సోడా, గోలీసోడా!!;- యామిజాల జగదీశ్
 అవును సోడా తాగాను. సోడా అందులోనూ గోలీసోడా....ఎంతానందం వేసిందో చెప్పలేను. గోలీసోడాతో ఆనందమే అంటే ఆనందమే మరి...
గోలీ సోడా చివరగా ఎప్పుడు తాగానో తెలీదు కానీ కొన్ని సంవత్సరాల క్రితం మద్రాసులో తాగినట్టు గుర్తు. అయితే ఆ తర్వాత ఇప్పుడు తాజాగా అంటే రెండ్రోజుల క్రితం తాగాను... శ్రీనివాస్ కూల్ డ్రింక్స్ షాపులో. ఇదెక్కడుందంటే విజయవాడలోని సత్యనారాయణపురంలో హనుమాన్ వీధి దగ్గర ఓ చిన్నషాపులో. 
మోపిదేవి, ద్వారకా తిరుమల, మధురాపురం తదితర ప్రాంతాలలో ప్రముఖ ఆలయ సందర్శన కోసం వెళ్ళాం. అయితే విజయవాడలో లగ్గేజీ అంతా పడేసి మెన్న రాత్రి గోలీసోడా తాగాలనిపించింది నాకూ, మా అబ్బాయికీ. సరేనని ఎక్కడ దొరకొచ్చోనని పవని చెప్పగా సత్యనారాయణపురంలో గాలిస్తుండగా శ్రీనివాస్ కూల్ డ్రింక్సులో బల్లమీదా కనిపించాయి గోలీసోడాలు నీలం, పచ్చరంగు సీసాలలో. వాటిని చూడటంతోనే నాకూ మా అబ్బాయికి కలిగిన ఆనందం ఇంతా అంతా కాదు. గ్లాసులో పోసిస్తానంటే వద్దని సీసాతోనే తాగాలనుందని చెప్పాం. గోలీ కొట్టి ఇచ్చాడు దుకాణదారు. పది రూపాయలు. రెండేసి తాగం ఇద్దరమూ. 
అది తాగుతుంటే చిన్నప్పటి రోజులు గుర్తుకొచ్చాయి. ఆరోజుల్లో మద్రాసులో మామూలు ఘాటు సోడా అయితే పది పైసలో పదిహేను పైసలో  ఉండేది. కలర్ సోడా అయితే ఓ అయిదు పైసలెక్కువ. అసలా షాపతను గోలీ కొట్టేటప్పుడు వచ్చే శబ్దమే వేరు. బలే ఉండేది. చిన్నప్పుడు ఆ సౌండే విచిత్రంగా ఉండేది. పైగా తాగుతున్నప్పుడు లోపలున్న గోలీ గొంతులో పడిపోతుందేమోనని భయం భయంగా తాగుతుంటే సీసా ఎలా పట్టుకు తాగాలో చెప్పేవాడు దుకాణదారు. నాకు పన్నీర్ సోడా బాగా ఇష్టం ఉండేది. చిల్లర పైసలు మిగిలితే టీ.నగర్లోని పాండిబజారులో కానీ న్యూబజారులోకానీ తాగేవాడిని. ఒక్కొక్కప్పుడు షాప్ పక్కనే ఓ పెద్ద తొట్టలో నీళ్ళు పోసి వాటిలో ఈ గోలీసోడాలో ఉంచేవారు. మనం అడిగితే ఓగ్లాసులో ఐస్ ముక్కలు కొట్టి వేసాక గోలీ కొట్టి పోసిచ్చేవాడు ఉప్పు ఓ స్పూనుతో కలిపి. గ్లాసులో పోస్తున్నప్పుడు వచ్చే బుడగలను చూసినా ఆశ్చర్యమే అప్పట్లో....
ఇంతకీ ఈ సోడా మొట్టమొదటగా పుట్టింది జర్మనీలోనని ఆ మధ్య ఓ చోట చదివాను. ఆ రచయిత పేరు గుర్తు పెట్టుకోకపోవడం తప్పే. జర్మనీ తర్వాత లండన్లో పెరిగిన గోలీసోడా ఆ తర్వాత ఓ డెబ్బై ఎనబై ఏళ్ళ క్రితం మన భారతదేశంలోకి ప్రవేశపెట్టింది. మొత్తంమీద చూస్తే గోలీసోడాకు నూట ఇరవై ఏళ్ళుపైబడిన చరిత్రే ఉంది. మొదట్లో ఓ కాణీ ఉండేది. క్రమంగా ధర పెరిగి పెరిగి ఇప్పుడు పది రూపాయలకు చేరిందన్న మాట. 
పొట్ట ఎప్పుడైనా ఉబ్బరంగా ఉంటే సోడా కోసం షాపుకెళ్తే కిన్లే సోడా ఇచ్చేవాడు. అది ఓ వాటర్ బాటిల్ (ప్లాస్టిక్) లాంటిది. అప్పుడప్పుడూ నేనూ మా ఆవిడా ఎఎస్ రావ్ నగర్లో ఓ చిన్నపాటి షాపులో చల్లటి స్వీట్ సోడా కానీ ఆరంజ్ సోడా కానీ తాగేవాళ్ళం, పది రూపాయలకు! చాలా బాగుండేది. అది గోలీసోడా కాదు. ఓ  కూలింగ్ యంత్రం ద్వారా ఓ గ్లాసులో ఇచ్చేవాడు. ఎప్పుడైనా ఓమారు సుగంధి సోడా తాగేవాడిని.
గోలీ సోడా సీసాలు అప్పట్లో జర్మనీలో తయారయి మన దేశానికి దిగుమతయ్యేవట. ఇప్పుడైతే మన దేశంలోనే వీటిని కొన్ని రాష్ట్రాలలో ప్రత్యేకించి తయారు చేస్తున్నారు.
అయితే ఒక్కటి, మరీ ఎక్కువగానూ ఈ సోడాలు తాగడం మంచిది కాదనేవారూ ఉన్నారు. ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు తలెత్తే ప్రమాదముందని చదవకపోలేదు.
అమెరికాలో సోడా తాగేవారు ఎక్కువని వినికిడి.
తమిళంలో గోలీసోడా టైటిలుతో 2014 జనవరిలో ఓ సినిమా విడుదలైంది. ఎస్.డి. విజయ్ మిల్టన్ రచించి, దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కిశోర్, శ్రీరాం, పకోడా పాండి తదితరులు నటించారు. ఇక తెలుగులో సోడా గోలీసోడా పేరుతో 2018 ఫిబ్రవరి 16న సినిమా విడుదలైంది. మల్లూరి హరిబాబు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో మానస్, నిత్యా నరేష్, కారుణ్య తదితరులు నటించారు.
భువనగిరి సత్య సింధు నిర్మించిన ఈ చిత్రానికి భరత్ సంగీతం సమకూర్చారు.
కనుక గోలీసోడా మాట మామూలుగా అన్పించినా అదేం సామాన్యమైంది కాదు. తరచిచూస్తే బోలెడంత కథనాన్ని కలిగి ఉందీ గోలీసోడా.కామెంట్‌లు