డాంబికులు;-ఏ.బి ఆనంద్,ఆకాశవాణి.
 జీవితంలో మనం మంచి వాళ్లను చూస్తాము, మంచి వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో గమనిస్తాము  ఈ మంచి వారు  మనసులో ఏది అనుకుంటారో  ఎదుటివారికి చెప్పేది అదే చెబుతారు  చేసేది తప్పకుండా అదే అయి ఉంటుంది. అలాంటి వాళ్ళను చాలా తక్కువ మందిని చూస్తాం.  కొంతమంది డాంబికాలు పలుకుతారు. మనసులో ఆలోచించేది ఒకటి పైకి చెప్పేది మరొకటి,  చేసేది ఇంకొకటి  మనోవాక్కాయ కర్మలతో సంబంధమే ఉండదు. భగవంతుడు ఉన్నాడు అని కొంత మంది వాదిస్తారు  భగవంతుడు ఎక్కడ ఉన్నాడు అది ఒక రాతి బొమ్మ అని చెప్పే వాళ్ళు మరి కొంతమంది ఉన్నారు. నిజంగా మనసులో  నమ్మి ఆ మాట చెబుతున్నారా ? నిజంగా భగవంతుడి మీద  దృష్టివల్ల వాళ్ళు  నిత్యం పూజలు చేసుకుంటూ సంప్రదాయం ప్రకారం చేయవలసిన పని చేస్తూ ఉన్నారా? వీరు ఇప్పుడు అవన్నీ చేస్తారు కానీ  బయటకు వచ్చినప్పుడు దానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటాడు. మా ఇంట్లో పూజలకు ఆస్కారమే లేదు అని చెబుతాడు. ఒక సందర్భంలో నేను మతాంతర వివాహం చేయవలసి వచ్చింది  కమ్మవారి అమ్మాయి, మాదిగ యువకుణ్ణి ప్రేమించి  వారి పెద్దలు అంగీకరించకపోతే నా సలహా కోసం వచ్చి వారి వివాహం చేయమని కోరారు. నాకు తెలిసిన ఒక నాస్తికుని ఇంట్లో  ఏర్పాటు చేసి ఆ గృహస్థుని కూడా వక్తగా పిలిచి  కార్యక్రమం ప్రారంభించాను.  ఆ రోజుల్లో బ్రాహ్మణ కులంలో పుట్టి బ్రహ్మర్షిగా ప్రపంచ ప్రఖ్యాతి చెంది మాదిగ స్త్రీ ని అరుంధతిని వివాహమాడితే  ఈ రోజు ఈ నూతన  వధూవరులను  సంరక్షించుకుని చేయవలసిన పరిస్థితి అంటూ నాకు తెలిసిన ఉదాహరణలను  చెబుతూ దీనిలో ఏమీ తప్పులేదు అని ముగించాను. వక్తగా వచ్చిన  నాస్తికుడు తన ప్రసంగాన్ని ప్రారంభిస్తూ నేను ఇలాంటి వివాహాలను ఎన్నిటినో చూశాను, కొన్నిటిని చేశాను కూడా. భగవంతుని దయవల్ల  వారంతా చక్కగా కాపురం చేసుకుంటూ సుఖమయ జీవితాన్ని గడుపుతున్నారు  అంటూ ముగించాడు. నాకు నవ్వు వచ్చినా ఆపుకున్నాను. అతను ఎంత నాస్తిక వాదాన్ని  ప్రచారం చేస్తూ ఉన్నా  అతని మనసు ఆస్తికత వైపే ఉంది అన్నది నాకు స్పష్టంగా అర్థమయింది.  మనసులో భగవంతుడు అన్న శబ్దం లేకపోతే  ఉపన్యాసంలో ఆ శబ్దాన్ని వాడి ఉండేవాడు కాదు. కనుక వేమన గారు చెప్పిన అద్భుతమైన నీతి
మంచివాడిగా ప్రవర్తిస్తున్నాను అనుకున్న వాడి మనసు  ఎదుటివారికి తెలియకపోయినా ఆ శివస్వరూపానికి తెలియదా అని చెప్తాడు వేమన మహాశయుడు.  నాకు ఇది ప్రత్యక్ష అనుభవం.

అంతరంగమందు అపరాధములు జేసి
మంచివాని వలెను మనుజు డుండు
ఇతరులెరుగకున్న ఈశ్వరుడెరుగడా...
కామెంట్‌లు