ఊపిరి రాగం;-డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.
 కలల ఆస్తులను కుప్పగ పోగేసుకొని నిప్పురవ్వతో
దోస్తీ కట్టాడు...
పచ్చని ప్రకృతితో కాదు
అతనికి స్నేహమయింది
పొగల మేఘాలతో...
నిషా నిండిన కళ్ల దాహానికి 
పెదవుల ప్రయాస తోడయ్యాక...
పొరపాటుగా అంటుకున్న అలవాటు పాతికేళ్ల 
బ్రహ్మచారి నిష్టను భగ్నం చేసింది...
రుచించిన రుచిని బాగా మరిగాక 
వ్యవస్థల పనితీరు మెల్లగా
వికటించడం ప్రారంభించింది...
వయసు వసంతమంతా
వడలిపోయాక ఇప్పుడు బాధ్యత మరిచిన బాటసారికి
బెంగపుట్టుకొచ్చింది...
ప్రాణాలను పళంగా పెట్టి
ప్రాయశ్చిత్తం అడిగేసరికి ఆలస్యం చివరి క్షణాలకు చేరుకుంది...
గుండె గదుల్లో గుప్పున
చీకటి కమ్ముకుంది...
ఆఖరి ప్రయత్నంగా ఆక్సిజన్ ని అందించినా
ఊపిరి రాగాన్ని అందుకోలేక పోయింది....
చేతులలో బూడిద చారలు,
చొక్కాలో సగం కాల్చిన సిగరెట్ ముక్క,
టేబుల్ పై యాష్ ట్రే మాత్రమే అతని జ్ఞాపకాలుగా మిగిలిపోయాయి....
మరొక స్నేహాన్ని అన్వేషిస్తూ
అర్ధాంతరంగా ఒక జీవితం ముగిశాక...కామెంట్‌లు