సాంగత్యం;-ఎం బిందుమాధవి
 కిషోర్ సర్ క్లాసంటే పిల్లలందరికీ ఇష్టం.
కధలు, కబుర్లు, పాటలు కలిపి పాఠం తేలికగా అర్ధమయ్యేట్టు చెప్పటం కిషోర్ ప్రత్యేకత.
ఆ రోజు పాఠం అయ్యాక ఏడో క్లాస్ పిల్లలకి డిక్టేషన్ ఇస్తున్నారు.
"ముష్టి యుద్ధము"
"అభిజ్ఞానము"
"కర్ణామృతము"
వెనక బెంచిలో గుస గుసలు..."ఒరేయ్ ముష్టి లో 'ట ' రాయాలా...'ఠ ' రాయాలా అన్నాడు వెంకట్, మురళితో. 'ర ' కింద 'న ' వత్తు రాయాలా..'ణ ' రాయాలా అని రాకేష్ విజయ్ ని అడుగుతూ అతని చొక్కా లాగుతున్నాడు.
ఇచ్చిన పదాలు గబ గబా రాసేసి "ఒరేయ్ వేణు గాడు కొత్త వాళ్ళతో తిరుగుతున్నాడురా. ఈ మధ్య మనతో ఆడటానికి కూడా ఎక్కువ రావట్లేదు..నువ్వు గమనించావా" అన్నాడు
నగేష్ గుస గుసగా ప్రవీణ్ తో!
"ఎవరా మాట్లాడుతున్నది ...పక్క వాళ్ళని అడక్కుండా మీకొచ్చినట్టు రాయండి. అప్పుడే కదా మీకు ఏ పదం ఎందుకు తెలియదో....నాకు తెలిసేది!"
"తప్పు రాసినా ఫరవాలేదు. సిగ్గు పడాల్సిందేం లేదు. అయినా తప్పు రాసే పిల్లల పుస్తకాలు టీచర్ శ్రద్ధగా చూస్తారు...ఎప్పుడూ అన్నీ రైటే రాసే వాళ్ళ కంటే!" అని ఒక చమక్కు చేశాడు.
కాసేపు గుస గుసలు ఆగాయి కానీ...సైగలు మొదలయ్యాయి.
కిషోర్ వెళ్ళి "ఏంటి నగేష్..ఏమన్నా చెప్పాలనుకుంటున్నావా" అనడిగాడు.
"సరే ఇటు రా" అని తన సీట్ దగ్గరకి వెళ్ళారు కిషోర్ సర్.
ఇంతలో ఆ పీరియడ్ టైం అయిపోయినట్లు బెల్ మోగింది. అదే ఆఖరి పీరియడ్ అవటంతో "నగేష్....ఇప్పుడు చెప్పు. ఏం జరిగింది. ఏమైనా ముఖ్యమైన విషయమా" అన్నాడు స్నేహ పూర్వకంగా భుజం మీద చెయ్యి వేసి నిమురుతూ...భయం లేదన్నట్టుగా.
"ఈ మధ్య వేణు మాతో ఆడుకోవటానికి గ్రౌండ్ కి రావట్లేదు. మొన్న మార్కెట్లో ఎవరో కొత్త వారితో కనిపించాడు. వాళ్ళు మా కంటే వయసులో పెద్ద వాళ్ళ లాగా కనిపించారు" అన్నాడు.
"నేను కనుక్కుంటాలే, నువ్వెళ్ళు" అన్నాడు కిషోర్.
@@@@
సాయంత్రం కూరలు కొనటానికి మార్కెట్ కి వెళ్ళిన కిషోర్ కి 'వెతకబోయిన తీగ కాలికి తగిలింది'. వేణు ఓ మూలగా ఎవరి కోసమో వేచి చూస్తున్నట్టు నుంచున్నాడు. మధ్య మధ్యలో తననెవరూ గమనించట్లేదు కదా అన్నట్టు..అటు ఇటూ దొంగ చూపులు చూస్తున్నాడు.
కిషోర్.. వేణు భుజం మీద చెయ్యేసి "వేణు ఎవరి కొరకైనా ఎదురు చూస్తున్నావా? కూరల సంచి బరువుగా ఉంది. ఇంటి దాకా కాస్త సాయం వస్తావా" అన్నాడు.
సర్ ఇక్కడే కాసేపుంటే, తనని కలవటానికి వచ్చేవారిని చూస్తారని "సరే సర్" అని చేతిలో బ్యాగ్ అందుకుని ముందుకు నడిచాడు.
ఇంటి దగ్గరకొచ్చాక "వేణు..రేపు శనివారం. అలా గుడి దగ్గరకెళ్ళి కొబ్బరికాయలు తెద్దాం..రా" అన్నాడు కిషోర్.
"ఇదేంటి...సర్ ఈ రోజు ఇలా నన్ను ఒక చోటి నించి మరొక చోటికి తిప్పుతున్నారు? నేను వేరే కొత్త వాళ్ళతో తిరుగుతున్నానని తెలియలేదు కదా" అని మనసులో అనుకుంటూ "మార్కెట్లో నన్ను కలవటానికి వచ్చిన వారికి నేనక్కడ లేకపోతే...రేపు ఏమన్నా అంటారేమో! డబ్బులు సంపాదించటానికి రాక రాక వచ్చిన అవకాశం. అక్క పురిటి టైం కి పది వేలు ఇస్తామన్నారు...అంత డబ్బు ఇంకెలా సంపాదించగలను" అనుకున్నాడు.
వేణు మనసులో జరుగుతున్న అంతర్మధనం గమనించిన కిషోర్ "వేణు మా ఇంటికెళ్ళి కాసేపు మాట్లాడుకుందామా" అన్నాడు.
"పద్మా...ఇతను వేణు. నా స్టూడెంట్. ఈ రోజు మనింట్లోనే భోజనం చేస్తాడు. అతనికి కూడా వంట చెయ్యి" అన్నాడు.
భోజనం చేశాక మేడ మీదికి తీసుకెళ్ళి ....ఉపోద్ఘాతంగా "నీ కొత్త స్నేహాల గురించి నిన్నే తెలిసింది. స్నేహం చెయ్యటం తప్పు కాదు. సాధారణం గా మన ఇంటి పక్క వాళ్ళొ, స్కూల్లో పిల్లలో, బంధువుల పిల్లలో ఇంట్లో వాళ్ళకి కూడా వాళ్ళు తెలిసుంటారు కాబట్టి ఏ అభ్యంతరం ఉండదు. వారిని నువ్వు ఇంటి దగ్గరే కలవచ్చు. కానీ ఇప్పుడు నువ్వు మార్కెట్లో ఒంటరిగా కలవటానికి వెళ్ళావు అంటే..అందరికీ వారెవరో తెలియటం మంచిది కాదని...అంతేనా?"
"నీది చిన్నతనం. ఇంకా మాయామర్మాలు తెలిసిన వయసు కాదు. బయట చాలా విషయాలు ఆకర్షణగా కనిపించే వయసు. ఇంతకీ ఎవరు వాళ్ళు? ఎందుకు వాళ్ళని కలవాలనుకుంటున్నావ్?" అన్నాడు.
"నాకు వాళ్ళెవరో తెలియదు సర్. వారం క్రితం నేను స్కూల్ నించి వెళుతుంటే నన్ను ఆపి 'నీ షూ చిరిగి ఉన్నాయి. కొత్తవి కొనుక్కోవా? మీ ఫ్రెండ్స్ అందరూ కొత్త యూనిఫార్మ్, కొత్త షూస్ వేసుకుంటే..వాళ్ళ ముందు నీవి చిరిగి ఉంటే నిన్ను వాళ్ళు ఏడిపించరా?' అనడిగారు.
"మా నాన్న దగ్గర అన్ని డబ్బులుండవ్. మా అక్క పురిటికొచ్చింది. 'ఈ నాలుగు నెలలు ఖర్చులెక్కువ ఉంటాయి. కాబట్టి నీకు కొత్త షూస్ హాఫ్ ఇయర్లీ పరీక్షలయ్యాక కొంటాను ' అన్నారు మా నాన్న అని చెప్పాను".
'నువ్వు కూడా డబ్బు సంపాదించచ్చు. మీ నాన్నకి సహాయంగా ఉండచ్చు ' అని నన్ను ఈ రోజు మార్కెట్లో కలవమన్నారు" అని చెప్పాడు వేణు తలొంచుకుని.
"అలా ముక్కూ మొహం తెలియని వాళ్ళు ఏది చెబితే అది నమ్మకూడదు. అయినా నీకే ఎందుకు డబ్బివ్వాలనుకుంటున్నారు అని ఒక్క సారి ఆలోచించావా? అమాయకంగా కనిపించే స్కూల్ పిల్లలని ఆకర్షించి వాళ్ళ చేత సంఘ వ్యతిరేక పనులు..అంటే డ్రగ్స్, మారణాయుధాలు ఒక చోటి నించి మరొక చోటికి చేర వెయ్యటం, ఉత్తరాలు అందించటం..లాంటివన్నమాట....చేయిస్తూ ఉండే ముఠాలు అవి. ఆ పనులకి డబ్బు ఎర వేసి..చిన్న పిల్లలని ఆకర్షించి...తరువాత అనుమానమొస్తే ఆ పిల్లలని చంపేస్తారు" అని ఆగాడు...వేణు మొహంలోకి చూస్తూ!
"అమ్మో...నాకివన్నీ తెలియవు సర్" అని ఏడుస్తూ కిషోర్ ని చుట్టుకుపోయాడు.
@@@@
ఆ రోజు క్లాసుకి వెళ్ళిన కిషోర్ కి నవ్వు మొహాలతో పిల్లలంతా స్వాగతం పలికారు. వారి మొహాల్లో పెద్ద ఉపశమనం గమనించిన కిషోర్ "ఏమిటి పిల్లలూ ఇవ్వాళ్ళ మంచి హుషారుగా ఉన్నట్టున్నారు! ఏమిటి విశేషం" అన్నాడు ఏమీ తెలియనట్టు.
"వేణు మళ్ళీ మాతో సరదాగా ఆడుకోవటానికి వస్తున్నాడు. నిన్న గ్రౌండులో అందరం క్రికెట్ ఆడాం. వేణు 90 రన్స్ కొట్టాడు" అన్నాడు నగేష్ ఉత్సాహంగా.
"ఇవ్వాళ్ళ మీకొక కధ చెబుతాను. ఇంతకీ మీకు రామాయణంలో విభీషణుడు, మంధర తెలుసా" అన్నాడు.
కొందరు తెలుసని, కొందరు తెలియదని గోల గోలగా సమాధానం చెప్పారు.
"సరే నేనే చెబుతాను. విభీషణుడు రావణాసురుడికి తమ్ముడు. చాలా మంచివాడు. ఎవ్వరికీ హాని తలపెట్టడు. దైవ భక్తి కలవాడు."
"రావణుడి సభలో లంకా దహనం చేసిన హనుమతుడిని చంపెయ్యాలని అందరూ అంటే...ఒక్క విభీషణుడు మాత్రం దూతగా వచ్చిన వాడిని చంపకూడదు. శిక్షించి వదిలేద్దామని చెప్పాడు."
"లంక మీద దాడి చెయ్యటానికి సముద్రం ఆవలి ఒడ్డున ఉన్న రామ లక్షణుల దగ్గరకి వెళ్ళి 'నేను మీ శరణు కోరి వచ్చాను. రావణాసురుడి సోదరుణ్ణి. నన్ను శత్రువుగా భావించద్దు. నాకు మా అన్నగారంటే చాలా గౌరవం! కానీ మా అన్నగారు సీతని మీకప్పగించమని నేను మంచిమాటలు ఎంత చెప్పినా వినట్లేదు. కాబట్టి ఆయన్ని వదిలేసి మీ వద్దకి వచ్చేశాను' అని శ్రీరామచంద్రునితో స్నేహం చేశాడు."
"చెడు సాంగత్యం చేసిన రావణాసురుడు అంత బలవంతుడై ఉండీ...అంత తపస్సంపన్నుడై ఉండీ యుద్ధంలో మరణించాడు. యుద్ధం అంతా అయిపోయాక శ్రీరామచంద్రుడు లంకా రాజ్యానికి విభీషణుడిని రాజుగా పట్టాభిషేకం చేశాడు."
"అలాగే మంధరతో స్నేహం చేసి, ఆమె చెప్పినట్టల్లా నడిచి రాముడిని అడవికి పంపించి, తన కొడుకుభరతుడికి పట్టాభిషేకం చెయ్యమని వరం కోరిన కైకేయి ముందు తన భర్త దశరధుడిని పోగొట్టుకుంది. తరువాత భరతుడు వచ్చి తండ్రి మరణానికి కారణమై, అన్నగారిని అడవికి పంపించిన పాపాత్మురాలివి..'నీ మొహం చూడను' అని ఆమెని నిందించి వెళ్ళిపోయాడు."
"మనం ఈ కధల నించి నేర్చుకునే నీతి ఏంటంటే...అప్పటికప్పుడు ఆకర్షణగా కనిపించినా కొన్ని స్నేహాలు, కొంత మందితో సాంగత్యం మన పతనానికి దారి తీస్తాయి. స్నేహం ఎవరితో చెయ్యాలి అనేది మన నిర్ణయమే! ప్రతిఫలం ఆశించి ఎవరితోను స్నేహం చెయ్యకూడదు అని" అవునా.. అని వేణు వంక సాలోచనగా చూశాడు.
పరోక్షంగా సర్ చెప్పిన కధ తన నుద్దేశించేనని అర్ధమైన వేణు, తనెంత ప్రమాదంలో చిక్కుకునేవాడో..సర్ తనని ఎలా రక్షించారో తలచుకుని మనసులో ఆయనకి నమస్కరించాడు.


కామెంట్‌లు