*భర్తృహరి సుభాషితములు - పద్యం (౦౮౧ - 081)*
 *దైవ పద్ధతి*
చంపకమాల:
*గురుఁడు గురుఁడు, వాలు శతకోటి, సుపర్వులు వాహినీపతుల్,*
*సురభవనంబు గోట, మధుసూదనుఁడున్ సయిదోడు, దంతి ది*
*క్కరిపతి గాఁగ నొప్పుబల ఘాతియు దాయల కోడె నాజిలో*
*శరణము దైవమే, పురుష శక్తినిరర్ధక మెన్నిభంగులన్.*
*తా:*
బృహస్పతిని గురువుగా వుంచుకుని, దేవతలందరూ సేనాధిపతులుగా వున్నా, దేవతల కోట అయిన అమారవతే ఇల్లుగా వున్నా, ఐరావతము అనే దేవ ఏనుగు తన వద్ద వున్నా, విష్ణుమూర్తినే స్నేహితుడుగా కలిగి వున్నా, వజ్రాయుధమే తన ఆయుధముగా వున్నా కూడా ఇంద్రుడు యుద్ధములో ఎన్నో సార్లు దాయాదులైన రాక్షసుల చేతిలో ఓటమి ఎదుర్కొన్నాడు. పురుషుని ధైర్యము, వీరత్వము అన్ని వేళలా ఉపయోగపడదు. ఏ విధంగా చూసినా, దైవబలమే అతి ముఖ్యమైన తోడు ఎవరికైనా......... అని *"ఏనుగు లక్ష్మణకవి"* చెపుతున్నారు.
*భావం:*
*"రామాయణం మన జీవన పారాయణం " ఇందులో ఎటువంటి సంశయము లేదు. రామునికి సహాయం చేయడానికి కోతులు బండరాళ్ళు సముద్రము లో వేస్తే, మునిగి పోకుండా తెలుతాయి. కానీ, అదే బండరాయిని రాముడు వేస్తే, అది మునిగి పోతుంది. రాముడు, జాంబవంతుని అడుగుతాడు. "మీరు వేసిన రాళ్ళు తేలుతున్నాయి, నేను వేస్తే మునిగి పోతున్నాయి. ఎందువల్ల" అని. రామ నామం ఇచ్చిన దైవ శక్తి వల్ల తేలియాడాయి, అని చెప్పాడు, జాంబవంతుడు. కుంభకర్ణుని సలహా మేరకు రావణుని వధించడానికి రామబాణం విడిచిపెట్టే ముందు, నాభికి బాణం గురి పెట్టడం ధర్మం కాదని, ఆకాశం లోకి బాణాన్ని విడిచి ఆ బాణాన్ని సరియైన మార్గంలో నడిపించమని ధర్మదేవతని ప్రార్ధించాడు, రామభద్రుడు. మనకు, ఇంతకంటే ఏమి నిదర్శనం కావాలి, దైవబలం తోడైతేనే మానవ బలం గెలుపుదారి పడుతుంది అని చెప్పడానికి. ఇంత ముఖ్యమైన ఆ పరమాత్ముని సహాయ, సహకారాలు, దిశా నిర్దేశము, మనమందరంకు ఇబ్బడిముబ్బడి గా వుండాని, అలన్మేల్మంగా పద్మావతీ సమేత వేంకటేశ్వరుని వేడుకుంటూ....... .*
..... ఓం నమో వేంకటేశాయ

Nagarajakumar.mvss

కామెంట్‌లు