ఆనాటి రోజుల్లో
బ్రతుకు మొక్కా కాదు
చెట్టు అంతకన్నాకాదు
మహావృక్షం.
తన చరిత్ర జ్ఞాపకాలను
పునాదుల తివాచీలుగా పరచి
మొలిచిన తరాల్ని చెట్లుగా
నిలబెట్టే త్యాగగుణం.
తరాల అంతరాల మధ్య
చిన్నబీటలు నెరజలై
స్వార్ధపు బెరళ్లతో
పెరుగుతున్న చెట్లే
ఈనాడు సమాజం నిండా.
వేడి రక్తం ప్రవహిస్తున్న
నరాల కవచపు దేహానికి
అనుక్షణం సౌందర్యపరిరక్షణ.
తరాల అంతరాలను
చెరిపేస్తున్న సౌందర్యసాధనాల
అన్వేషణలో ముడతలు పడ్డ దేహాలు
నర్తిస్తూ చైతన్యపరుస్తూ...
విశ్వసుందరి మకుటపు
ఆత్మయజ్ఞం పూర్తయ్యాక
శ్వాసను వదిలిన దేహపు అందం
కట్టెలవెనుక శాశ్వతనిద్రలో
పిడికెడు బూడిదై
జీవిత పరమార్థపు ఆవిష్కరణకు
సజీవ సాక్ష్యమై....!!!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి