ్వతంగా నిలిపి
అజ్ఞాన అంధకారాల్ని తరమి
నిశ్శబ్ద జ్ఞాన వృక్షమై
తియ్యని ఫలాలను అందిస్తూ
పరిజ్ఞాన పటిమను పెంచుతూ
వెలుగు రేఖల్ని ప్రసరింప చేసి
దారి దీపమవుతుంది.

ఆలోచనల్ని నింపి
ఆనందం పంచి
 అలవాట్లను మార్చి
  ఆవేదనలో ఓదార్పు నిస్తూ
ఒంటరితనంలో తోడుగా నిలిచి
వికాస జ్ఞాన దీపికగా
సమాజ పోకడలను విప్పి చెప్తూ
జీవితానికి మార్గ నిర్దేశికమై
తరాల మధ్య వారధిగా
అమృత భాండాగారమయ్యింది

అభివ్యక్తికి ప్రతీకగా
భాషలతో భాసిల్లుతూ
రంగుల కల రెక్కలు తొడిగి
అంతరిక్ష యానాలకు శాస్త్ర మై
ఆశయ సాధనలో
చైతన్యం నింపి 
మది గదిలో ఆలోచనల సముద్రాన్ని మధించి
సుజ్ఞాన సుధలను చిలకరిస్తూ
అక్షయ పాత్రగా
మానవత్వాన్ని పంచుతుంది.
జ్ఞాన సిరుల ఖజానాగా
పుస్తక ప్రియుల మదిలో కొలువై ఉంటుంది.

కామెంట్‌లు