ప్రతీకారం!అచ్యుతుని రాజ్యశ్రీ

 అదొక సత్రం. వచ్చేపోయే బాటసారులు అక్కడ భోజనం చేసి కాసేపు విశ్రమించి వెళ్ళేవారు.కొందరు రాత్రి పూట కూడా బసచేసేవారు.ఆసత్రం లోకి ఓమేక వచ్చి అక్కడ ఉన్న వంట వారు తరిగిపడేసిన కూరలు పనికిరాని ఆకుకూరలు  శుభ్రంగా తిని  చెత్త ఎత్తిపారబోసే పనిలేకుండా చేసేది. పైగా కాస్తోకూస్తో  పాలుఇవ్వటంతో అక్కడ ఉన్న వంటవాడు దాన్ని ప్రేమగా చూసేవాడు.ఎవరికీ అపకారం చేయకుండా  ఒద్దికగా ఆమేక బైట చెట్టు కింద పడుకునేది.కొన్నాళ్ళకి అది రెండు బుల్లి పిల్లల కి జన్మ ఇచ్చింది.ఆబుజ్జి మేకపిల్లలు తెల్లగా ముద్దుగా ఉండటంతో సత్రంలో దిగే బాటసారులు వాటిని కాసేపు ఎత్తుకుని ముద్దాడేవారు.సత్రం కి ఎదురుగా ఓపెద్ద చెట్టు పై ఓతల్లి కోతి తన రెండు కోతిపిల్లలతో మకాం వేసింది.మేక దాని పిల్లలు రోజూ వంటింటిలోకెళ్లి అక్కడ పడేసిన ఆకుఅలములు కూరతొక్కలు తినటం చూసి కోతిపిల్లలుకూడా సత్రం లోకి చొరబడాలని ప్రయత్నిస్తున్నాయి.కానీ కోతుల్ని చూడగానే  ఠక్కున  సత్రం తలుపులు మూయటం కర్రపుచ్చుకుని తమను తోలే ప్రయత్నం చేసే వంట వాడు యాత్రికులు అంటే కోపం కసి పెంచుకున్నాయి కోతిపిల్లలు.తల్లి కోతి ఒక సారి  తన పిల్లలకోసం అని ధైర్యం తెగువతో వంటింటిలోచొరబడి మేకలు ఉన్న సమయంలో కొన్ని కూరగాయలు నోరు చేతిలో పట్టుకుని వంట వాడు  తరిమేలోపల తప్పించుకుని తన చెట్టు ని చేరుకుంది. ఇదిచూసి కోతిపిల్లలకు ఉషారు ఎక్కువై తల్లితోపాటు వంటింటిలో దూరాయి.మేకవాటిని చూస్తూ నే పెద్దగా మే..మే .అని అరవసాగింది.మేకపిల్లలు బైట చెట్టు కింద ఉన్నాయి.ఏమిటి మేక అరుస్తోంది  అనివంటవాడు పరుగెత్తివచ్చాడు. కోతిపిల్లలు  పప్పు డబ్బాలో  చేతులు పెట్టి  ఎంచక్కా నోట్లో పోసుకుని కటకట నోరు ఆడిస్తున్నాయి.కర్రని విసిరాడు వంట వాడు. ఓకోతిపిల్ల కాలికి తగిలి అరుస్తూ  అక్కడే కూలబడింది.రెండోది తప్పించుకుని పారిపోయింది.ఆఏడుస్తున్న కోతిపిల్లను వంటవాడు  పట్టి  మెడకి తాడుకట్టి గుంజకి కట్టేశాడు.ఆమరునాడు కోతుల్ని ఆడించేవాడు వచ్చి  ఆకోతిపిల్లను కాస్తా పట్టుకుని పోయాడు. తల్లి కోతి ఏడుస్తూ  తన దగ్గర ఉన్న పిల్లతో అంది"మనల్ని చూసి మనుషులు భయపడ్తారు.అందుకే  ఎవరూ మనల్ని పెంచుకోరు.ఆకోతుల్ని ఆడించేవాడు  నీఅన్నకి దెబ్బలు కొట్టి కొన్ని ఫీట్స్ చేయించి ఊరూరా తిప్పుతూ  తన పొట్ట పోసుకుంటాడు.అందుకే మనకు అనువుగాని పనులు చేయకూడదు. ఇక్కడ ఉంటే నీవు కూడా చపలచిత్తంతో వంటింట్లో దూరి దెబ్బలు తింటావు.నాకు దూరం అవుతావు"అని నచ్చజెప్పి అడవిలోకి పిల్లను తీసుకుని వెళ్లి పోయింది. 🌹
కామెంట్‌లు