ఎలుకల పెళ్ళి;-- యామిజాల జగదీశ్
 ఓ మునివర్యుడు గంగలో స్నానం చేయడానికి వెళ్ళాడు. స్నానం కానిచ్చుకుని ఒడ్డుకు చేరాడు. అప్పుడు ఓ చిట్టెలుక ఆయన మీద పడింది. అదొక ఆడ ఎలుక. వెంటనే ఆయన పైకి చూశాడు.
ఆకాశంలో ఓ డేగ ఎగురుతుండటం కనిపించింది. బహుశా ఆ డేగే ఈ ఎలుకను పొరపాటున వదలి ఉంటుందనుకున్నాడు.
ఎలుక గిజగిజలాడుతోంది. మునివర్యుడికి దాని స్థితి చూసి జాలి పడ్డాడు. ఆయన ఏదో మంత్రం చెప్పేసరికి వెంటనే అది ఓ చిన్న అమ్మాయిగా మారిపోయింది. ఆ పిల్లను తన ఆశ్రమానికి తీసుకుపోయాడు. అల్లారుముద్దుగా దానిని పెంచాడు. కాలం గడిచింది.దానికి పెళ్ళీడొచ్చింది. ఎవరికిచ్చి పెళ్ళి చేయాలా అని ఆలోచించి సూర్యుడికిచ్చి పెళ్ళి చేయాలనుకున్నాడు. ఎందుకంటే సూర్యుడే బలవంతుడు అని అనుకున్నాడు. సూర్యుడిని రప్పించి "ఇతను నీకు ఇష్టమేనా?" అని అడిగాడు.
వామ్మో...ఇతనా? ఇతను చాలా వేడి. నాకొద్దు" అంది ఆ అమ్మాయి.
"పోనీ మేఘాన్ని చేసుకుంటావా? మేఘం నాకన్నా బలమైనది....అది తరచూ నన్ను కప్పేస్తుంటుంది" అన్నాడు సూర్యుడు. 
ముని వెంటనే మేఘాన్ని రప్పించాడు.
మేఘాన్ని చూడటంతోనే "అయ్యో...ఈయనా...ఈయనను చూడాలంటేనే భయమేస్తోంది" అంది అమ్మాయి.
"గాలి నా కన్నా బలమైనది. ఐది నన్ను వెంటబడి తరుముతుంటుంది. కనుక గాలిని చేసుకో" అంది మేఘం. 
ముని గాలిని రప్పించాడు.
గాలినిచూడటంతోనే "ఈయనతో నేనెట్టా బతకాలి? ఈయన ఓ చోటంటూ ఉండడు. ఎప్పుడూ పరుగులు తీస్తూ ఉంటాడు. కనుక ఈయనొద్దు కనుక ఈయనకన్నా బలశాలినే నేను పెళ్ళి చేసుకుంటాను" ఆంది అమ్మాయి.
అప్పుడు గాలి "నాకన్నా బలవంతుడు కొండే. నేను కొండను రవ్వంతకూడా కదపలేను" అంది. 
అది నిజమే కదా అనుకున్న ముని కొండను రప్పించాడు.
కొండను చూడటంతోనే "ఈయనా? ఈయన ఎగుడుదిగుడుగా ఉంటాడు. ఉన్న చోటు నుంచి ఒక్క అంగుళంకూడా కదలలేడు. కనుక నేనీయనను చేసుకోను  ఇంతకన్నా బలశాలి లేరా?" అంది అమ్మాయి.
"ఎందుకు లేరు? ఉన్నారు. ఓ చిట్టెలుక ఉందిగా. అది నా కన్నా బలమైనది. అది నాకే కన్నం వేసేస్తుంది" అన్నాది కొండ.
వెంటనే ముని ఓ చిట్టెలుకను రప్పించాడు. 
దానిని చూడటంతోనే "ఆహా! అందమంటే ఈ చిట్టెలుకదే. ఎంత ఠీవీ! ఎంత చురుకుతనమో!" అని ఆశ్చర్యపోయింది అమ్మాయి. 
ఆ మాటలు వినడంతోనే ముని సంతోషించాడు. వెంటనే ఓ మంత్రం చెప్పగా ఆ అమ్మాయి పూర్వరూపమైన చిట్టెలుకగా మారిపోయింది. 
ముని ఆ రెండింటికీ ఎంతో ఘనంగా పెళ్ళి చేసాడు.
(తమిళంలో చదివిన కథ)

కామెంట్‌లు