గురక కొన్ని విశేషాలు;-కంచనపల్లి వేంకట కృష్ణారావు9348611445

   గురక పెట్టేవాడు మన పక్కన పడుకుంటే మన నిద్దర సంగతి అంతే! కొంతమంది దంపతులలో ఎవరు కప్పు ఎగిరేట్టు గురక పెట్టినా,రెండోవారికి నిద్ర లేక నరకయాతనే! ఈ కారణం చేత కొందరు విడాకులు తీసుకున్నట్టు కొన్ని వార్తలు ఉన్నాయి!
       45శాతం మంది పెద్దలు గురక పెడతారు.అందులో నలుగురిలో ఒకరు చాలా ఎక్కువగా గురక పెడతారు.గొంతులో నాలుకలో ఉన్న లోపాల వలన కలిగే ప్రకంపనాల వలన గురక రావొచ్చు. స్థూలకాయం, కొన్నిరకాల మందులు, ఆల్కోహాలు ఈ గురక సమస్యను మరింత పెంచవచ్చు.!
       గురక ఎక్కువై శ్వాస తీసుకోవడం ఇబ్బంది అవుతే వెంటనే చెవి,ముక్కు,గొంతు స్పెషలిస్టును కలసి తగిన సలహా పొందాలి.గురక వలన మంచినిద్ర పాడవవచ్చు.
   గురకకు ' కంటిన్యుయస్ పాజిటివ్ ఎయిర్ వేస్ ప్రషర్'(CPAP) అనే మిషను ముక్కుకు అమరుస్తారు.ఇది కొంత వత్తిడిని కలిగించి శ్వాసకు ఇబ్బంది లేకుండా గాలిని గొంతులోకి పంపుతుంది.
      మనిషి లావు,బరువు ఉంటే సాధ్యమైనంత వరకు బరువు తగ్గించుకుంటే గురక సమస్య పది శాతం తగ్గుతుంది.
      స్విస్ దేశ శాస్త్రజ్ఞుల పరిశోధనల ప్రకారం నోటితో వాయించే సంగీత పరికరాల వలన, ముఖ్యంగా  ఆస్ట్రేలియా లో కొండజాతి వారు వాయించే  'డిడ్జెరిడూ' అనే వాద్యము వలన కూడా గురక తగ్గుతున్నట్టు గమనించారు. ఈవాద్యము గొంతు కండరాలను బల పరుస్తుందట.
        నిజానికి గురకకు చికిత్స చేయడం చాలా కష్టం.
గురక నోరు,గొంతు వివిధ చోట్ల ఏర్పడిన చిన్న లోపాల వలన వస్తుంది.ఎండోస్కోపీ పరికరం ద్వారా ఈ లోపాలు గుర్తించి వైద్యులు(ENT) తగిన చికిత్స చేయగలరు.
       దీని చికిత్స కోసం మందుల అంగట్లో అమ్మే మందులు కొని వేసుకోక పోవడం శ్రేయస్కరం.కేవలం డాక్టర్లు ఎక్కడ సమస్య ఉందో గమనించి చికిత్స చేయగలరు. కొన్ని రకాల యోగాసనాలు కూడా ఈ సమస్యకు ఉపయోగ పడుతున్నట్లు చెబుతున్నారు.
(భుజంగ ఆసనం, ప్రాణాయామం, ఓంకార సాధన మొదలైనవి)
       ఒక్కొక్కసారి మనం పడుకునే భంగిమకూడా గురకను పెంచవచ్చు! 
       గురక మరీ ఎక్కువైనపుడు,నిద్రకు, శ్వాసకు సమస్య ఎక్కువైనపుడు.శస్త్ర చికిత్స నిపుణుడు శస్త్ర చికిత్స చేయవలసి వస్తుంది. ఏది ఏమైనా గురక ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఒక విచిత్ర ఆరోగ్య సమస్య. దీని వలన మనకు ఎక్కువ నష్టం కలగక పోవచ్చు.మనవలన పక్కవారికి కష్టం కలగవచ్చు!
           ************

కామెంట్‌లు