నాగయ్య సారూ! నన్ను క్షమించండి!!;-- దోర్బల బాలశేఖరశర్మ

 తెలిసీ తెలియని చిన్నతనంలో మనం చేసే తప్పులు పెద్దయ్యాక తలచుకుంటే ఒక్కోసారి నవ్వు వస్తుంది. మరోసారి ఇంత అజ్ఞానమా? మరీ ఇంత అమాయకత్వమా? అని కూడా అనిపిస్తుంది. నేను ప్రైమరీ స్కూలులో ఒకటో తరగతిలో చేరిన రోజులవి. అదే సంవత్సరమో లేక రెండో తరగతిలో వున్న ఏడాదో (1969 లేదా 1970) సరిగ్గా గుర్తులేదు. కానీ, ఆ సంఘటన మాత్రం నా మనోఫలకంపై చెరగని ముద్ర వేసింది. ఆ సారు (మాస్టారు) విషయంలో నేను చేసిన తప్పుకు బుద్ధి తెలిసిన తర్వాత ఎన్నిసార్లు వారికి సారీ చెప్పుకున్నానో!
ఆ రోజు శ్రావణ మాసంలో రెండో శుక్రవారం. ఆ వేళ వరలక్ష్మీ వ్రతం చాలా ప్రసిద్ధి. రామాయంపేట పట్టణం మిషన్ కాంపౌండ్ కు వెళ్లే దారికి ఎదురుగా గల విశాలమైన పెద్ద ఇంట్లో (ఇప్పుడా ఇల్లు లేదు) ప్రాథమిక పాఠశాల వుండేది. ముందు వరండాలోనే రేకుల షెడ్డును విభజించి తలుపులు ఏవీ లేకుండానే ఓపెన్ గానే రెండు, మూడు తరగతులు నిర్వహించే వారు. ప్రార్థన ముగిసి క్లాస్ ప్రారంభమైందో లేదో క్లాసు టీచర్ నాగయ్య సారు నన్ను పిలిచి, 'ఇవాళ శ్రావణ శుక్రవారం. స్కూలుకు సెలవు ఇవ్వగలరు' అని హెడ్ మాస్టర్ ను వేడుకొంటూ ఒక లెటర్ రాసి హెచ్ఎమ్ కు ఇవ్వమన్నారు. నేను నోటు బుక్కులోంచి ఓ తెల్ల కాగితం చించి, ప్రధాన ఉపాధ్యాయుల వారికి అడ్రస్ చేస్తూ ఉత్తరం రాశాను. కింద 'ఫలాన క్లాసు విద్యార్థులం' అని రాసి, పక్కన నా పేరు రాశాను. మరో పిల్లవాడిని వెంట పెట్టుకొని అన్ని తరగతులూ తిరిగి, దానిపై ఆయా పిల్లల సంతకాలు తీసుకొన్నాను. ఆఖరుకు హెచ్ఎం గదికి వెళ్లి, ప్రధానోపాధ్యాయులకు ఇచ్చి బుద్ధిగా నిలబడ్డాను. అలా చేస్తే ఆయన ఆ రోజు స్కూలుకు సెలవు ప్రకటిస్తారని మాత్రమే నాకు తెలుసు. నేను అదేదో 'గొప్ప పని' అనుకున్నాను. తూచ తప్పక పాటించాను. 
అయితే, అంతా సవ్యంగానే జరిగింది. చివర చిన్న ట్విస్టుతో! 'ఈ లెటర్ ఎవరు రాయమన్నారు?' అని హెడ్ మాస్టర్ ఉన్నట్టుండి ఠక్కున అడిగారు. అటువంటి ప్రశ్న ఒకటి రావచ్చునని నాకు ఎవరూ చెప్పలేదు. వస్తే ఏం సమాధానం చెప్పాలో కూడా నాకు తెలియదు. నేను చాలా బుద్ధిగా, వున్నది ఉన్నట్టు 'నాగయ్య సార్ రాయమన్నారు సార్' అన్నాను. అంతే! స్కూలుకు సెలవు ఇచ్చారో లేదో కూడా నాకు గుర్తు లేదు. కానీ, ఆ వార్త అందరికీ పాకి పోయి నన్నొక వెర్రివాణ్ణి (ఆమాయకుడ్ని) చేసింది. 'సారు పేరు చెప్పేది కాకుండే' అని మనసులో నన్ను నేనే ఎన్నిసార్లు తిట్టుకున్నానో.

కామెంట్‌లు