నాట్యయజ్ఞం-శృంగవరపు రచన
 సాహిత్యానికి, అనుభూతులకు, అనుభవాలకు మధ్య అంతర్లీన సంబంధం ఉంది.రచనలో పాఠకుడిని కొత్త లోకంలోకి తీసుకువెళ్ళగల శక్తితో పాటు కొత్త అభిరుచుల్లో, ఆసక్తుల్లో అనుభవాలను దర్శిస్తూ వాటిని పరోక్షంగా ఆస్వాదింపచేయగల శక్తి కూడా ఉంది.ఏ రచన చేసినా కథలోకి సూటిగా వెళ్ళిపోతూ, అనుభూతుల ప్రపంచాన్ని మాత్రం ఓ కళాకారుడిలా మారిపోయి చిత్రించే రచయిత సింహాప్రసాద్ గారు. ఆయన రచనల్లో సామాజిక సమస్యల మూలాలు ఓ కోణమైతే, స్త్రీ జీవితాన్ని చిత్రించే కోణం ఇంకొకటి.ఓ కళాకారిణి జీవితం కేంద్రంగా, తల్లి-కొడుకుల అనుబంధ ఇతివృత్తంతో సింహాప్రసాద్ గారు రాసిన నవలే 'అభివందనం.'
   ఈ నవలలో ముఖ్య పాత్ర కుముదవల్లి. ఆమె కొడుకు అభిరామ్, అభిరామ్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు. అతను అందగాడు. కానీ ఎప్పుడు నిస్పృహతో నిరాసక్తంగా ఉంటాడు. అతన్ని అతని జూనియర్ ఆర్నవి ప్రేమిస్తుంది.కాలేజీకి కల్చరల్ సెక్రటరీ అయిన ఆర్నవి ఓ నాటకప్రదర్శనలో నాయకుడి వేషాన్ని ఎలా అయినా అభిరామ్ చేత వేయించాలని పట్టుబట్టి అతన్ని అడిగినా అతను తిరస్కరిస్తాడు. అయినా వదలక అతని ఇంటికి వెళ్ళబోతే అక్కడ సెక్యూరిటీ గార్డ్ అడ్డగిస్తాడు. తర్వాతి రోజు బలవంతంగా అభిరామ్ తో కలిసి అతని ఇంటికి వస్తుంది. గార్డెన్ లో కూర్చున్న కుముదవల్లి ఆర్నవిని ఆప్యాయంగా కౌగలించుకుంటుంది.ఎప్పుడు అభావంగా ఉండే తల్లి ఆర్నవి రాకతో అలా మారిపోవడం అభిరామ్ ను ఆశ్చర్యపరుస్తుంది.దేనికి స్పందించని తల్లిలో ఆ మాత్రం మార్పే ఆ కొడుకుకి సంతోషాన్ని కలిగిస్తుంది. ఆ మార్పుకు కారణమైన ఆర్నవి కోరిక మన్నించి ఆ నాట్య ప్రదర్శనకు ఒప్పుకుంటాడు. నాట్యకేంద్రంగా ఉన్న ఈ నాటకంలో అభిరామ్ తక్కువ రోజుల్లోనే చక్కగా చేయగలుగుతాడు. ఇంట్లో దానిని ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో కుముదవల్లి స్పందించడం బట్టి ఆమె ఒకప్పుడు కళాకారిణి అయ్యి ఉంటుందని అతనికి అనిపిస్తుంది. ఆ ఇంట్లో అతనికి అమ్మమ్మగా చలామణి అవుతున్న రంగమ్మ అతని అమ్మమ్మ కాదని అతని తండ్రి తల్లిపై నిఘా కోసం పెట్టిన వ్యక్తి అని అభిరామ్ కు అర్ధమవుతుంది. అభిరామ్ నాట్యప్రదర్శనకు కుముదవల్లి కూడా వస్తుంది.
     తల్లిలో వస్తున్న మార్పులు గమనించి స్థలమార్పు ఆమెలో ఇంకా మార్పు తీసుకురావచ్చని భావించి విజయవాడ కనకదుర్గ అమ్మవారి దగ్గరకు ఆమెను తీసుకువెళ్తాడు. అక్కడ నుండి కూచిపూడి కి తీసుకువెళ్తాడు. అక్కడ తల్లి నాట్యం చేయడం అభిరామ్ కు సంతోషాన్ని కలిగిస్తుంది. అక్కడికి దగ్గరలో ఉన్న తన నాట్యగురువు దగ్గరకు కొడుకును తీసుకువెళ్ళి తాను సాధించలేని ఉన్నతి కొడుకు నాట్యంలో సాధించేలా చేయమని గురువును అడిగి ఆయన చేత అభిరామ్ కు పాదపూజ చేయిస్తుంది.
     నాటి నుండి తల్లి కోరికే తన జీవిత లక్ష్యంగా భావిస్తాడు అభిరామ్. ఆ సమయంలోనే తల్లి అతనికి గతంలో జరిగింది చెప్తుంది. గొప్ప కళాకారిణిగా కుముదవల్లి ఉన్న సమయంలో ఆమెకు అమెరికాలో నాట్యప్రదర్శన ఇచ్చే అవకాశం ఇప్పించే నెపంతో ఆమెను వివాహం చేసుకున్న రాజకీయ నాయకుడు చిన్నకేశవులు ఆమెను వివాహం తర్వాత నృత్యం నుండి దూరం చేస్తాడు. ఆ సమయంలో కుముదవల్లి తల్లి ప్రాణాపాయ స్థితిలో ఉంటే ఆమె ప్రాణాలు తాను కాపాడాలంటే నృత్యాన్ని వదిలేసుకోవాలని చెప్తాడు. ఆమె వదులుకున్న తల్లి మరణిస్తుంది.
     తన కుటుంబంలో అందరూ అందంగా లేని వారే అని ఆమె ద్వారా తనకోసం కూతురు కావాలని, కొడుకు అయితే ఆస్తుల గొడవలు వస్తాయని చెప్తాడు. కుముదవల్లి గర్భవతి అవుతుంది. అభిరామ్ పుడతాడు. వదిలేయమని చెప్పినా పట్టుబట్టి పెంచుకుంటుంది.
    ఆ రోజు నుండి కుముదవల్లి గృహ నిర్భంధంలో బందీ అవుతుంది. ఆమెను చూడటానికి ఎవరూ రాకూడదు. ఆమె ఎవర్ని చూడకూడదు. ఆమె మీద నిఘా కోసం రంగమ్మ. తన కొడుకు క్షేమం కోసం తనలో జీవాన్ని చంపేసుకుని అన్నాళ్ళు బ్రతికింది కుముదవల్లి.
    కొడుకు ఇచ్చిన ధైర్యంతో ఆమె మామూలు మనిషి అయ్యింది. అభిరామ్ కు సాఫ్ట్ వేర్ ఉద్యోగం వచ్చినా దానిని వదిలి పెట్టి నృత్యం మీదే దృష్టి సారించాడు. ఆ విషయంలో అతను నిర్ణయం మార్చుకోకపోవడంతో ఆర్నవి వివాహం ఓ అమెరికన్ డాక్టర్ అరవింద్ తో జరిగిపోయింది.
     అభిరామ్ నాట్యకళాశాలలో చేరి ఇంట్లో తల్లి ఇచ్చే కూచిపూడి శిక్షణతో పాటు భరతనాట్యం కూడా నేర్చుకుంటున్నాడు. అక్కడ గురువు గారి కూతురు సంతోషి అతనితో జట్టుగా అద్భుతంగా చేసేది. అప్పటికే సంప్రదాయ పధ్ధతిని వదిలి ఫ్యూజన్ ప్రయోగాలు క్లాసికల్ నృత్యంలో కూడా ప్రవేశించడం వల్ల కుముదవల్లి చేత స్త్రీశక్తి పేరుతో గొప్ప నృత్య నాటకాన్ని తయారు చేయిస్తాడు అభిరామ్. అది అమెరికాలో ప్రదర్శించడానికి ఎన్నికవుతుంది.కానీ నాట్యం జరిగే సమయానికి సంతోషి కాలు దెబ్బ తినడంతో ఆమె డ్యాన్స్ చేయలేని పరిస్థితుల్లో ఉంటుంది.
    అభిరామ్ తానే స్త్రీ పాత్రగా నర్తించడం అభ్యాసం చేస్తాడు. దానికి తగ్గట్టు ఆ మార్పులు తల్లి చేత చేయిస్తాడు. అమెరికాలో ఆ ప్రదర్శనలో కుముదవల్లి కూడా ఆ నాట్య ఆవేశంతో చేయడంతో దానికి స్థాండింగ్ ఓయేషన్ రావడంతో నవల ముగుస్తుంది.
     ఈ నవలలో స్త్రీ అంతరంగాన్ని అధిక వర్ణనలు లేకుండా, ఆమె మనసులోని వ్యధను, కళాహీనంగా ఉండటం కళాకారుల జీవితానికి ఎంత పెద్ద శాపమో,మాతృత్వం గొప్పతనం, కొడుకుగా అభిరామ్ పాత్ర వంటివి పాఠకులను ఆ పాత్రల అనుభూతుల గురించి ఆలోచించేలా చేస్తాయి. సినిమాల్లో లానే రచనల్లో దీన్ని ఫీల్ గుడ్ నవల అని అనుకోవచ్చు.
     *     *    *

కామెంట్‌లు