అద్దం తత్వం!;-- యామిజాల జగదీశ్
 ఓ పెద్దాయన. ఆయన తరచూ అద్దంలో చూసుకునేవాడు. అనంతరం ఏదో ఆలోచించేవాడు. 
ఆయన పక్కింట్లో ఓ యువకుడున్నాడు. వాడు కొంటెవాడు. వీడికి ఆ పెద్దాయన ఎందుకలా మాటిమాటికీ అద్దంలోకి చూసుకుంటాడా అని ఓ సందేహం. అద్దంలో ఏమన్నా విచిత్రమైనదుందా? అని ఓ ప్రశ్న.
ఆ అద్దం మాయతో కూడిన అద్దమా? అతనిలో తలెత్తే ఈ ప్రశ్నలను నియంత్రించుకోలేకపోయాడు.
 ఓరోజు ఆ పెద్దాయన వద్దకు వెళ్ళాడు.
"అయ్యా....!"
"ఏమిట్రా?"
"మీ చేతిలో ఉన్నది అద్దమే కదండీ?"
"అవును"
"అందులో ఏముందీ? ఏం కనిపిస్తుంది?" 
"నేను చూసుకుంటే నా ముఖం కనిపిస్తుంది. నువ్వు చూసుకుంటే నీ ముఖం కనిపిస్తుంది"
"అలాగైతే అది మామూలు అద్దమే కదండీ?"
"అవును"
"మరెందుకండీ మీరు తరచూ అద్దంలోకి చూసుకుంటారు?"
పెద్దాయన ఓ నవ్వు నవ్వాడు.
"అది సాధారణమైన అద్దమే. కానీ అది చెప్పే పాఠాలు అన్నీ ఇన్నీ కావు?"
"పాఠాలా! అద్దంలోంచి మనం ఏ పాఠం నేర్చుకోగలం?"
"అలా అడిగావూ....చెప్తా విను. మీలో ఒక్కొక్కరూ ఇతరులకు అద్దంలాంటివారు..."
"నాకేమీ బోధపడలేదు"
"ఒకరు ఇతరుల లోపాలను ఎలా వేలెత్తి చూపాలి? ఎలా సరిదిద్దాలి? వంటివాటిలో స్పష్టత వస్తుంది"
"ఎలాగండీ?"
"మన ముఖాన ఏదన్నా మురికో మరకో ఉంటే అది అద్దంలో చూసుకుంటే కనిపిస్తుంది. ఆ లోపం అద్దం పెంచదు. తగ్గించదు. ఉన్నదానిని ఉన్నమేరకు చూపుతుంది కదా"
"అవునండీ"
"అదేవిధంగా, సోదరుడి దగ్గరో మిత్రుడి దగ్గరో ఏ మేరకు లోపముందో ఆ మేరకే దానిని చూపాలి. అంతేతప్ప దానిని అతిగా ఎక్కువ చేసి చెప్పకూడదు. ఆవగింజను కొండంతో లేక కొండంతను గోరంతో చేయకూడదు. ఇది అద్దం చెప్పే తొలి పాఠం!"
"తర్వాతది?"
"అద్దం ముందర నువ్వు నిల్చున్నప్పుడు నీ లోపాన్ని చూపుతుంది. నువ్వు అద్దం ముందు నుంచి పక్కకు తప్పుకుంటే అద్దం మౌనమైపోతుంది కదా?"
"అవునండీ"
"అలాగే ఇతరుల లోపాలను వారితోనే చెప్పాలి. అంతేతప్ప వారు లేనప్పుడు వీపు వెనకో మాట్లాడకూడదు. ఇది అద్దం చెప్పే రెండో పాఠం!"
“ఆ తర్వాత....?"
“ఒకరి ముఖ మరకను అద్దం చూపడంవల్ల ఆ అద్దంమీద కోప్పడగలమా? మండిపడగలమా?"
“లేదండీ.... బదులు అద్దాన్ని జాగర్తగా కదా పెడతాం" 
"సరిగ్గా చెప్పావు. అలాగే మనలో ఉన్న లోపాలను ఎవరైనా చెప్తే అతనిని కోప్పడక మండిపడక కృతజ్ఞతలు చెప్పాలి. ఆ లోపాలు మనలో ఉంటే సరిదిద్దుకోవాలి. ఇది అద్దం చెప్పే మూడో పాఠం!"
“అయ్యా! చక్కగా చెప్పారు. అద్దం గురించి ఇంతలా చెప్పడం బలే ఉందండీ...." అంటూ ఆ  యువకుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.
అవును....ఇక అద్దం ముందర నిల్చుని ముఖాన్ని చూసుకుంటున్నప్పుడు పెద్దాయన చెప్పిన విషయాలను గుర్తుకు తెచ్చుకోవాలి. ఇవి మన మనసుని అలంకరిస్తాయి. శుభ్రంగా ఉంచుతాయి!!
(- తమిళంలో చదివిన విషయం -)


కామెంట్‌లు