దీవెన;-కంచనపల్లి వేంకట కృష్ణారావు 9348611445

  గుడిలో గంటలు మోగుతున్నాయి, దూరంగా చెట్లు చల్లటిగాలికి,గుడిలో వినిపించే మంత్రాలకు పారవశ్యంతో తలలు ఊపుతున్నట్లున్నాయి!
        భక్తులు భక్తి పారవశ్యంలో అరమోడ్పు కన్నులతో ఆ భగవంతుని తమ కష్టాలు తీర్చమని ప్రార్థిస్తున్నారు.
       గుడి మెట్లమీద ముష్టి వాళ్ళు ముందర గుడ్డలు పరచి గుడికి వచ్చిన భక్తులను దీనంగా బిక్ష అడుగుతున్నారు.
      భక్తులు తమకు తోచినంత వారికి వేస్తున్నారు.
ఆ రోజు గుడికి శ్రీధర్ వచ్చాడు.శ్రీధర్ అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజనీరు.శ్రీధర్ విద్యావంతుడు, కళల పట్ల మక్కువ గల వాడు! అతనికి పెయింటింగ్స్ అన్నా, గుండెను, మెదడును కదిలించే పుస్తకాలన్నా ఎంతో ప్రేమ.శ్రీధర్ వద్ద బోలెడు పెయింటింగుల సేకరణ,అధ్బుత పుస్తకాల సేకరణ ఉంది.
      శ్రీధర్ గుడిలో ఉన్న శిల్పకళను పరీక్షించి కొన్ని శిల్పాలను ఫోటోలు తీసుకున్నాడు. మూలవిరాట్టును దర్శించాక, గుడి మంటపంలో కొద్ది సేపుకూర్చున్నాడు. ఆ గుడి ప్రశాంత వాతావరణం చూశాక అతని మనసు ఏదో చెప్పలేని ఆనంద డోలికల్లో మునిగింది!
       ఇక లేచి ఇంటికి బయలు దేరాడు గుడి మెట్ల మీద ఉన్న ముష్టి వాళ్ళకి తలా పది రూపాయలు ఇస్తూ ఒక ముష్టివాడి వద్ద టక్కున ఆగి పొయ్యాడు.
ఎందుకంటే ఆ ముష్టివాడు తన ముందు పరచు కొన్నది బట్ట కాదు, ఓ పాత కాన్వాస్,దాని మీద ఎవరో చిత్ర కారుడు చిత్రంచిన ఆయిల్ పెయింటింగ్, ముష్టివాడు ఆ కాన్వాస్ కింద పరుస్తుండటం వలన దాని మీద గీతలు పడ్డాయి ఓ మూల నలిగి పోయింది! దాని మీద పెయింటింగ్ శ్రీధర్ని విపరీతంగా ఆకర్షించింది.
         "ఈ కాన్వాసు బట్ట ఎక్కడిది బాబు?" అడిగాడు శ్రీధర్.
       "అయ్యా, అల్లాడ ఒకరు ఇల్లు ఖాళీ చేస్తూ ఇది పనికి రాదని కుప్పతొట్టిలో వెయ్య బోతుంటే నేను వాళ్ళని ఆపి ఇది తీసుకున్నానయ్యా" అని చెప్పాడు.
       "ఇది నాకు కావాలి, ఊరకే వద్దులే నీకు వంద రూపాయలు ఇస్తాను..." అన్నాడు శ్రీధర్.
        మరి వంద రూపాలంటే ఆ ముష్టి వాడికి కోటి రూపాయలతో సమానం,శ్రీధర్ మాటలు విని వాడు ఆశ్చర్యంతో శ్రీధర్ కళ్ళలోకి చూశాడు.
      "ఇది మీకెందుకు బాబూ?"
      "దీని మీద బొమ్మబాగుంది ఇంట్లో పెట్టుకుంటాను"
       "బాబూ,మరొక వంద ఇప్పించండి మీ పేరు చెప్పుకుని ఓ పది రోజులు కడుపునిండా తింటాను" దీనంగా అడిగాడు వాడు.
      వాడి మాటలు శ్రీధర్ని కదిలించాయి, " రెండు వందలు కాదు మూడొందలు ఇస్తాను తృప్తి గాతిను" అని మూడువందలు ఇచ్చాడు.
      ముష్టివాడి కళ్ళలో కోటి కాంతుల్ని శ్రీధర్ గమనించాడు.
     జాగ్రత్తగా కాన్వాస్ తీసుకుని ఇంటికి వెళ్ళి డ్రాయింగ్ రూములో టేబుల్ గ్లాస్ కింద పెట్టాడు.
      రెండోరోజు శ్రీధర్ స్నేహితుడు వెంకట్ వచ్చి ఆ గ్లాసుకింద ఉన్న పెయింటింగ్ను తదేకంగా చూస్తుండి పోయాడు.
      వెంకట్ రచయిత, ఆర్ట్ క్రిటిక్,ఆర్ట్ మీద ఓ రెండు పుస్తకాలు వ్రాశాడు. అదిగాక అనేక పత్రికలలో ఆర్ట్ ను గురించి వ్యాసాలు వ్రాశాడు.
       "ఈ పెయింటింగ్ ఎక్కడిది?"
       "ఓ ముష్టివాడు గుడి మెట్లమీద దీనిని పరచుకొని అడుక్కుంటుంటే దాని మీద పెయింటింగ్ బాగుందని వాడికి మూడొందలు ఇచ్చి కొన్నాను" చిరు నవ్వుతో చెప్పాడు శ్రీధర్.
      "నీదిరా అదృష్టం, వాడికి ఎక్కడదొరికిందో కానీ, ఇది అప్పట్లో పేరున్న గంగారాం పెయింటింగ్, నా అంచనా ప్రకారం దీని కాస్త శుభ్ర పరచి ఫ్రేమ్ కట్టిస్తే ఆర్ట్ మార్కెట్టులో కనీసం పదివేలు పలుకుతుంది" శ్రీధర్ వైపు ఆనందంగా చూస్తూ చెప్పాడు వెంకట్.
     "అవునా అట్లైతే ఆముష్టి వాడికి మంచి బట్టలు కుట్టించి ఓ ఐదు వేలు ఇస్తాను,ఓ బీదవాడికి సాయం చేసినట్లవుతుంది" 
       " ఆ పని చెయ్యి ఆ దేవుడు సంతోషిస్తాడు" థమ్స్ అప్ తో చెప్పాడు వెంకట్.
       " తప్పకుండా" మనస్ఫూర్తిగా చెప్పాడు శ్రీధర్.
       గోడ మీద ఫోటోలోని వెంకటేశ్వరుడు ఆశీర్వదిస్తున్నట్లు కనబడ్డాడు.
                *********

కామెంట్‌లు