నవ్వండి....నవ్వండి...;-కంచనపల్లి వేంకట కృష్ణారావు9348611445


  హాయిగా నవ్వండి,పగలబడి నవ్వండి,పొట్ట చెక్కలయ్యేట్టు నవ్వండి-----కనీసం రోజులో ఒక్కసారైనా.ఆ నవ్వే మీ అందం పెంచుతుంది.గుండెకు మెదడుకు శక్తినిస్తుంది! నీ చుట్టూ ఉన్న వారిలో ఆశావహవాతావరణం కల్పిస్తుంది.
       ఎవరైనా ఇంటికివచ్చినపుడు మొహం మీద చిరునవ్వు లేకుండా ఎర్రటి కళ్ళతో మాట్లాడితే ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఈ ఉరుకుల పరుగు జీవితాల్లో ఆ నవ్వులు కరవై పోతున్నాయి. అందుకే నవ్వాల్సిన అవసరం, నవ్వుల వలన లాభాలపై పరిశోధనల అవసరం ప్రపంచ వ్యాప్తంగా అవసరమై పోయాయి!
        అదిగో ----ఇంటికి ఎవరైనా వస్తే మీరు బాత్ రూమ్ లో ఉండవచ్చు లేకపోతే పనిమీద ఎక్కడో తిరుగుతుండవచ్చు, మీరు వచ్చే లోపల వారికి ఓ దిన పత్రిక ఇస్తే తెలిసిన విషయాలు, పెరిగిన ధరలు,భయపెట్టే రాజకీయాలు వారి మనస్సును క్రుంగదీయవచ్చు. అందుకే మీ డ్రాయింగ్ రూములో ఓ జోకుల పుస్తకం లేక కార్టూన్ పుస్తకం పెట్టండి. మీ పనులు అన్నీ అయిపోయి మీరు వచ్చేసరికి  వచ్చిన మిత్రుడో,అతిథో నవ్వు మొహంతో కనబడతాడు. ఆ తరువాత మీ సంభాషణ ఉత్సాహంగా ఉల్లాసంగా సాగిపోతుంది! సంతోషాలు వెల్లివిరుస్తాయి!
       ప్రపంచ వ్యాప్తంగా అనేక యూనివర్సిటీలు నవ్వుల మీద పరిశోధనలు చేసి నవ్వుల వలన లాభాలను తెలియ చేశారు.ఈ నవ్వుల శాస్త్రాన్ని ' జీలోటాలజీ' అంటారు. 'నవ్వడం ఒక భోగం, నవ్వక పోవడం ఒక రోగం' అని కీ॥శే॥ జంధ్యాల అన్నారు.
      కెనడాలోని 'యూనివర్సిటీ ఆఫ్ టొరేంటో'  వారి పరిశోధనల్లో మెదడు కుడి భాగంలోని ఫ్రాంటల్ లోబ్ నవ్వుకు కారణమవుతుందని తేలింది.నవ్వుతూ హాయిగా ఉంటే బాధను కలిగించే కార్టిసాల్ హార్మోను మోతాదు తగ్గి  ఆనందంగా ఉండవచ్చు!
      నవ్వుతే గుండెమీద వత్తిడి, మానసిక సంఘర్షణలు గణనీయంగా తగ్గినట్టు పరిశోధనలు తెలియ చేస్తున్నాయి.మరొక పరిశోధన ఒంటరిగా ఉండి నవ్వడంకన్నా ఓ జోకుగానీ,హాస్య సన్నివేశంగానీ గుంపులో ఉండి వింటేఎక్కువ మంది హాయిగా నవ్వుతున్నట్లు పరిశోధనల్లో తెలుసుకున్నారు.అందుకే లాఫింగ్ క్లబ్బులు ప్రపంచ వ్యాప్తంగా తయారయి నవ్వలేని వాళ్ళను కూడా  మనసారా నవ్విస్తున్నాయి!
      నిత్యం పని వత్తిడిలో మునిగిపోయే కార్పోరేట్ సంస్థల్లో హాస్యానికి కూడా పెద్ద పీఠ వేస్తున్నారు. వారి కంప్యూటర్లలో జోకులు,నోటీసు బోర్డుల్లో జోకులు మీటింగ్ జరుగుతున్నప్పుడు ఊక దంపుడు ఉపన్యాసాల,డిస్కషన్లే కాకుండా మధ్యలో జోకులు కూడా ఒత్తిడిని తగ్గించి వారి పని తీరును మెరుగు పరుస్తున్నట్టు చెబుతున్నారు.
       అంతెందుకండీ, మన పూర్వీకులు నవ్వు ఆవశ్యకతను గురించి ఎప్పుడో తెలుసుకున్నారు. అందుకే మన పురాణాల్లో,జానపద కథల్లో పని వత్తిడి పెరిగి పోయిన రాజుగారికి వత్తిడి తగ్గించడానికి ఆస్థాన విదూషకుడు ఉన్నట్టు తెలుసుకదా!
        హాస్య కావ్యాలకు కూడా మనవాళ్ళు పెద్ద పీఠ వేశారు.విజయరంగ చొక్కనాథుని ఆస్థాన కవి వేంకట కృష్ణప్ప ప్రబంధం 'అహల్యా సంక్రందన' లో హాస్య రసంకూడా చొప్పించాడు! ముక్కు తిమ్మన రచనలలో కూడా హాస్యరసం చూడవచ్చు. బ్రటిష్ వారి కాలంలో పానుగంటి నరసింహారావు,ముణిమణిక్యం నరసింహారావు వంటి అనేక మంది హాస్యానికి పెద్దపీఠ వేశారు!
          మీ మూడ్ బాగలేకపోతే ఓ హాస్యపుస్తకం చదవండి,కడుపుబ్బ నవ్వించె కార్టూన్ చూడండి.
      మీకు నవ్వు తెప్పించే కార్టూన్లు, జోకులు పత్రికలనుండి కత్తిరించి ఓచక్కని బుక్ తయారు చేసుకోండి.మీరు తయారు చేసిన ఈ కలెక్షన్ చూసినపుడు సంతోషం,తృప్తి మిగిలి పోతాయి!
       లక్షమందిలో ఒకరు ఎందుకో నవ్వలేరు, ఆ జబ్బుని వైద్య పరిభాషలో 'మొయ్ బియస్ సిండ్రోమ్' (moebius syndrome)అంటారు.
       ఇవండీ నవ్వును గురించిన విశేషాలు.
                   ***********

కామెంట్‌లు