సాధువు స్వభావం!అచ్యుతుని రాజ్యశ్రీ

 సాధువులు అంతా భగవదేచ్ఛ మనచేతిలో ఏమీ లేదు అని నమ్ముతారు. కష్టం సుఖదుఃఖాలు వారి కి సమానం.దేనికీ కుంగరు పొంగరు.ఒకసాధువు పడవ ఎక్కాడు. హఠాత్తుగా నదివేగం పెరిగి పడవ అటూఇటూ ఊగసాగింది.జనమంతా భయంతో  గగ్గోలు పెట్టసాగారు.పడవనడిపేవాడు" అంతా దేవుని పై భారంవేసి నామస్మరణ చేయండి "అని చేతులెత్తేశాడు.కొంత మంది ఏడ్పుపెడబొబ్బలు పెడితే  ముసలిముతక నిర్లిప్తత తో ఉండిపోయారు. సాధువు మాత్రం దైవస్మరణ చేస్తూ తన దగ్గర ఉన్న పాత్రను నదినీటిలో ముంచి పడవలో పోస్తుంటే  కొంత మంది గొణగడం మొదలుపెట్టారు "ఏమయ్యా!నీకేమైనా పిచ్చి పట్టిందా? అసలే పడవ నీటిలో మునిగేలాఉంది.నీవు అలాపడవలో నీరు పోస్తావేంటి? బరువు ఎక్కువై ఇప్పుడే మునిగి అందరం చస్తాం ". కానీ సాధువు వారి మాటలు వినిపించుకోలేదు.కాసేపటికి  పడవ కుదుట పడి ప్రయాణం సాఫీగా సాగింది. సాధువు దైవస్మరణ చేస్తూ పడవలోని నీటిని తిరిగి నదిలో పారబోయసాగాడు. "ఏమయ్యా !నీకేమైనా పిచ్చా? పడవమునిగే టైంలో నీరు పడవలో పోసి దాని బరువు పెంచావు.ఇప్పుడు లోపలినీటిని నదిలోకి పోస్తున్నావు."అని ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు తిట్టసాగారు.అతను ప్రశాంతంగా ఇలా అన్నాడు "నేను అంతా దైవనిర్ణయం అని నమ్ముతాను. పడవ మునిగిపోయే స్థితి దేవుని ఇచ్ఛ అనుకున్నాను.అందుకే  నదిలోనీరు పడవలోకి పోశాను.ఆపద తొలగింది.అందుకే  నీటిని మళ్లీ   నదిలోకి పోశాను.మన మంచి చెడులు అన్నీ ఆయన చేతిలోనే ఉంటాయి. భగవంతుని చేతలముందు మనం నిమిత్తమాత్రులం! ఎన్ని ప్రయత్నాలు చేసినా దేవుని దయలేనిదే మనం ఏమీ చేయలేము.దుర్యోధనుడి లాగా దురహంకారంతో ఉండరాదు.శరణాగతి భావం తో మన ప్రయత్నం మనంచేస్తూ ఆయనపై భారంమోపటమే సాధువు గా నాకర్తవ్యం" నిజమే!ప్రకృతి విజృంభించితే మనం దూదిపింజలా ఎగిరి పోతాం. అహంకారం ఉండరాదు. 🌹
కామెంట్‌లు