మంచి చెడుల తారతమ్యం;-ఏ.బి ఆనంద్ఆకాశవాణి.94928 11322
 మనుషుల తత్వాలను గురించి మాట్లాడుతూ వారిని  మూడు భాగాలుగా విభజించారు ఒక కవి. ఉత్తములు, మధ్యములు, అధములు అని. సహజంగా మన సమాజంలో చూస్తూ ఉంటే మంచివారు, చెడ్డవారు రెండు రకాలు కనిపిస్తూ ఉంటారు. వేమన ప్రత్యేకం ఈ రెండు విషయాల గురించే మాట్లాడాడు. ఒక రకం మానవుడు ఉంటాడు అంతా నేనే చేశాను భారత దేశానికి ప్రధాన మంత్రిని, ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిని నేనే  ఎన్నిక చేశాను అన్న స్థాయిలో మాట్లాడుతూ ఉంటాడు. కోతల రాయుడు, డబ్బా రాయుడు ఎప్పుడు ఇలాగే మాట్లాడుతాడు అని ఎద్దేవా చేస్తారు వినేవారు. నిజానికి అతని ఉనికి ఎవరికీ పట్టదు  ఇంట్లో భార్య కూడా అతనిని పట్టించుకోదు కనుక అతను  మానసికంగా ఆత్మన్యూనతాభావం వుండడంతో బయట ఇలాంటి  అర్థం పర్థం లేని మాటలు మాట్లాడుతూ ఉంటాడు.  అతడిని మనం లెక్కలోకి తీసుకోకూడదు. ఒకవేళ పరిగణలోనికి తీసుకుంటే  అతనిని చాలా ఉత్తమ స్థితిలో  ఉంచినట్లు అవుతుంది. మంచి వాడిని గురించి మాట్లాడుకోవాలి అనిపిస్తే  ఎవరూ చేయలేని ఘన కార్యం తాను చేసినా ఆ విశేషాలు ఎవరికీ చెప్పుకోడు ఎవరైనా అభినందించినా  నాదేముందండి నలుగురు కలిసి రావడం వల్లనే ఆ పని చేయగాలిగమని అందరి గురించి చెబుతాడు తప్ప తనను గురించి ఎక్కువగా ఎప్పుడూ చెప్పుకోడు.  అందుకే వేమన చక్కటి మాటల్లో తన అభిప్రాయాన్ని తెలియజేశాడు.  "అల్పుడెపుడు పల్కు నాడంబరము గాను సజ్జనుండు పలుకు చల్లగాను" అని చెప్పడంతో పాటు ఉదాహరణ కూడా ఎంతో అందంగా చెప్పాడు.ఎలా పోల్చాదంటే అల్పుడ్ని కంచు తోనూ, ఉత్తముడిని బంగారం తోనూ  పోల్చి చెప్పడం ఆయన గొప్పతనం. కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా... అందరి నోళ్ళల్లో  పడి నానుడిగా  తయారైయింది.అందుకే వేమనను ప్రజా కవి అని శ్రీశ్రీ లాంటి వాడు కూడా పొగడడం.


కామెంట్‌లు
Shyamkumar chagal చెప్పారు…
నిజమే