సాల్మన్ మేధస్సు;-- యమిజాల జగదీశ్
 చాలా కాలం క్రితం గ్రీకు దేశాన్ని సాల్మన్ అనే రాజు పాలించాడు. ఆయన మహా తెలివైనవాడని అందరూ చెప్పుకునేవారు. 
సాల్మన్ తెలివితేటలను ఈజిప్టు రాణి సీబా పరీక్షించాలనుకున్నారు.
ఆమె పలు రోజులు ప్రయాణం చేసి గ్రీకు దేశాన్ని చేరుకున్నారు. సాల్మన్ ఆమెను సాదరంగా ఆహ్వానించాడు. 
ఇద్దరూ ఓ పూదోట మధ్య నిర్మితమైన  ఓ భవనంలో అప్పటికే అమర్చిన రెండు ఆసనాలలో కూర్చుని మాటలు మొదలుపెట్టారు.
"ఎటువంటి సమస్యనైనా మీరు ఇట్టే పరిష్కరిస్తారని అందరూ అనుకోవడం విన్నాను. మీ మేధావితనాన్ని నేను పరీక్షించొచ్చా" అని అడిగారు ఈజిప్టు రాణి.
"ఓహో...తప్పకుండా...అందుకు కాదంటానా" అన్నాడు సాల్మన్.
సీబా తనతో వచ్చిన ఓ సహాయకురాలి వంక చూశారు. ఆ చూపేమిటంటే, ఆ అమ్మాయి తన దగ్గరున్న సంచీలోంచి మూడు పువ్వులను తీసి అక్కడున్న బల్లమీద ఉంచడం. 
ఆమె ఇద్దరికీ మధ్య ఉన్న ఓ బల్ల మీద వాటిని ఉంచింది.
అవి మూడు పువ్వులు. చూడటానికి ఒకేలా ఉన్నాయి. వర్ణంలోనూ, అందంలోనూ ఒక్కలాగానే ఉన్నాయవి.
ఆ మూడు పువ్వులను చూపిస్తూ సీబా “రాజా, ఈ మూడు పువ్వులు చూడడానికి ఒక్కలాగానే ఉన్నాయి కదండీ. కానీ ఒక్కటే నిజమైన పువ్వు. మిగిలిన రెండు పువ్వులూ కృత్రిమమైనవి. మీరు ఉన్న చోటు నుంచే ఆ పువ్వలలో ఏది నిజమైనదో చెప్పాలి” అన్నారు.
సాల్మన్ ఆ మూడు పువ్వులను తదేకంగా చూశారు. ఆయనకు తేడా ఏమీ కనిపించలేదు. కాస్సేపు ఆలోచించారు. 
దగ్గర్లోనే ఉన్న ఓ భటుడిని పిలిచి బాగా గాలి వీస్తోంది. కిటికీ తలుపులన్నీ తెరచి ఉంచు అన్నారు. 
భటుడు అలాగే అంటూ కిటికీ తలుపులు తెరిచాడు. 
చల్లటి గాలి. హాయిగా ఉంది మనసుకి.
చాలాసేపు పువ్వులను చూశాడు. మధ్యలో ఉన్న పువ్వే నిజమైనది అన్నాడు సాల్మన్. మిగిలిన రెండూ నకిలీవి అన్నాడు.
ఆయన జవాబుకు రాణి సీబా ఆశ్చర్యపోయింది.
అప్పుడు సాల్మన్ తాను ఎలా నిజమైన పువ్వుని గుర్తించానో చెప్పాడు...
పూదోటలో ఎగురుతున్న భ్రమరాలలో ఒక్కటైనా లోపలకు రాదా అని ఆలోచించి కిటికీ తలుపులు తెరవమని చెప్పాను. అనుకున్నట్టే ఒక భ్రమరం లోపలికి వచ్చి మధ్యలో ఉన్న పువ్వు మీద వాలి మకరందాన్ని తాగి దాహం తీర్చుకుని వెళ్ళిపోయింది. అది మిగిలిన రెండు నకిలీ పువ్వులను పట్టించుకోలేదు. దాంతో నిజమైన పువ్వు మధ్యలోనిదే అని నిర్ణయించుకుని చెప్పానన్నాడు సాల్మన్. 
వావ్ అంది సీబా.

కామెంట్‌లు