మనసు పలికే మౌనగీతం((రెండో భాగం )) ;ఎం. వి. ఉమాదేవి
 మొదటినుండీ వాడు చాలా సున్నితమైన మనసు.ఎమోషన్స్ ఆపుకోలేని 
తత్వం సంతోష్ ది.ఇక ఆరోగ్యం కుదుటపడ్డాక కూడా 
బడికి వెళ్లనని పిల్లలువెక్కిరిస్తూ ఉన్నారని ఏడ్చాడు.అందుకే ఇంట్లోనే మాస్టారుని పెట్టి ఆయనకి జీతం ఇస్తూ టెన్త్ వరకూ చదివించాం.ఇంటర్లో మళ్ళీ కాలేజీలో ఎవరో ఏదో అన్నారని ఆత్మహత్యకి ప్రయత్నం చేశాడు.సమయానికి 
అమ్మ చూడబట్టి హాస్పిటల్లో 
చేర్చాక ప్రాణం దక్కింది. ఇక 
అప్పటి నుండీ నాలక్ష్యం సంతోష్ చుట్టూనే... 
ప్రతిరోజు ప్రతి విషయం వాడితో పంచుకున్నా,జీవితం 
మీద నమ్మకం, ఆశ కలిగేలా 
మేము ముగ్గురం వాడినో ధైర్య
వంతుడిగా తీర్చి దిద్దటంలో
విజయo సాధించాo !
    రెండేళ్లు క్రితమే బెంగళూరులో మంచి ఉద్యోగం 
వచ్చింది.పండుగలకూ, చూడాలని పించినప్పుడు వచ్చేస్తున్నాడు. తన ఫ్రెండ్స్ అన్నయ్య లకు అక్కలకు పెళ్లిళ్లు అయ్యాయని నువ్వు 
కూడా చేసుకోవాలి అన్నయ్యా అని చెప్తూ ఉంటాడు సంతోష్ !
   నాకే ఎందుకో ఆవైపు ఆలోచన పోవడంలేదు.లెక్చెరర్ 
గా నాబాధ్యతలూ అనేక బ్యాచ్ ల విద్యార్థులతో నిత్య సందడిగా ఉంది జీవితం. ఐదేళ్లుగా అమ్మ తాతయ్య పోరు పెడుతున్నారు.ఒకటే 
మాట చెప్పా ముగ్గురికీ. సంతోష్ కి చేశాకే నాపెళ్లి విషయం అని. 
       ప్రయత్నం చేస్తున్నా ఒకటీ 
సెట్ కాలేదు.కొందరు అబ్బాయి అర్భకంగా ఉన్నాడు అని వెనక్కి వెళ్లారు.కొందరేమో పెద్ద 
బ్బాయి మంచి పర్సనాలిటీ, అతనికైతే ఇస్తాం అమ్మాయిని 
అని పెళ్లిళ్ల పేరయ్యకి చెప్పేసారు. లోకం తీరుకి చాలా 
బాధనిపించేది.  
       ఇలా ఉంటే వారంక్రితం సంతోష్ ఫోన్ చేసాడు. పలక రింపులయ్యాక నెమ్మదిగా, తన 
మిత్రుని పుట్టినరోజు పార్టీలో ఒక అమ్మాయి పరిచయమైందని,విజయవాడ 
లోనే ఉంటారని, అమ్మాయికి 
బెంగళూరులో జాబ్ ఉందని.. 
తామిద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డా.. పెద్దవాళ్ళకి చెప్పే 
ధైర్యం లేదని... అమ్మకి తాతయ్యకి చెప్పి ఒప్పించు అన్నయ్యా అని ముగించాడు. 
   గొప్ప సంతోషంగా అనిపించింది.కాగల కార్యం ఇలా వాడే కుదుర్చుకోవడం దైవ సంకల్పం అనుకున్నాను. 
వెంటనే తాతయ్యకి అమ్మ కి చెప్పి ఒప్పించుకున్నా. ఇది నా బాధ్యత.  
    "ఒరేయ్, దర్శన్ నువ్వూ ఎవర్నో ప్రేమించేయ్ రా. ఇద్దరికీ 
ఒకే సారి పెళ్లి చేసి,నాకూతురు 
నేను కృష్ణా రామా అనుకుంట ఉంటాం !"అన్నాడు తాతయ్య.     
తమ్ముడు కాల్ చేసి పై ఆదివారం అమ్మాయి సౌమ్య విజయవాడ వస్తుందని,నువ్వు 
వెళ్లి చూసి మాట్లాడాలి అని అభ్యర్థన ! సరే నన్నా !
     అమ్మాయి ఫోటో, ఇంటిఅడ్రెస్స్ కూడా సెండ్ చేసాడు.అమ్మాయి అందమైనదే.తండ్రి లేడు. అమ్మ టీచర్గా రిటైర్ అయిందట
    అమ్మ, తాతయ్య ఆదివారం 
సాయంత్రం పూలు పండ్లు తీసుకొని వెళ్లి చూసిరమ్మని చెప్పారు.
    ఆ ఏరియా కూడా దగ్గరలోనే ఉంది.అపార్ట్మెంట్ నంబర్ సరి చూసుకొని వెళ్లి,కాలింగ్ బెల్ 
నొక్కాను.తలుపు తెరిచిన ఆమెని చూడగానే ఎందుకో నా గుండె వేగంగా కొట్టుకోవడం 
మొదలైంది. నావైపు సందేహంగా చూసి " మీరు? "
అంటూ ఉంటే " నేను సంతోష్ 
అన్నయ్య ని, దర్శన్ అండీ !"
అన్నా తడబాటుగా. 
   "ఓ, మీరా,లోపలకి రండీ !'
అంటూ పక్కకి తొలిగింది.గ్రిల్స్ 
దాటి లోపల హల్లో కెళ్ళా.నీట్ గా ఉన్న హాల్. ఒక వైపు టీవీ, 
మూలన అక్వేరియంలో చేపలు త్రుళ్ళి పడుతున్నయ్ నా మనసు లాగే !నిరాడంబరమైన 
పేము సోఫా సెట్.పొడుగాటి పింగాణి కుండీలో వెదురుమొక్కలు కిటికీలో 
నుండి పడుతున్న మలిసంధ్య 
వెలుగులలో ప్రతిదీ అందంగా... 
"కూర్చోండి,కాఫీ నా టీ నా"
"కాఫీ ప్లీజ్ !"అన్నా అతి కష్టంగా.లోలోపల ఏదో అలజడి.చీరకట్టులో ఆమె నడకలో కూచిపూడి కదలికలు.. "రేయ్ దర్శన్,ఏంట్రా ఇది."అంటూ నా 
అంతరాత్మ కేకలేస్తుంది. 
   పేపర్ చూస్తూ ఉన్నా. "కాఫీ తీసుకొండి ! అమ్మ గుడికి వెళ్ళి
వస్తోంది !"అంటూ ఆమె లోపల 
కెళ్ళిo ది. ఫోటో బహుశా కాలేజీ రోజులది అయి ఉంటుంది.అనుకున్న. 
    నా జీవితంలో ఇలాంటి రోజు 
ఒకటిఉంటుందని ఊహించలేదు.తొలియవ్వనపు 
రోజులు తిరిగినన్నిలా పలకరించేయా... నేను వదిలేసిన వసంతమే తిరిగి 
సలలిత రాగరసమంజరిగా నన్ను అలముకుంటున్నదా.. 
నా తల తిరిగిపోతున్నది... 
ఆలోచన ప్రవాహంలో కొట్టుకు 
పోతున్నపుడు,ఒక పెద్దామె లోపలకి వచ్చింది.చేతిలో పూజ బుట్ట.ప్రసన్నంగా చూస్తూ 
"ఎప్పుడు వచ్చారు బాబూ "
అని పలకరింపుగా అంటూ ఎదురుగా కూర్చుని మాటలు 
మొదలుపెట్టింది.. నా పరిస్థితిలో కొన్ని అర్థమైనా కొన్ని గాలిలో కలిసి పోయాయి. 
మా తమ్ముడి గురించి,కుటుంబం గురించి కొన్ని ప్రశ్నలు వేసి తృప్తిపడింది 
అమ్మాయి తల్లి గా ఆమె బాధ్యత అది. 
మాట్లాడుతున్నానేగాని లోపల ఏదో బాధ.అరగంటలో ఏదో 
పొడిపొడి మాటలతో సెలవు తీసుకొని ఇవతల పడ్డాను. 
నా మనసు కృష్ణబిలానికి చేరువలో జారిపోతూన్న అనుభూతి !ఇది తప్పు కదా.. 
తమ్ముడికోసం పెళ్లిపెద్దగా వచ్చి 
ఆమె గురించి మధనపడటం. 
ఇంటికి రాగానే అమ్మ నవ్వుతూ ఎదురొచ్చింది "ఏరా 
ఎలా ఉందమ్మాయి.ఏమన్నారు 
వాళ్ళు " అంటూ. 
   "తమ్ముడి గురించి వాళ్ళమ్మాయి చెప్పిందనీ,తమకు ఇష్టమేనని 
అన్నారు వాళ్ళమ్మ గారు. మంచి రోజు చూసి వాళ్ళనీ 
మనఇంటికి రమ్మని చెప్పా !"
అంటూ నా రూమ్ లో కెళ్ళి 
మంచంపై వాలిపోయాను. 
సౌమ్య ఒకటే కూతురనీ, వాళ్ళ 
బంధువులందరు ఈ ఊర్లోనే 
ఉన్నారనీ తప్ప, ఆ పెద్దామె మాటలు ఒకటీ నాబుర్ర కెక్కలేదు. 
   ఏంటిలా ఉంది నాకు.ఇదెంత 
వగలమారి మనసు. కాలేజీలో 
ఇన్నేళ్లు గా ఎంత అందమైన అమ్మాయిలూ,సీతాకోక చిలక 
ల్లాంటి యువ లెక్చెరర్లూ కంటికి 
నప్పలేదు... ఇప్పుడు... ఇవాళ ఈ పరిస్థితి రాటకు కట్టిన దూడలా... గింగిరాలు తిరిగే 
మనసు.. సౌమ్య చుట్టూ... 
కన్నీళ్లు దిండును తడుపుతూ.. 
ఇదేమిటి ప్రేమా... మోహమా.. 
మోహపడే వయ్యారాలు ఏమి లేవు ఆమెలో, ప్రశాంతమైన చిరునవ్వు,కళ్లలో వెలుగు అంతే  !
  పేనుకి పెత్తనమిస్తే తలగొరిగినట్లు,నేను పెద్దమనిషిలా ప్రవర్తించవలసిన 
సమయంలో..బుద్ది వక్రీకరణ ఇలా.. కృష్ణా దారి చూపు అనుకుంటూ నిద్రలోకి జారా !
  అమ్మ రావడం భోజనాలకి లేపి లేపి విసిగివెళ్లిపోవడం 
కాస్త గుర్తు !
  పొద్దున్నే తమ్ముడు కాల్ చేసాడట అమ్మకి.త్వరలో వస్తా 
మని,నిశ్చయతాంబూలాలు తీసుకోవడానికి ఏర్పాటు చేయండనీ. వారంలో నా పరిస్థితి దిగజారింది.ఏ పనీ చెయబుద్ది కావడం లేదు. ఛా, 
ముదురు బెండకాయకి ఇదేమి 
బుద్ది. సెల్ లో తరచూ సౌమ్య ఫోటో చూడడం,తప్పు అనిపిస్తుంది.ఈ ఫోటో కాలేజీ రోజులది అయి ఉంటుంది. 
ఇప్పుడు కాస్త బొద్దుగా ఉంది. నొక్కుల జుట్టు.ఎలాంటి మేకప్
లేదు.అయ్యో దేవుడా.. ఈమే కాస్త ముందే నాకు కనిపించడం జరిగుంటే... మనసు పరిపరి విధాల.. 
బాలమురళీ పాట గుర్తువస్తుంది... ఉన్నది వదిలేవు,లేనిది కోరేవు .. 
ఒక పొరబాటుకూ యుగములు పొగిలేవు.. నేను 
ఏమి వదులుకోలేదు పరాయి 
మనసు కోరడం తప్పు.. 
తాతయ్య ఒకరోజు అడిగేడు 
"దర్శన్, అలా ఉన్నావేమిరా, ఆరోగ్యం బాగా లేదా నాన్నా !"
అని. పని వొత్తిడి అంటూ తప్పించు కున్నా. 
........... (సశేషం )

కామెంట్‌లు