*భర్తృహరి సుభాషితములు - పద్యం (౦౭౩ - 073)*
 *పరోపకార పద్ధతి*
మత్తేభము:
*ఒకచో నేలను బవ్వళించు, ఒకచో నొప్పారుఁబూ సెజ్జపై,*
*నొకచో శాకము లారగించు, నొకచో నుత్కృష్టశాల్యోదనం,*
*బొకచోఁబొంత ధరించు, నొక్కొకతరిన్ యోగ్యాంబరశ్రేణి; లె*
*క్కకు రానీయఁడు కార్యసాధకుఁడు దుఃఖంబున్ సుఖంబున్ మదిన్.*
*తా:*
ఏదైనా ఒక పనిని సాధించాలి అని అనుకున్న మనిషి కాలాన్ని బట్టి నేల మీద పడుకుంటారు, కుదిరితే పూలు అలంకరించిన మంచము మీదా పడుకుంటారు. తినడానికి ఏమీ దొరకనప్పుడు కాయ గూరలు, పండ్లు తింటారు. దొరికినప్పుడు అన్ని పదార్ధాలతో భోజనం చేస్తారు. వేసుకోడానికి బట్టలు దొరకక పోతే బొంత కప్పుకుని కాలక్షేపం చేస్తారు. కుదిరినప్పుడు పట్టుబట్టలు వేసుకుంటారు. పని సాధించాలి అనుకునేవారు, కష్టాలు వచ్చాయని కుంగి పోరు, సంతోషాలు కలిగాయని పొంగిపోకుండా తలపెట్టిన పనిని సాధిస్తారు........... అని *"ఏనుగు లక్ష్మణకవి"* చెపుతున్నారు.
*భావం:*
*మళ్ళీ మహాభారతమే మనకు మార్గ సూచి. పాండవులు రాజ్యభ్రష్టులైన తరువాత అడవులలో అరణ్య వాసం చేసే సమయంలో ఎన్నెన్నో కష్టాలు  అనుభవించ వలసి వచ్చింది. ఆతరువాత, అజ్ఞాత వాసం లో తమ వేషాలను మార్చుకుని, తాము ఎవరు అనే విషయం పరాయివానికి తెలియకుండా వేరొకరి ఇంట దాస్యం చేసి బ్రతుకు గడపవలసి వచ్చింది. ఇంత కష్టాల కడలిలో ప్రయాణం చేస్తూ కూడా, పాండవులు ఎనాడూ తమ స్థైర్యాన్ని కోల్పోలేదు. పరమాత్ముని నుండి తమ నమ్మకాన్ని చెదరనీయ లేదు. చివరకు కురుక్షేత్ర సంగ్రామంలో పాండవులు విజయులుగా హస్తినను ఏలుతారు. మనమందరం కూడా వీరందరి నుండి స్పూర్తి పొంది, మన జీవితాలలో వచ్చే, కనిపించే కష్టాలను పెద్దవిగా ఊహించుకోకుండా, ధైర్యాన్ని కూడదీసుకుని, పరిస్థితులకు ఎదురీది మనకు మనం నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకునే విధంగా పరమాత్ముని కరుణ మనందరి మీద ఉండాలి అని సకలలోకేశ్వరుని వేడుకుంటూ..... .*
..... ఓం నమో వేంకటేశాయ

Nagarajakumar.mvss

కామెంట్‌లు